ఇక నోటీసులు
ABN, Publish Date - Jun 30 , 2025 | 12:35 AM
భూభారతిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు దృష్టిసారించారు. దరఖాస్తులకు సంబంధించి నోటీసులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించేందుకు రెవెన్యూ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.
భూ సమస్యల పరిష్కారంపై కదలిక
భూభారతి దరఖాస్తుదారులకు నోటీసుల జారీకి అధికారుల సన్నాహాలు
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయికి బృందాలు
తుది దశకు చేరుకున్న ఆన్‌లైన్ ప్రక్రియ
(ఆంధ్రజ్యోతి, యాదాద్రి): భూభారతిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు దృష్టిసారించారు. దరఖాస్తులకు సంబంధించి నోటీసులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించేందుకు రెవెన్యూ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయాల్లో నోటీసు లు సిద్ధమవుతున్నాయి.
జిల్లాలో ఈ నెల 3నుంచి 20వ తేదీ వరకు అధికారులు రెవెన్యూ సదస్సులను విజయవంతంగా నిర్వహించారు. పలు సమస్యల పరిష్కారం కోరుతూ ఈ సదస్సుల్లో రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,136 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో మొత్తం 71,823 దరఖాస్తులు వచ్చా యి. వాటిలో యాదాద్రి జిల్లాలో 14,328 దరఖాస్తులు, నల్లగొండ జిల్లాలో 12,754, సూర్యాపేట జిల్లాలో 44,741 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. దరఖాస్తుదారుల భూ సమస్య ఏంటి? ఇప్పటి వరకు ఎందుకు పరిష్కారం కాలేదు? ప్రస్తుతం పరిష్కారమార్గానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? అనే సమాలోచనలు చేస్తూ దరఖాస్తులను తిరస్కరించాల్సిన పరిస్థితి వస్తే అర్జీదారులకు సమగ్రంగా సమాధానం ఇచ్చేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతీ దరఖాస్తుకు ఎండార్స్‌మెంట్(సమాధాన నోటీసు) ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరో మూడు, నాలుగు రోజుల్లో రెవెన్యూ గ్రామాల వారీగా నోటీసులు అందజేయనున్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు బృందాలు ఏర్పాటుచేసే ప్రక్రియపై ఉమ్మడి జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
నోటీసులు మూడు ప్రతుల్లో
భూభారతి చట్టం అమలులో భాగంగా రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో అధిక శాతం సర్వే నెంబర్లు, పేర్లు మిస్సింగ్‌లతో పాటు సాదాబైనామా దరఖాస్తులు ఉన్నాయి. సాదాబైనామా దరఖాస్తులు జిల్లాలో 3,458, వరకు వచ్చాయి. వీటి పరిష్కారానికి రైతులు వేచిచూస్తున్నారు. అయితే రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులకు సంబంధించి నోటీసులు జారీ చేసేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు. నోటీసు ప్రతి ఒకటి రైతుకు, మరొకటి పంచాయతీ కార్యాలయం, ఇంకోటి తహసీల్దార్ కార్యాలయంలోని నోటీసు బోర్డులో అంటించనున్నారు. నోటీసులో పేర్కొన్న అంశాలకు సంబంధించిన అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించనున్నారు. ఈ నోటీసులను గ్రామాల వారీగా జారీచేయనున్నారు. ముందుగా మిస్సింగ్ నెంబర్లు, పేర్లు, పెండింగ్ మ్యుటేషన్, సర్వే నెంబర్లలో, పేర్లలో తప్పుల సవరణలతో పాటు చిన్న చిన్న సమస్యలను వెనువెంటనే పరిష్కరించేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు.
పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కలిగేనా?
ధరణితో భూరికార్డుల్లో పలు తప్పులు దొర్లాయి. ప్రధానంగా రైతుల భూములు మరొకరి ఖాతాల్లో వెళ్లడం, పేరు తప్పుగా పడటం, సర్వేనెంబర్లు మార్పులు కావడంతో పాటు, భూమి ఉండి కూడా రికార్డుల్లో లేని వారిగా మారిపోయారు. కోర్టు కేసులు ఉన్న భూములు కాకుండా రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో దరఖాస్తులన్నీ నెలరోజుల్లోగా పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. వీటిలో మ్యుటేషన్, పేర్లు మార్పిడి, పట్టాదారు పాస్‌పుస్తకాలు, తదితర వాటికి ప్రాధాన్యం ఇస్తూ పరిష్కరించనున్నారు. పలు మండలాల్లో భూ సమస్యలు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. అవి ఎందుకు పరిష్కారం కావడంలేదు? ఏళ్ల తరబడిగా ఎందుకు పెండింగ్‌లో ఉంటున్నాయి? ఏ అధికారి వద్ద సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న పూర్తి సమాచారాన్ని సేకరించనున్నారు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించే సమస్యలు,ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో పరిష్కరించే సమస్యలేంటో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నెలరోజుల్లో దరఖాస్తులను పరిష్కరించేందుకు ఆర్డీవోలు, తహసీల్దార్లు, కలెక్టరేట్‌లో వివిధ సెక్షన్ల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. భూభారతి చట్టం అమలులో పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలాన్ని తీసుకున్నారు. ఈ మండలంలో 776 దరఖాస్తులు అందాయి. వీటిలో 65 దరఖాస్తులను అధికారులు పరిష్కరించగా, 584 దరఖాస్తులను తిరస్కరించారు. మరో 127 దరఖాస్తులపై విచారణ కొనసాగుతోంది. కోర్టు కేసుల విషయంలో న్యాయ సలహా తీసుకునేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు :జి.వీరారెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆగస్టు 15 నాటికి పూర్తిస్థాయిలో పరిష్కరించేలా ప్రణాళిక రూపొందించాం. తహసీల్దార్‌లతో సమావేశాన్ని నిర్వహించి, నోటీసుల జారీతోపాటు తీసుకోవాల్సిన చర్యలను వివరించాం. మరో మూడు, నాలుగురోజుల్లో దరఖాస్తుదారులకు నోటీసులు అందజేస్తాం. ఆతరువాత వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం.
Updated Date - Jun 30 , 2025 | 12:35 AM