నేటి నుంచి కొత్త రేషన్‌కార్డులు
ABN, Publish Date - Jul 13 , 2025 | 11:48 PM
కొత్త రేషన్‌కార్డుల పంపిణీ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సోమవారం సాయంత్రం జరిగే సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఈ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు.
తిరుమలగిరి సభలోలాంఛనంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లాలో అత్యధికంగా కొత్త కార్డులు
ఇకపై నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ప్రకటించిన ప్రభుత్వం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ) : కొత్త రేషన్‌కార్డుల పంపిణీ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సోమవారం సాయంత్రం జరిగే సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఈ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు.
జాతీయ ఆహారభద్రతా చట్టం రూపొందించి అమలులోకి వచ్చిన సందర్భంలో ఆహారఽభద్రతా కార్డులను అందజేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అడపాదడపా ఒకటి, రెండుతప్ప విస్తృత స్థాయిలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీ జరగలేదు. పాత కార్డుల్లో కొత్త కుటుంబ సభ్యుల పేర్ల నమోదు, అదేవిధంగా కుటుంబాలు విడిపోయిన తర్వాత కొత్త కుటుంబాలకు రేషన్‌కార్డుల పంపిణీ జరగకపోవడంతో ఎన్నికల్లో ఇది ప్రధాన అంశం గా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్‌కార్డుల పంపిణీ ప్రక్రియను చేపట్టింది. రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందు కు వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. వెరిఫికేషన్ ప్రక్రియ ను సైతంనిర్వహించి కొత్తకార్డులు అందించేందుకు రంగం సిద్ధం చేశారు.
పాత, కొత్త దరఖాస్తుల నుంచి వడపోత
కొత్త రేషన్‌కార్డులను ఈనెల 14 నుంచి అధికారికంగా పంపి ణీ చేయనున్న నేపథ్యంలో అందుకోసం భారీగా వచ్చిన దరఖాస్తులను వడపోశారు. గతంలో మీ-సేవా కేంద్రాల ద్వారా చేసుకు న్న దరఖాస్తులతో పాటు, ప్రజాపాలన దరఖాస్తులు, ఇటీవల సేకరించిన దరఖాస్తులను మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇచ్చిన నివేదికల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే పలు ప్రాంతాల్లో కార్డు ఉన్నవారికి, ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్స్‌కు, పట్టణ ప్రాంతాల్లో భవనాలు ఉన్నవారికి, ఐదెకరాల పైచిలుకు భూములు ఉన్నవారికి, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారికి సైతం రేషన్‌కార్డు ఇస్తున్నారని, దీనిపై మరోసారి పరిశీలన చేయాలనే ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రధానంగా రెవెన్యూశాఖలో వీఆర్‌వోలు లేకపోవడంతో ఆర్‌ఐలే పరిశీలన బాధ్యతలు చూడడంతో వీఆర్‌ఏలపై ఆధారపడి లేక రాజకీయ నాయకుల సిఫార్సుల మేరకు అర్హుల జాబి తా తయారు చేసినట్టు పలు మండలాల్లో ఆరోపణలు వస్తున్నా యి. దరఖాస్తులను 13వ తేదీలోగా వందశాతం క్లియర్ చేయాలనే ఒత్తిడిలో అర్హుల పరిశీలనలో పారదర్శకత పాటించలేదనే విమర్శలు వస్తున్నాయి. అర్హులకే రేషన్‌కార్డులు ఇస్తే ఆహారభద్రత చట్టం ప్రయోజనం నెరవేరుతుందని, ఈ దిశగా ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 5.60లక్షల రే షన్‌కార్డులు ఇస్తుండగా, అందులో అత్యధికంగా నల్లగొండ జిల్లాకు సంబంధించినవే 50వేల పైచిలుకు ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో సోమవారం నుంచి కొత్తగా 1.33లక్షల రేషన్‌కార్డులు అందుబాటులోకి రానున్నాయి. వీరందరికీ సెప్టెంబరు కోటా నుంచి రేషన్‌బియ్యం పంపిణీ చేస్తారు. రేషన్‌కార్డులో పేరున్న ప్రతీ లబ్ధిదారుడికి ఆరుకిలోల చొప్పున సన్నబియ్యం ప్రతినెలా ఇస్తారు. సన్నబియ్యం ఇస్తున్నప్పటి నుంచి రేషన్‌బియ్యాన్ని లబ్ధిదారులు ఠంచన్‌గా తీసుకుంటున్న నేపథ్యంలో అర్హులైన కుటుంబీకులు కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది.
రేషన్‌కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ
హరీష్, నల్లగొండ జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి
రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా ప్రభుత్వం చేపట్టింది. అర్హులైన వారు, కొత్తగా నమోదయ్యేవారు ఎప్పటికప్పుడు వారి దరఖాస్తులను మీ-సేవా కేంద్రం ద్వారా, లేదా నేరుగా తహసీల్దార్ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించి అర్హులని తేలితే కార్డులు జారీ చేస్తాం. ప్రస్తుతం ప్రజాపాలన, మీ-సేవ, ఇటీవల తీసుకున్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల జాబితాను రూపొందించి కలెక్టర్ ఆమోదానికి పంపాం. కొత్తగా జారీ అయ్యే కార్డులకు వచ్చే సెప్టెంబరు నెల నుంచి రేషన్ కోటా కేటాయిస్తాం.
జిలా పాతకార్డులు కొత్త కార్డులు మొత్తం మొత్తం యూనిట్లు
నల్లగొండ 4,15,040 51,060 4,66,100 16,80,916
సూర్యాపేట 3,24,165 46,965 3,71,130 11,04,832
యాదాద్రి 2,16,831 35,368 2,52,199 7,73,871
మొత్తం 9,56,036 1,33,393 10,89,429 35,59,619
Updated Date - Jul 13 , 2025 | 11:48 PM