‘ఇందిరమ్మ ఇళ్ల’కు ఆటంకాలు
ABN, Publish Date - Jul 05 , 2025 | 12:35 AM
ఇసుక కొరత ఓవైపు.. పెరిగిన ధరలు మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రభుత్వం మంజూరు చేసే మొత్తానికి, చేసే ఖర్చు రెట్టింపు కానుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిమెంట్, స్టీలు, ఇటుకలను తక్కువ ధరకు ఇప్పించేలా చర్యలు తీసుకుంటే ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెరుగుతుందని పేర్కొంటున్నారు.
ఇసుక కొరత, సిమెంటు ధరలతో ఇబ్బంది
నామమాత్రంగా మారిన ప్రైస్ మానిటరింగ్ కమిటీలు
ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలంటున్న లబ్ధిదారులు
(ఆంధ్రజ్యోతిప్రతినిధి-నల్లగొండ): ఇసుక కొరత ఓవైపు.. పెరిగిన ధరలు మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రభుత్వం మంజూరు చేసే మొత్తానికి, చేసే ఖర్చు రెట్టింపు కానుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిమెంట్, స్టీలు, ఇటుకలను తక్కువ ధరకు ఇప్పించేలా చర్యలు తీసుకుంటే ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలకు సంబంధించి రెండు దశల్లో ఇప్పటివరకు 39,995 ఇళ్లను మంజూ రు చేశారు. ఇందులో ఇప్పటివరకు కేవలం 24 ఇళ్లు మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇం దిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇసుక, సిమెం టు, ఇటుకల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రభుత్వ నిర్దేశిత వ్యయంలో ఇంటి నిర్మాణం పూర్తికావడం కష్టమేనన్న అనుమానాలున్నాయి. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక సేకరణ ప్రధాన సమస్యగా మారింది. మరోవైపు సిమెంట్, ఇనుము ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇంటి నిర్మాణం లబ్ధిదారులకు భారంగా మారింది. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు రూ.5లక్షలు చెల్లిస్తున్నప్పటికీ లబ్ధిదారులకు ఇంతకు రెట్టింపు స్థాయిలో ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెబుతున్నారు. వీలైనంత వరకు ఇసుక, సిమెంట్ ధరలను అందుబాటులోకి తెస్తే ప్రభుత్వం ఆశించినరీతిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగి ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని, ఆ దిశగా ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ఇసుక కొరతపై ప్రస్తావన
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఉచితంగా ఇసుకను కేటాయించినా లబ్ధిదారులకు ఇసుక అందుబాటు లో లేని పరిస్థితి కొనసాగుతోంది. ఇటీవల జిల్లా ఇన్‌చార్జి మంత్రి లక్ష్మణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో ఇసుక కొరతపై ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రస్తావించడం ఇసుక కొరత తీవ్రత ను తెలియజేస్తోంది. మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్‌నారాయణపురం మండలంలో ఇసుక రీచ్‌లు లేనందున ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక అందుబాటులో లేదని, వారికి పొరుగున మండలాల్లో ఇసుకను కేటాయించాలని కోరారు. ఒక్క ఈ మండల మే కాకుండా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదా పు 20 మండలాల వరకు ఇసుక కొరత ఉం దని, ఈ మండలాల్లో స్థానికంగా ఉన్న చిన్న, చిన్న వాగులను ఇప్పటికే ఇసుక మాఫియా లూటీ చేయడంతో ఇసుక లేకుం డా పోయిందని, క్షేత్రస్థాయి పరిస్థితిని గుర్తించి అధికారులు ఈ మండలాల లబ్ధిదారులకు వేరే ప్రాంతాల్లో ఇసుకను కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. అదే విధంగా ఇసుక రీచ్‌లు ఉన్న చోట సైతం నాణ్యమైన ఇసుకను ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇవ్వడం లేదని, దీంతో లారీకి రూ.30వేల వరకు చెల్లించి బ్లాక్‌లో ఇసుకను కొనాల్సి వస్తుందని లబ్ధిదారులు వాపోతున్నారు. కలెక్టర్లు, మైనింగ్ అధికారులు ఈ విషయమై క్షేత్రస్థాయి పరిశీలన జరిపి వాస్తవికత ఆధారంగా సమీక్షించి ఇసుకను కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
నామమాత్రంగా కమిటీలు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంట్, ఇనుము, ఇటుకలు అందించేందుకు వీలుగా వ్యాపారులను ఒప్పించడంతోపాటు, ధరలను పెంచకుండా నియంత్రించే నిమిత్తం ఏర్పాటు చేసిన మండల స్థాయి ప్రైస్‌మానిటరింగ్ కమిటీలు నామమాత్రంగా మారాయి. ఈ కమిటీలు ఏర్పాటయినప్పటికీ ఇందిరమ్మ లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంటు, ఇటుకలు, ఇనుమును అందించలేకపోతున్నారని, దీంతో వ్యాపారులు చెప్పిన ధరకే కొనుగోలు చేయాల్సి వస్తుందని లబ్ధిదారులు చెబుతున్నారు. ప్రధానంగా సిమెంట్ ఇటుకల్లో నాణ్యత ఉండడం లేదని, దీంతో మట్టి ఇటుకలు కొనుగోలు చేస్తున్నామని, దీంతో ఖర్చు పెరుగుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు. సిమెంట్, ఇటుకల ధరలు పెరగకుండా తక్కువ ధరకు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
మంజూరులో ఉన్న వేగం, నిర్మాణంలో కరువు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఉన్నంత వేగం నిర్మాణంలో కరువయింది. నిర్మాణంలో క్షేత్రస్థాయిలో స్థలం కొరత, స్థలం ఉన్నవారికి నిధుల కొరత, సిమెంట్, ఇసుక తదితర సామగ్రి లభ్యతలో ఇబ్బందులతో నిర్మాణాల్లో జాప్యం జరుగుతోంది. మొత్తం 12 నియోజకవర్గాలకు సంబంధించి రెండు దశల్లో ఇప్పటివరకు 39,995 ఇళ్లను మంజూరు చేశారు. ఇందులో ఇప్పటివరకు కేవలం 24 ఇళ్లు మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయి. మొత్తం 8,887 ఇళ్లు గ్రౌండింగ్ చేయగా, 205 ఇళ్లు శ్లాబ్ వేశారు. మరో 613 ఇళ్లు గోడల నిర్మాణాలు పూర్తయి స్లాబ్ వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఇసుక కొరత లేకుండా, సిమెంట్, ఇటుకలు సరసమైన ధరల్లో నాణ్యమైనవి అందేలా చర్యలు తీసుకుంటే ఈ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా సాగుతుందని, లేదంటే నిర్మాణంలో జాప్యం.. పథకం అమలుకు భారంగా మారుతుందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.
Updated Date - Jul 05 , 2025 | 12:35 AM