రైతు బజార్‌లో విక్రయాలు బంద్
ABN, Publish Date - May 08 , 2025 | 12:37 AM
కొన్ని రకాల కూరగాయల దిగుమతులు నిలిచిపోవడంతో గిట్టుబాటు కావడం లేదని రైతు బజార్ దుకాణదారులు బుధవారం స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు.
కూరగాయల దిగుమతులు నిలిచిపోవడంతో...
దుకాణాదారులు, రైతులతో చర్చించిన మార్కెటింగ్ అధికారి
సాయంత్రం తెరుచుకున్న దుకాణాలు
భువనగిరి రూరల్, మే 7 (ఆంధ్రజ్యోతి): కొన్ని రకాల కూరగాయల దిగుమతులు నిలిచిపోవడంతో గిట్టుబాటు కావడం లేదని రైతు బజార్ దుకాణదారులు బుధవారం స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు. దీంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్ నుంచి భువనగిరి రైతు బజార్‌కు నిత్యం ఆలుగడ్డ, క్యారెట్, బీట్‌రూట్, చామగడ్డ, చిక్కుడు, పచ్చిమిర్చి తదితర కూరగాయలను హోల్‌సేల్ వ్యాపారులు భువనగిరి వ్యాపారులకు విక్రయిస్తుంటారు. వారు స్థానికంగా సాగైన ఇతర కూరగాయలతో కలిపి వీటిని వినియోగదారులకు విక్రయిస్తారు. రైతు బజారులో 60 దుకాణాలు ఉన్నాయి. హోల్‌సేల్ వ్యాపారులు బోయిన్‌పల్లి మార్కెట్‌లో కొనుగోలు చేసిన ధరకు రూ.2 నుంచి రూ.3 అదనంగా ఇస్తుండటంతో గిట్టుబాటు కావడం లేదని రైతు బజార్‌కు నాలుగు రోజుల నుంచి కూరగాయల సరఫరాను హోల్‌సేల్ వ్యాపారులు నిలిపివేవారు. దీంతో స్థానిక రైతు బజార్ వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. సాయంత్రం వరకు ఈ సమస్యను ఎవ్వరూ పట్టించుకోలేదు. జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.సబిత రైతుబజార్‌కు చేరుకుని సంబంధిత దుకాణదారులు, హోల్‌సేల్ వ్యాపారులు, రైతు సంఘం ప్రతినిధులతో చర్చలు నిర్వహించారు. ఇరువర్గాల చర్చలు సఫలం కావడంతో సాయంత్రం రైతుబజార్‌లో కూరగాయల విక్రయాలు యథావిధిగా సాగాయి. స్థానిక రైతులు పండించిన కూరగాయలు విక్రయించుకునేందుకు అవకాశం కల్పించి రైతుబజార్‌లో అవకతవకలు నివారించాలని కూరగాయల ఉత్పత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాదిరెడ్డి ముకుందారెడ్డి డిమాండ్ చేశారు. చర్చలో రైతుబజార్ సంఘం ప్రతినిధి యాట నాగరాజు, రైతు సంఘం ప్రతినిధులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మాటూరి బాలరాజుగౌడ్, హోల్‌సేల్ వ్యాపారి సకిలం రామకృష్ణ, రైతుబజార్ ఇన్‌చార్జి సయ్యద్ అబ్జల్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 08 , 2025 | 12:37 AM