ఇక.. వారికి స్థాన చలనమే
ABN, Publish Date - May 21 , 2025 | 12:35 AM
ఒకే ప్రాంతంలో ఏళ్ల తరబడి తిష్ఠవేసిన ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్) సీఈవోలను ఎట్టకేలకు బదిలీచేసేందుకు రంగం సిద్ధమైంది.
ఒకే ప్రాంతంలో తిష్ఠవేసిన పీఏసీఎ్‌సల సీఈవోలకు చెక్
30 ఏళ్లుగా చైర్మన్లకు తలనొప్పిగా మారిన కొందరు సీఈవోలు
జీవో 44 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
సీఈవోలతో పాటు స్టాఫ్ అసిస్టెంట్ల బదిలీలు సైతం
(ఆంధ్రజ్యోతి,నల్లగొండ) : ఒకే ప్రాంతంలో ఏళ్ల తరబడి తిష్ఠవేసిన ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్) సీఈవోలను ఎట్టకేలకు బదిలీచేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభు త్వం జీవో 44ను జారీ చేసింది. దీంతో దశాబ్దాల తరబడి సొసైటీల్లో ఉండి, ఆ సొసైటీలను దెబ్బతీయడమేగాక రైతుల ద్వారా ఎన్నికైనా సొసైటీల చైర్మన్లు, డైరెక్టర్ల ను లెక్కచేయకుండా పెత్తనం చెలాయిస్తూ తలనొప్పిగా మారిన సీఈవోలు బదిలీ కానున్నారు. దీంతో సొసైటీల్లో ఇబ్బందులు తొలగి అభివృద్ధి పథంలోకి వెళ్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 107 పీఏసీఎ్‌సలు ఉన్నాయి. చాలా సొసైటీల్లో 30 ఏళ్లకుపైగా సీఈవోలు తిష్ఠ వేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రైతుల కోసం ఏర్పడిన జి ల్లా సహకార కేంద్ర బ్యాంకుకు 107 ఏళ్లకుపై గా చరిత్ర ఉంది. చాలా మంది సొసైటీ చైర్మ న్లు పలుమార్లు ఎన్నికై విధులు నిర్వహిస్తున్నా రు. అయితే పలు చోట్ల సీఈవోలే షాడో చైర్మన్లుగా వ్యవహరిస్తూ చైర్మన్లను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ప్రతీ సొసైటీకి చైర్మన్ ఐదేళ్లపా టు బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. సీ ఈవోలు మాత్రం ఉద్యోగ విరమణ చేసేంత వరకు తమను ఏమీ చేయలేరనే ఆలోచనతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చాలా సోసైటీల్లో చైర్మన్‌కు, సీఈవో మధ్య పొసగక సమస్యలు జటిలంగా మారి సొసైటీల ప్రతిష్ఠ దెబ్బతినే వరకు దారితీసింది. ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివా్‌సరెడ్డి నేతృత్వంలో బ్యాంకు రూ.2,750కోట్ల టర్నోవర్‌తో ముందుకు సాగుతూ రూ.3వేల కోట్ల టర్నోవర్‌ను చేరుకునేందుకు పాలకవర్గం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సొసైటీల సీఈవోలతో పాటు స్టాఫ్ అసిస్టెంట్‌ల బదిలీకి నిర్ణయించింది. మూడు నుంచి ఐదేళ్ల సర్వీస్ పూర్తయిన వారిని వెంటనే బదిలీ చేయాల్సి ఉండగా, ఏళ్ల తరబడి ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా, బదిలీలకు ప్రభుత్వం జీవో జారీచేసింది.
ఎస్‌ఎల్‌ఈసీ మార్గదర్శకాల మేరకు
పీఏసీఎ్‌సలలో సీఈవోల బదిలీలను టెస్కాబ్ పర్యవేక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు టెస్కాబ్ అధికారులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని డీసీసీబీ, సొసైటీల్లో బదిలీల ప్రక్రియపై దృష్టి సారించారు. స్టేట్ లెవల్ ఎన్‌పవర్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎల్‌ఈసీ) మార్గదర్శకాల మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 107 సొసైటీలకు చెందిన సీఈవోలను, స్టాఫ్ అసిస్టెంట్‌లను ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేసే వీలుంది. ఇప్పటి వరకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుతో పాటు బ్రాంచ్‌లలో కిందిస్థాయి ఉద్యోగుల నుంచి పైస్థాయి అధికారుల వరకు బదిలీలు చేపట్టారు. సొసైటీల్లో మాత్రం సీఈవోల బదిలీలపై దృష్టి సారించలేదు. ఏళ్ల కొద్దీ సొసైటీల్లో సీఈవోలు కొనసాగుతూ వచ్చారు. కొన్ని నెలల క్రితం సొసైటీల పాలకవర్గాలు సీఈవోలను తొలగించాలని తీర్మానాలు చేసి డీసీఈవోలతో పాటు డీసీసీబీ సీఈవోకు, టెస్కాబ్‌కు సైతం వాటిని పంపినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో చైర్మన్‌లు, డైరెక్టర్లు పదవుల్లో ఉన్నా మాట ఖాతరు చేయని ఉద్యోగి, రైతులను ఎలా లెక్కలోకి తీసుకుంటారని ఆవేద చెందుతూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో డీసీసీబీ చైర్మన్‌గా కుంభం శ్రీనివా్‌సరెడ్డి ఎన్నికయ్యాక జిల్లా కేంద్రంలో జరిగిన మొదటి సమావేశంలోనే సీఈవోల బదిలీల కోసం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పలుమార్లు బదిలీ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదేశాల మేరకు అధికారులు బదిలీలకు జీవో 44ను జారీ చేశారు.
త్వరలో డీఎల్‌ఈఎస్ సమావేశం
రాష్ట్ర ప్రభుత్వం సీఈవోలను, స్టాఫ్ అసిస్టెంట్‌లను బదిలీ చేయడానికి నిర్ణయించి జీవో జారీ చేయడంతో ఎస్‌ఎల్‌ఈసీ సమావేశం హైదరాబాద్‌లో రెండు, మూడు రోజుల్లో నిర్వహించనున్నారు. ఎస్‌ఎల్‌ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో డీఎల్‌ఈసీ సమావేశాన్ని ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తారు. గతంలో డిస్ట్రిక్ లెవల్ ఎంపార్డ్ కమిటీ(డీఎల్‌ఈఎస్) ఏనాడు భేటీ అయిన సందర్భం లేదు. ఈ కమిటీలో డీసీసీబీ చైర్మన్‌తో పాటు డీసీసీబీ సీఈవో, డీసీవో, నాబార్డు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధికారులు ఉంటారు. వాస్తవానికి ఈ కమిటీ ఎప్పటికప్పుడూ సొసైటీల్లో చైర్మన్లు, సీఈవోలకు ఇబ్బందులు వచ్చినప్పుడు సమన్వయపర్చడం, అవసరమైతే సీఈవోను బదిలీ చేయడం వంటివి చేయాలి. ఏళ్లుగా సీఈవోల బదిలీల విషయంలో టెస్కాబ్ నిర్ణయం తీసుకోకపోవడం, డీఎల్‌ఈఎస్ సమావేశాలు నిర్వహించకపోవడంతో ఇంతకాలం సీఈవోలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఎట్టకేలకు బదిలీల జీవో జారీ కావడంతో డీఎల్‌ఈఎస్ భేటీ అయి సొసైటీల పరిస్థితులను అంచనా వేసి దీర్ఘకాలికంగా తిష్ఠవేసిన సీఈవోలకు స్థానచలనం కల్పించనున్నారు.
సీఎం, మంత్రులకు కృతజ్ఞతలు : కుంభం శ్రీనివా్‌సరెడ్డి, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్
దీర్ఘకాలికంగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న సీఈవోలను బదిలీ చేయాలని పాలకవర్గం విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో జీవో 44ను జారీ చేసినందుకు కృతజ్ఞతలు. అదేవిధంగా మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకార వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నందుకు ధన్యవాదాలు. ఎస్‌ఎల్‌ఈసీ మార్గదర్శకాలు వచ్చిన వెంటనే ఉమ్మడి జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తాం. అందుకు నాలుగైదు రోజులలోనే కమిటీని కూడా ఏర్పాటు చేస్తాం. తమ పాలకవర్గం ఆధ్వర్యంలో రూ.3వేల కోట్ల టర్నోవర్‌ను త్వరలో చేరుకుంటాం. ఈ నేపథ్యంలో సొసైటీలకు మరింత బలం చేకూర్చేలా జీవో నెంబర్ 44 జారీ కావడంతో బదిలీలకు మార్గం సుగమమైంది.
Updated Date - May 21 , 2025 | 12:35 AM