సమాజానికి కమ్యూనిస్టులు అవసరం
ABN, Publish Date - May 27 , 2025 | 12:23 AM
సమాజానికి కమ్యూనిస్టుల అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇందుకోసం ఎర్రజెండా పార్టీలన్నీ ఏకం కావాలని అన్నారు.
ఎర్ర జెండా పార్టీలన్నీ ఏకమవ్వాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
చౌటుప్పల్ మే 26 (ఆంధ్రజ్యోతి): సమాజానికి కమ్యూనిస్టుల అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇందుకోసం ఎర్రజెండా పార్టీలన్నీ ఏకం కావాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ సమితి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో సాంబశివరావు మాట్లాడారు. కమ్యూనిస్టులపై రాక్షస నిరంకుశ పాలనను మతోన్మాద బీజేపీ కొనసాగిస్తోందని, దీనిని నిలువరించేందుకు ఎర్రజెండా వామపక్ష పార్టీలన్నీ ఏక తాటిపైకి వచ్చి ప్రజా పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని ఆయన కోరారు. ప్రతి గ్రామంలో, ప్రతి గూడెంలో వందేళ్ల సీపీఐ చరిత్రను అమరుల త్యాగాలను, పోరాట ఘట్టాలను గుర్తుచేస్తూ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. ఆగస్టు 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మేడ్చల్‌లో సీపీఐ రాష్ట్ర మహాసభలు జరుగుతాయని, సెప్టెంబరు 18వ తేదీ నుంచి 23వ తేదీన వరకు చండీగఢ్‌లో జాతీయ మహాసభలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఆదివాసీలను, మావోయిస్టులను చట్టవిరుద్ధంగా హత్యలు చేయడాని ఖండిస్తున్నామని, ఇవ్వన్నీ బీజేపీచేసిన హత్యలేనని ఆయన అన్నారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఎనకౌంటర్లు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. వామపక్ష భావజాలాన్ని, మావోయిస్టులను అంతం చేయడం లక్ష్యంగా బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని మోదీ, అమితషా ఆపరేషన కగార్‌ను చేపట్టి మావోయిస్టులను విచ్చలవిడిగా బూటకపు ఎనకౌం టర్లు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆపరేషన కగార్‌ను నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు అందజేయాలని ఆయన కోరారు. .ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాబీర్ పాషా, రాష్ట్ర సమితి సభ్యుడు కే.శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బచ్చనగోని గాలయ్య, సీపీఐ మండల కార్యదర్శి పల్లె శేఖర్‌రెడ్డి, పగిళ్ల మోహనరెడ్డి, కలకొండ సంజీవ, ఉడత రామలింగం, ఎస్‌ఏ రెహమాన, టంగుటూరి రాములు, కొండూరు వెంకటేష్ పాల్గొన్నారు.
Updated Date - May 27 , 2025 | 12:23 AM