వివాహ విందులో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:07 AM
మోత్కూరులోని ఓ ఫంక్షన హాల్లో బుధవారం జరిగిన ఓ వివాహ వేడుకలో భోజనాల వద్ద ఓ వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసిన సంఘటన కలకలం రేపింది.
మోత్కూరు, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): మోత్కూరులోని ఓ ఫంక్షన హాల్లో బుధవారం జరిగిన ఓ వివాహ వేడుకలో భోజనాల వద్ద ఓ వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. పోలీసులు, పొడిచేడు గ్రామస్థుల కథనం ప్రకారం... యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన నర్సింహులు కూతురు, అల్లుడు చంద్రయ్య, స్వరూప కొంత కాలం క్రితం మృతి చెందారు. వారికి ఒక కూతురు శ్రావణి, ఒక కుమారుడు శివ ఉండగా వారు నర్సింహులు వద్ద పెరుగుతున్నారు. ఆయనకు ఆరెగూడెంలో ఐదెకరాల భూమి ఉంది. శ్రావణి సుమారు మూడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఏనుగు మహేందర్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొద్ది రోజులకు నర్సింహులు, మహేందర్‌ల మధ్య ఆస్తి వివాదం తలెత్తింది. గ్రామ పెద్దల ముందు పంచాయతీ పెట్టగా నర్సింహులు ఒక ఎకరం భూమి మహేందర్‌కు ఇవ్వడానికి అంగీకరించాడు. గ్రామ పెద్దలు రెండు ఎకరాలు ఇవ్వాలని నర్సింహులుకు చెప్పారు. రెండు ఎకరాలు కాదు ఉన్న భూమిలో సగం రెండున్నర ఎకరాలు కావాలని మహేందర్ పట్టుబడుతున్నట్టు చెబుతున్నారు. ఈ పాత కక్షలను మనసులో పెట్టుకుని బుధవారం మోత్కూరులో జరిగిన ఓ వివాహ వేడుకలో మహేందర్, ఏనుగు మధు, కప్పె సైదులు కలిసి నర్సింహులుపై దాడి చేయడంతో నర్సింహులు గాయపడ్డాడు. అతన్ని చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుడు నర్సింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ డి.నాగరాజు తెలిపారు.
Updated Date - Apr 17 , 2025 | 12:07 AM