ఉద్యాన పంటలకు ప్రోత్సాహం
ABN, Publish Date - May 22 , 2025 | 12:15 AM
రైతులను ఉద్యాన పంటల సాగువైపు మళ్లించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పంటల సాగుచేసేందుకు ముందుకు వచ్చే రైతులకు సబ్సిడీలు అందించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
పండ్లు, కూరగాయలు, పూల తోటల సాగుపై ప్రభుత్వం దృష్టి
బిందు, తుంపర సేద్యానికి రాయితీలు
రైతులకు అవగాహన కల్పించనున్న అధికారులు
3,500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ పెంపకం లక్ష్యం
వెదురు మొక్కల పంపిణీకి సన్నాహాలు
రైతులను ఉద్యాన పంటల సాగువైపు మళ్లించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పంటల సాగుచేసేందుకు ముందుకు వచ్చే రైతులకు సబ్సిడీలు అందించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.
-ఆంధ్రజ్యోతి, యాదాద్రి
ఉద్యాన పంటలను తక్కువ నీటితో సాగుచేయవచ్చు. అదేవిధంగా ఈ పంటల సాగుకు కొంత పెట్టుబడి పెడితే నిత్యం లాభాలు ఆర్జించవచ్చు. దీంతో ఉద్యాన పంటల సాగును పెంచేందుకు ప్రభుత్వం రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సదస్సుల్లో పంటల సాగుతో కలిగే లాభాలతోపాటు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను వివరించనున్నారు. సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం కింద రూ.2.65కోట్లను ప్రభుత్వం కేటాయించింది. నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్, జాతీయ వెదురు మిషన్, సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకాల ద్వారా సబ్సిడీలు ఇవ్వనుంది. పండ్ల తోటల సాగుకు 50శాతం సబ్సిడీ, కూరగాయలు, పూల తోటలకు 40శాతం సబ్సిడీ ఇవ్వనుంది. అదేవిధంగా మల్చింగ్‌కు 50శాతం, నీటి కుంటల నిర్మాణానికి 50శాతం, ఉద్యాన యంత్రీకరణకు 50శాతం, వర్నీ కంపోస్ట్, వర్మీ బెడ్‌ల నిర్మాణానికి 50శాతం చొప్పున సబ్సిడీ ఇవ్వనుంది. ఈ ఆర్థిక సంవత్సరం 2025-26లో జిల్లా ఉద్యానశాఖ ఆయా పంటల సాగుపై వార్షిక ప్రణాళికను ఖరారు చేసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 1,500 ఎకరాల్లో కొత్తగా పండ్లతోటలు, కూరగాయలు, పూలతోటల సాగును పెంచేందుకు నిర్ణయించి ఈ మేరకు రైతులను సన్నద్ధం చేసేందుకు అవగాహన సదస్సులు నిర్వహించనుంది.
బిందుసేద్యంపై
ఉద్యాన పంటలు, మొక్కజొన్న, తదితర పంటలను బిందు, తుంపర విధానంలో సేద్యం చేసేందుకు అవసరమైన పరికరాలకు ప్రభుత్వం రాయితీ ఇవ్వనుంది. పండ్లు, ఉద్యాన పంటల సాగు చేసే ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం, బీసీ, చిన్న, సన్నకారు రైతులకు 90శాతం, ఇతరులకు 80శాతం రాయితీ కల్పించనుంది. జిల్లాలో బిం దు, తుంపర సేద్య పరికరాలు అందించేందుకు ప్రభుత్వం రూ.1.13కోట్లు కేటాయించింది. తీగజాతి కూరగాయల పంటలు సాగుచేసే వారికి పందిరి నిర్మాణానికి, పొలం గట్లపై వెదురు సాగుచేసేందుకు 50శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఈ అవకాశాన్ని రైతు లు సద్వినియోగం చేసుకోవాలని ఉ ద్యానశాఖ రైతులకు అవగాహన కల్పిస్తోంది. ఆసక్తి ఉన్న రైతులు ఉద్యాన పంటలతోపాటు అంతర్గత పంటలు సైతం సాగు చేసి ఆదాయం పొందవచ్చని ఉద్యానశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
3,500 ఎకరాల్లో ఆయిల్‌పామ్
చీడపీడలు, వన్యప్రాణుల నుంచి ఎలాంటి బెడద లేకుండా 35 ఏళ్లపాటు దిగుబడి వచ్చే ఆయిల్‌పామ్ సాగును జిల్లాలో ఈ ఏడాది 3,500 ఎకరాల్లో చేపట్టాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. ఎకరానికి రూ.4,200 చొప్పున నాలుగేళ్ల పాటు మొత్తం రూ.15,800తో పాటు మొక్కలపై రూ.11,600 రాయితీని ప్రభుత్వం ఆయిల్‌పామ్ రైతులకు అందించనుంది. నాలుగేళ్లలో రైతులకు రూ.50,918 ప్రభుత్వం ఇవ్వనుంది.
రాషీ్ట్రయ కృషి వికాస్ యోజన
రాషీ్ట్రయ కృషి వికాస్ యోజన కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి 100 యూనిట్లు శాశ్వత పందిళ్లకు ప్రభుత్వం రూ.50లక్షలు కేటాయించింది. ఈ పథకం కింద ఒక్కో యూనిట్‌కు 50శాతం రాయితీ (రూ.50వేలు) కల్పించనున్నారు. ఒక్కో రైతు ఐదు యూనిట్ల వరకు రాయితీ పొందవచ్చు.
వెదురు మిషన్
జిల్లాలో తొలిసారిగా రైతుల పొలంగట్ల వెంట వెదురు మొక్కలు నాటి తద్వారా అదనపు ఆదాయం పొందేందుకు ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇవ్వనుంది. ఆసక్తి ఉన్న రై తులు సంబంధిత ఉద్యాన అధికారులకు దరఖాస్తు చేసుకుంటే మొక్కలు పంపిణీ చేస్తారు.
రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
రైతులకు పంటల మార్పిడిపై అవగాహన కల్పిస్తున్నాం. వారిని ఉద్యాన పంటల సాగు వైపు మళ్లించడమే లక్ష్యంగా తోటల సాగుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను వివరిస్తున్నాం. 2025-26 ఆర్థిక సంవత్సర లక్ష్యం చేరేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. తోటల సాగుకు 40శాతం నుంచి 100శాతం వరకు రాయితీ ఇవ్వనున్నాం. ప్రభుత్వం ఇచ్చే రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
సుభాషిణి, జిల్లా ఉద్యాన అధికారి
Updated Date - May 22 , 2025 | 12:15 AM