నెలాఖరులోగా ‘స్థానిక’ రిజర్వేషన్లు!
ABN, Publish Date - Jul 12 , 2025 | 12:22 AM
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల పరిమితిపై ఉన్న సీలింగ్ తొలగించేందుకు ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని, అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.
తొలుత పరిషత్‌లకు, ఆపై పంచాయతీలకు కేటాయింపు
ఆగస్టులో ఎన్నికలుంటాయనే అంచనా
రిజర్వేషన్లు తేలితే రంగంలోకి దూకేందుకు సిద్ధమవుతున్న నాయకులు
(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ) : స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల పరిమితిపై ఉన్న సీలింగ్ తొలగించేందుకు ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని, అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం కానుంది.
రిజర్వేషన్లపై స్పష్టత రాకపోవడంతో ఏడాదిన్నరగా గ్రామపంచాయతీ లు, ఏడాది కాలంగా జిల్లా, మండల పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తాజాగా బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ముందుకు రావడంతో ఇక ఎన్నికల నిర్వహణకు అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈనెలాఖరులోగా పరిషత్‌లకు, పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారైతే ఆగస్టులో తొలుత పరిషత్ ఎన్నికలు, ఆ తర్వాత గ్రామపంచాయతీ ల ఎన్నికలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.
మండలం యూనిట్‌గా రిజర్వేషన్లు
బీసీలకు 42శాతం, ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 7 శాతంతో పాటు అన్ని కేటగిరీల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం అమలుచేయనుంది. ఆర్డినెన్స్ విడుదలైన వెంటనే పంచాయతీరాజ్ కమిషనర్ ద్వారా రిజర్వేషన్ల కోటా, కేటాయింపులకు ఉత్తర్వులు విడుదల చేసేందు కు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే కలెక్టర్లు, ఆర్డీవోల నేతృత్వంలో రిజర్వేషన్లు ఖరారు చేసి ఆ తరువాత ప్రకటిస్తారు. జిల్లా పరిషత్ ఛైర్మన్లకు రాష్ట్రం యూనిట్‌గా, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ పదవులకు జిల్లా యూనిట్ గా, సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుల పదవులకు మండలం యూనిట్‌గా, గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు గ్రామం యూనిట్‌గా రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరులోగా ఈ పదవులన్నింటికీ రిజర్వేషన్లు ప్రకటిస్తారని, రిజర్వేషన్ల ఖరారు పూర్తయ్యాక రాష్ట్ర ఎన్నికల సం ఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుందని భావిస్తున్నారు. తాజాగా, సమాచారం ప్రకారం ఆగస్టులో పరిషత్‌ల ఎన్నికలు పక్కాగా జరుగుతాయని, ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరు మొదటి వారంలోపు గ్రామపంచాయతీల ఎన్నికలు కూడా పూర్తవుతాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
పరిషత్ ఎన్నికలకు సిద్ధమైన అధికార యంత్రాంగం
నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో పరిషత్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఇప్పటికే సిద్ధమైంది. ఎంపీటీసీ స్థానాల పునర్విభజన పూర్తయింది. మరోవైపు పోలింగ్‌స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితాలు తయారు చేశారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బందిని గుర్తించారు. పోలింగ్ బీఎల్‌వోలు (బూత్‌లెవల్ ఆఫీసర్ల)కు శిక్షణ సైతం ఇస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు షెడ్యూల్ ప్రకటించినా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 73 జడ్పీటీసీ స్థానాలతో పాటు, 766 ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు, 73 ఎంపీపీ పదవులకు పరోక్ష ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఉమ్మడి జల్లాలో 1,730 గ్రామపంచాయతీలు ఉండగా, 1,730 సర్పంచ్ పదవులకు, సుమారు 17,500 వార్డు స్థానాలకు సైతం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పరిషత్‌లకు పార్టీల ప్రాతిపదికన, గ్రామపంచాయతీలకు పార్టీలతో సంబంధం లేకుండా ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. అందుకోసం వేర్వేరుగా బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ గుర్తులను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. ముందుగా పరిషత్‌లకు, తదుపరి పక్షం రోజుల వ్యవధిలో గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ముందుగా ఏ ఎన్నికలు నిర్వహించినా, ఫలితాలు ప్రకటించకుండా కోడ్ కొనసాగిస్తూ, ఆ తరువాతి ఎన్నికల ప్రక్రియలను ముగించాలని, తద్వారా గ్రామాల్లో ఘర్షణలకు ఆస్కారం లేకుండా చూడడంతో పాటు, పాలనాపర ఇబ్బందులను అధిగమించవచ్చనేది ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాల అభిప్రాయంగా తెలుస్తోంది.
రిజర్వేషన్లపైనే ఆశావహుల ఎదురుచూపులు
రిజర్వేషన్లను నెలాఖరులోగా ఖరారు చేయనున్నారనే సమచారంతో గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి ఏ వర్గానికి రిజర్వ్ అవుతుంది? ఎంపీటీసీ స్థానం ఏ కేటగిరీకి వెళ్తుంది? జడ్పీస్థానం? ఎంపీపీ పదవులు ఏ వర్గానికి దక్కుతాయి? అనే అంశంపై అంచనాలు వేసుకుంటున్నారు. రిజర్వేషన్లలో బీసీల కోటా పెరగడంతో మొత్తం రిజర్వేషన్లు 64శాతం వరకు రానున్నాయి. మండలం యూనిట్‌గానే గ్రామపంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుల పదవులకు రిజర్వేషన్లు కేటాయించనుండడంతో 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలో ఏ సామాజికవర్గ జనాభా ఏ గ్రామంలో ఎక్కువుంటుంది? ఎక్కడ ఏ రిజర్వేషన్ వర్తిస్తుందనే దానిపై అంచనాల్లో మునిగితేలుతున్నారు. జిల్లా యూనిట్‌గా జడ్పీటీసీ, ఎంపీపీ పదవులు ఖరారవనుండడంతో వాటిపైనా లెక్కలు కడుతున్నారు. అనుకూలించే రిజర్వేషన్ వస్తే పోటీకి సిద్ధమైన నాయకులు ఇప్పటి నుంచే ముందస్తు సన్నాహాలు చేసుకుంటున్నారు. రిజర్వేషన్లు ఖరారైన మరుక్షణం గ్రామాల్లో, మండలాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ పదవులపై ఆశలు పెంచుకున్న స్థానిక నాయకులు రిజర్వేషన్లు అనుకూలంగా వస్తే కదనరంగంలోకి దూకేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
జిల్లా జడ్పీ ఎంపీటీసీ
స్థానాలు స్థానాలు
నల్లగొండ 33 353
సూర్యాపేట 23 253
యాదాద్రి 17 178
మొత్తం 73 784
Updated Date - Jul 12 , 2025 | 12:22 AM