నైపుణ్యాల పెంపే లక్ష్యం
ABN, Publish Date - May 17 , 2025 | 12:43 AM
పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, పడిపోతున్న ప్రవేశాల సంఖ్య పెంచేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది.
జిల్లాలో ప్రారంభమైన ఉపాధ్యాయుల వృత్యంతర, విద్యార్థుల యంగ్ ఇండియా శిక్షణ
(ఆంధ్రజ్యోతి-భువనగిరి టౌన్): పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, పడిపోతున్న ప్రవేశాల సంఖ్య పెంచేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది. పాఠశాలల ఆరంభం నాటికే ఆయా అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి, ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకం కలిగించేలా కార్యాచారణ రూపొందించింది.
ఉపాధ్యాయుల వృత్యంతర, విద్యార్థుల యంగ్ ఇండియా వేసవి శిక్షణ తరగతులు జిల్లాలో ప్రారంభమయ్యాయి. స్కూ ల్ అసిస్టెంట్లకు మూడు దఫాలుగా ఎనిమిది కేంద్రాలు, ఎస్‌జీటీలకు ప్రతీ మండలకేంద్రంలో వృత్యంతర శిక్షణ తరగతు లు కొనసాగుతున్నాయి. సుమారు రెండువేల మంది ఉపాధ్యాయులు శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్నారు. విద్యార్థుల్లో విద్యా సామర్థ్యంతోపాటు శారీరక, మనోవికాసానికి ఉపయోగపడే రంగాల్లో శిక్షణ కోసం యంగ్ ఇండియా పేరిట జిల్లాలో ఎంపిక చేసిన 50 పాఠశాలల్లో వేసవి శిక్షణా తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. 15 రోజులపాటు జరగనున్న శిక్షణా తరగతుల్లో యోగా, చదరంగం, ఇండోర్‌గేమ్స్, స్పోకెన్ ఇంగ్లీష్ తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో కేంద్రంలో వందమంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు నైపుణ్యాల పెంపు కోసం వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నారు.
గతానికి భిన్నంగా..
గతానికి భిన్నంగా ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. గత విద్యా సంవత్సరం వరకు పాఠశాల క్యాలెండర్ సెలవులు, పని దినాల్లో శిక్షణా తరగతులు నిర్వహించేవారు. రిసోర్స్ పర్సన్లు చార్టులు చూపుతూ బోధన విధానంలో ఎంపిక చేసిన అంశాలపై అవగహన కల్పించేవారు. కానీ ప్రస్తుతం వేసవి సెలవుల్లో పాఠశాలల్లోని డిజిటల్ బోర్డుల ఆధారంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే రిసోర్స్ పర్సన్లను కూడా అర్హతలు ఆధారంగా ఇంటర్వ్యూ విధానంలో ఎంపిక చేశారు. గతంలో కేవలం గురుకుల పాఠశాలలో మాత్రమే వారం రోజులపాటు సంబంధిత పాఠశాలల విద్యార్థులకు వేసవి శిబిరాలు నిర్వహించేవారు. కానీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు, ఉత్తమ పరీక్ష ఫలితాలు, ప్రవేశాల సంఖ్య పెంపు లక్ష్యంగా యంగ్ ఇండియా పేరిట మొదటిసారిగా వేసవి... శిక్షణా తరగతులు నిర్వహిస్తుండటం విశేషం. కాగా వృత్యంతర శిక్షణా తరగతులు ఉపాధ్యాయులకు, యంగ్ ఇండియా తరగతులు విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటున్నాయని విద్యాశాఖ అధికారులు అంటున్నారు.
విద్యార్థుల వికాసానికి దోహదం : కె ప్రభాకర్, ప్రధానోపాధ్యాయుడు,ప్రభుత్వ గంజ్ ఉన్నత పాఠశాల, భువనగిరి.
యంగ్ ఇండియా వేసవి శిక్షణ తరగతులు విద్యార్థుల మనోవికాసానికి దోహదపడుతాయి. పలు అంశాలపై నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో పాల్గొనే విద్యార్థులు శిక్షణ ముగిసేనాటికి ఆయా రంగాల్లో ఆసక్తి, నైపుణ్యం పెరిగి చదువుతోపాటు తమకు నచ్చిన రంగాల్లో రాణించే అవకాశం లభిస్తుంది. విద్యార్థులు శిక్షణా తరగతులకు క్రమం తప్పకుండా రావాలి.
ఉపాధ్యాయులు ఆసక్తి చూపుతున్నారు : మేడి భాస్కర్, శిక్షణ తరగతుల కోర్స్ డైరెక్టర్
వృత్యంతర శిక్షణా తరగతులపై ఉపాధ్యాయులు ఆసక్తి చూపుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా పాఠ్యాంశాలు బోధించాలనే తపన ప్రభుత్వ ఉపాధ్యాయుల్లోనే మొదలైంది. దీంతో శిక్షణా తరగతులకు ఉపాధ్యాయులు వంద శాతం హాజరవుతున్నారు. గతంలో శిక్షణ తరగతులంటేనే పలు కారణాలతో పలువురు ఉపాధ్యాయులు వెన్ను చూపేవారు.
అంతిమంగా విద్యార్థులకే మేలు : కె.సత్యనారాయణ, డీఈవో
ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ తరగతులలతో అంతిమంగా విద్యార్థులకే మేలు జరగనుంది. యంగ్ ఇండియా శిక్షణ తరగతుల్లో నేర్చుకున్న అంశాలను నిరంతరం కొనసాగిస్తే పలు రంగాల్లో విద్యార్థులు నైపు ణ్యం పెంపొందించుకోవచ్చు. నూతన అంశాలను ఉపాధ్యాయులు తరగతి గదుల్లో ఉపయోగించనుండటంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందనుంది.
Updated Date - May 17 , 2025 | 12:43 AM