అక్కన్న, మాదన్న ఆలయాలకు మహర్దశ
ABN, Publish Date - Jul 02 , 2025 | 12:13 AM
అలనాటి చారిత్రక నేపథ్యానికి శిల్పకళ నైపుణ్యానికి నిలువెత్తు చిహ్నలు అక్కన్న మాదన్న ఆలయాలు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మహాదేవ్‌పూర్ గ్రామంలో కొలువై ఉన్న చారిత్ర క నిర్మాణాలకు మహర్దశ పట్టనుంది గత చరి త్ర వైభవాన్ని చాటి చెప్పేలా అక్కన్న మాదన్న ఆలయాలకు మంచి రోజులు రాబోతున్నాయి.
టూరిజం, ఆర్కిటెక్చర్ నిపుణులతో ఎమ్మెల్యే సమీక్షతో చిగురిస్తున్న ఆశలు
ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి
బీబీనగర్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): అలనాటి చారిత్రక నేపథ్యానికి శిల్పకళ నైపుణ్యానికి నిలువెత్తు చిహ్నలు అక్కన్న మాదన్న ఆలయాలు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మహాదేవ్‌పూర్ గ్రామంలో కొలువై ఉన్న చారిత్ర క నిర్మాణాలకు మహర్దశ పట్టనుంది గత చరి త్ర వైభవాన్ని చాటి చెప్పేలా అక్కన్న మాదన్న ఆలయాలకు మంచి రోజులు రాబోతున్నాయి. అద్భుత రాతి కట్టడాలు, శతాబ్దాల ప్రాచీన నేపథ్యం కలిగిన ఇక్కడి ఆలయాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతుంది. వీటిపై ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు సోమవా రం ఆలయాల ప్రాంగణంలో తెలంగాణ పర్యాటక శాఖ జీఎం ఉపేందర్‌రెడ్డి, తెలంగాణ దేవాలయాల ఆర్కిటెక్చర్ బండారు శ్రీనివాస్ గుప్తా తో కలిసి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు. నెలరోజుల్లో అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయాలని నిర్ణయించారు. దీంతో ఇక్కడి ఆలయాలు ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయి. ఎంతో ఘన చరిత్ర కలిగిన అక్కన్న మాదన్న ఆలయాల ప్రాశస్త్యం ప్రపంచానికి చాటి చెప్పే మంచి రోజులు రానున్నాయి. కాకతీయుల కాలంలో 600సంవత్సరాల క్రితం నిర్మించినవిగా చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయాలు కాల క్రమేణ శిథిలావస్థకు చేరి 400 సంవత్సరాల క్రితం వరకు మట్టి దిబ్బలుగా ఉండేవి. కాగా నిజాం తానీషా ఆస్థానంలో మంత్రిగా, సేనాధిపతిగా పనిచేసిన అక్కన్న మాదన్న సోదరులు ఈ ప్రాంతంలో ఉన్న మట్టి దిబ్బలను పూర్తిగా తొలగించి ఆలయాలను పునర్నిర్మించి విగ్రహాలను ప్రతిష్టించారు. అదే సమయంలో భద్రాచలంలో కంచర్ల గోపన్న (రామదాసు)రామాలయ నిర్మాణం ప్రజల కప్పంతో నిర్మించినందుకు తానీషా రామదాసును బందీఖానా చేయగా, మాదన్నలు ఇక్కడి ఆలయాల నిర్మాణాలను మధ్యలోనే వదిలేసినట్లు ఆలయ చరిత్ర చెబుతుంది. అందుకే ఇక్కడి ఆలయాలు అక్కన్న మాదన్న దేవాలయాలుగా పిలుస్తున్నారు.
శిథిలమవుతున్న కట్టడాలు..
మహాదేవ్‌పూర్‌లోని చారిత్రక కట్టడాలను పట్టించుకునేవారు లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. శివపార్వతులు కొలువై ఉన్న రెండు మండపాల వెనుక భాగంలో రాతి స్తంభాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే చారిత్రక శిల్ప కళ సంపదను పరిరక్షించడంతో పాటు పర్యాటకుల ద్వారా ప్రభుత్వానికి ఆలయానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
సినిమా ఘాటింగ్‌లకు ప్రసిద్ధి..
ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన అక్కన్న మాదన్న ఆలయాలు సినిమా షుటింగ్‌లు, టీవీ సీరియల్స్, ప్రైవేటు ఆల్బమ్స్‌చిత్రీకరణకు ప్రసిద్ధి చెందాయి. పౌరాణిక, చారిత్రక, ఆధ్యాత్మికతతో కూడిన సినిమాలు ఈ ఆలయాల్లో ఎక్కువగా చిత్రీకరిస్తారు. అందులో జగపతిబాబు నటించిన పెదబాబు సినిమా 50శాతం ఇక్కడే చిత్రీకరించారు. శ్రీకాంత హీరోగా శ్రీకృష్ణదేవరాయుల జీవిత చరిత్ర కథాంశంతో రూపొందించిన దేవరాయ సినిమాను ఇక్కడే చిత్రీకరించారు. వీటితో పాటు బతుకమ్మ పాటల చిత్రీకరణ, జానపద గీతాలను ఇక్కడ చిత్రీకరించారు.
పురావస్తు శాఖకు అప్పగించాలి ..
ప్రస్తుతం అక్కన్న మాదన్న ఆలయాలు శిథిలావస్థకు చేరాయి. చారిత్రక అవశేషాలు ప్రాచీన సంపదను సంరక్షించి భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. వీటిని సం రక్షించే బాధ్యతను పురావస్తు శాఖకు అప్పగించి నిర్వహణకు కావాల్సిన నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది.
కళ్లు చెదిరే నిర్మాణ శైలి ..
సుమారు 4.25ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయ నిర్మాణ శైలి అబ్బురపరుస్తోంది. మూడు మండపాలతో ఆలయ నిర్మాణాలను పూర్తిగా రాతితో నిర్మించారు. టన్నుల కొద్ది బరువు గల బండరాళ్లపై కళాకృతులు చెక్కి ఆలయాలను నిర్మించిన తీరు అప్పటి నైపుణ్యానికి అద్దం పడుతోంది. ఎంతో చరిత్ర కలిగిన ఆలయాన్ని ప్రభుత్వాలు పట్టించుకోనందున నిరాధరణకు గురవుతున్నాయి.
పర్యాటక అభివృద్ధికి కృషి
వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అక్కన్న, మాదన్న ఆలయాలను ఆధ్యాత్మికంగా పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. ఈ మేరకు రెండు రోజుల క్రితం తెలంగాణ పర్యాటక శాఖ, జీఎంతో పాటు దేవాలయాల ఆర్కిటెక్చర్, కన్సల్టెన్సీ నిపుణులతో పర్యాటక అభివృద్ధి కోసం సమీక్ష నిర్వహించాం. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధిచేసేందుకు అవసరమైన ప్రణాళిక ను సంబంధిత అధికారులు నెల రోజుల్లో రూపొందిస్తారు.పర్యాటకం అభివృద్ధిపై సీఎం రేవంతరెడ్డి ఎంతో ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని అక్కన్న మాదన్న ఆలయాలతో పాటు మరికొన్ని ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నా.
- కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి
Updated Date - Jul 02 , 2025 | 12:13 AM