తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం
ABN, Publish Date - Jul 21 , 2025 | 12:37 AM
అడవి జంతువుల బాధ లేదు. కోతులతో నష్టం లేదు..కూలీల అవసరం అంతకన్నాలేదు. ఎటువంటి నష్టమూ వాటిల్లని పంటలపై రైతులు దృష్టిని సారిస్తున్నారు.
పశుగ్రాసాల సాగుపై రైతుల ఆసక్తి
యాదాద్రి జిల్లాలో 200ఎకరాల్లో సాగు
రాజాపేట, జూలై 20 (ఆంధ్రజ్యోతి):) అడవి జంతువుల బాధ లేదు. కోతులతో నష్టం లేదు..కూలీల అవసరం అంతకన్నాలేదు. ఎటువంటి నష్టమూ వాటిల్లని పంటలపై రైతులు దృష్టిని సారిస్తున్నారు. కొంత మంది రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభదాయకంగా ఉండే పంటల సాగుపై ఆసక్తిని కనబరుస్తున్నారు. యా దాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రేనికుంట, పాముకుంట, దూది వెంకటాపూర్, నర్సాపురం, చలూ ్లరు గ్రామాల్లో 200 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పశుగ్రాసాల సాగును చేపట్టి లాభాలను ఆర్జిస్తున్నారు. గడ్డిజాతి, పప్పుజాతి రకాల పశుగ్రాసాలను సాగు చేస్తూ అవసరాల మేరకు వినియోగించుకుని మిగతా పశు గ్రాసాన్ని ఇతరులకు విక్రయించి లాభాలను పొందుతున్నారు. రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామాని కి చెందిన ఎడ్ల నరేశ రెడ్డి, రేణికుంటకు చెందిన బోళ్ల రాఘవరెడ్డి కొంతకాలంగా పశుగ్రాసాలను సాగు చేస్తున్నారు. గతంలో వరి, మొక్కజొన్న ఇతర పంటలను సాగుచేసేవారు. ఆ పంటల సాగులో అడవి జంతువు లు, కోతులతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పంటల సాగులో నాట్లకు, కలుపు నివారణకు కూలీల కు అధిక మొత్తంలో డబ్బులను వెచ్చించారు. వీటికి తోడు వాతావరణం అనుకూలించక పోవడంతో ఏటా నష్టాలను చవిచూశారు. వీటన్నింటిని అధిగమిస్తూ ప్రత్యామ్నాయంగా వ్యవసాయ అనుబంధమయిన పశుగ్రాసాల సాగును చేపట్టారు. అందులో భాగంగా నేపియర్ రకాలైన నేపియర్, సూపర్ నేపియర్, బుల్లెట్ నేపియర్, తైవాన నేపియర్ రకాలను సాగు చేశారు. ఒక్కో రైతు 20 ఎకరాల వరకు సాగు చేశారు. ఎకరానికి 7 నుంచి 9 వేల పశుగ్రాసం కనుపులను నాటుకున్నారు. విత్తనాన్ని కీసర, షాద్‌నగర్ ప్రాంతాల నుంచి ఒక్క కనుపును 1నుంచి 3 రూపాయలకు కొనుగోలు చేసి తెచ్చుకుని నాటుకున్నారు. ఒక్కసారి నాటితే 5 ఏళ్ల వరకు పనిచేస్తుంది. పదే పదే విత్తనాన్ని మార్చాల్సిన అవసరం లేదు. నాటుకున్న 90 రోజులకు మొదటి కోత మొదలవుతుంది. తిరిగి 45నుంచి 60 రోజలకు రెండో కోత వస్తుంది. ఏడాదిలో 5 నుంచి 6కోతలు వస్తాయి. ఎకరానికి20 నుంచి 25 టన్నుల దిగుబడి వస్తోంది. ఏడాదికి100 నుంచి 120 టన్నుల దిగుబడి వస్తోంది. ముందుగా రైతులు డెయిరీలతో బై బ్యాక్ ఒప్పందాన్ని కుదుర్చుకుని కిలో పశుగ్రాసాన్ని 1రూపాయికి విక్రయిస్తున్నారు. పశుగ్రాసం సాగుకు ఎకరానికి 20 నుంచి 25 వేల రూపాయల వరకు వ్యయం కాగా ఎకరానికి ఏడాదికి ఖర్చులు పోను నికరాదాయంగా 70 వేల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నారు.
సాగు ఇలా..
ఎకరానికి 10 టన్ను ల పశువుల పేడను, రెండు సంచుల డీఏపీని వేసి కలియ దున్నుకున్నారు. రెండున్నర ఫీట్ల వెడల్పుతో బోదెలుగా చేసుకుని, బోదెలపై మొక్కకు మొక్కకు ఫీటు, ఫీటున్నర దూరం ఉండేలా కనుపులను నాటుకున్నారు. ఎకరానికి 7వేల నుంచి 9 వేల కనుపులను నాటుకున్నారు. నాటిన వెంటనే ఒక్కసారి నీటితడిని అందించారు. రెండుసార్లు కూలీలతో అంతర కలుపు నివారణ చేపట్టారు. మొదటి కోత వరకు 4 నుంచి 6తడులు నీటిని అందించారు. 90 రోజులకు మొదటి కోత రాగా, కోత కోయగానే ఎకరానికి 2 డీఏపీ సంచులు, 1 యూరియా సంచిని పైపాటు ఎరువుగా వేసుకున్నారు.
పశుగ్రాసాలను సాగు చేస్తున్నాం
కోతులు, అటవీ జంతువుల నుంచి తీవ్ర ఇబ్బందులు పడ్డాం. పంటలు సాగు చేసినప్పుడు తీవ్రంగా నష్టపోయాం. పశుగ్రాసాల సాగులో కూలీల కొరత లేదు. డెయిరీలతో ముందస్తు బై బ్యాక్ ఒప్పందంతో సాగు చేసి విక్రయిస్తున్నాం. మా అవసరాలకు వినియోగించుకుని మిగతాది విక్రయిస్తున్నాం. ప్రభుత్వం పశుగ్రాసాలను సాగుచేసే రైతులను ప్రోత్సహించాలి.
-ఎడ్ల నరేష్ రెడ్డి, రైతు, పాముకుంట
రైతులకు సబ్సిడీలు కల్పించాలి
పశుగ్రాసాలు సాగుచేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీల ను కల్పించాలి. కరువు పరిస్థితు లు ఉన్న ఆలేరు నియోజక వర్గంలో బయోగ్యాస్ ప్లాంట్లను నెలకొల్పాలి. ప్లాంట్లకు అవసరమయ్యే పశుగ్రాసం సాగు కు ప్రోత్సాహమిస్తే ఉపాధి పెరుగుతుంది. మహాప్రభుత్వం రైతులకు కల్పిస్తున్న ప్రోత్సాహాన్ని ఇక్కడి రైతులకు అందించాలి. మిషనరీని సబ్సిడీపై అందించినట్లయితే ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది.
-బోళ్ల రాఘవరెడ్డి, రైతు, రేణుకుంట
పచ్చిమేత పశువులకు ఎంతో మేలు
పచ్చిమేతను పశువులకు అం దించడంతో పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. దాణా ఖర్చును తగ్గించుకోవచ్చు. పశువుల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎదకు త్వరగా వస్తాయి. రైతులు పాడి పశువులకు పచ్చిమేతను ఇవ్వడంతో పాల ఉత్పత్తి పెరుగడంతో పాటు వెన్నశాతం పెరుగుతుంది. రైతులు పశుగ్రాసాలను సాగు చేయడాని కి ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేస్తుంది.
-డాక్టర్ చంద్రారెడ్డి, మండల పశు వైద్యాధికారి, రాజాపేట
Updated Date - Jul 21 , 2025 | 12:37 AM