పండుగలా ప్రారంభించాలని..
ABN, Publish Date - May 27 , 2025 | 12:19 AM
నూతన విద్యాసంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించేందుకు విద్యాశాఖ తీవ్రంగా శ్రమిస్తోంది. 2025-26 విద్యాసంవత్సరం తొలిరోజు జూన 12న పండుగ వాతావరణంలో ప్రభుత్వ పాఠశాలలను పునఃప్రారంభించాలని తలపిస్తోంది.
నూతన విద్యాసంవత్సరానికి పాఠశాలలను సిద్ధం చేస్తున్న యంత్రాంగం
తొలిరోజే యూనిఫాం, పాఠ్యపుస్త కాల అందజేతకు సన్నాహాలు
(ఆంధ్రజ్యోతి-భువనగిరి టౌన)
నూతన విద్యాసంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించేందుకు విద్యాశాఖ తీవ్రంగా శ్రమిస్తోంది. 2025-26 విద్యాసంవత్సరం తొలిరోజు జూన 12న పండుగ వాతావరణంలో ప్రభుత్వ పాఠశాలలను పునఃప్రారంభించాలని తలపిస్తోంది. తొలిరోజునే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందించనున్నారు. అలాగే ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. మన ఊరు మనబడి, అమ్మ ఆదర్శ పాఠశాల పథకాలతో ప్రతిపాదించిన పనులు పూర్తయ్యేలా కృషి చేస్తున్నారు. పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రైవేట్ పాఠశాలతో పోటీ పడుతుండటం, అర్హులైన ఉపాధ్యాయులు, మెరుగైన వసతులు, మధ్యాహ్న భోజనం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలతోనే పిల్లల భవిష్యత భద్రంగా ఉంటుందనే నిజాన్ని తల్లిదండ్రులు గ్రహించాలని విద్యాశాఖ అధికారులు అంటున్నారు.
తొలిరోజునే...
విద్యాసంవత్సరం తొలిరోజునే పిల్లలకు పాఠ్యపుస్తకాలు, యూని ఫాం అందనున్నాయి. ఈ మేరకు యాదాద్రిభువనగిరి జిల్లాలో 715 ప్రభుత్వ పాఠశాలలలో ప్రస్తుతం 38వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఇందుకోసం 142 టైటిల్స్‌లో 2,91,760 పాఠ్యపుస్తకాలకు ఇప్పటివరకు 128 టైటిల్స్‌లో 2,50,440(85.83 శాతం) పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరాయి. ఈ మేరకు పుస్తకాల సరఫరా కూడా ప్రారంభమైంది. ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫామ్స్‌లో మొదటి రోజున ఒకటి చొప్పున మరొకటి నెల రోజుల అనంతరం ఇవ్వనున్నారు. ఇందుకోసం మహిళా సంఘాలు 43,506 యూనిఫామ్స్‌ను సిద్ధం చేస్తున్నాయి. త్వరలోనే అవి పాఠశాలలకు చేరనున్నాయి.
జూన 6 నుంచి బడిబాట
ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలను పెంచే లక్ష్యంతో జూన 6 నుంచి 19 వరకు బడిబాట చేపడుతున్నారు. జూన 6న గ్రామసభలు, 7న బడిఈడు పిల్లల గుర్తింపు సర్వే, 8, 9, 10వ తేదీల్లో కరపత్రాలతో ఇంటింటా ప్రచారం, డ్రాప్ అవుట్ పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్పించనున్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్పించడం. 6 నుంచి 10 వరకు నిర్వహించిన కార్యక్రమాలపై 11న సమీక్ష, 12న పాఠశాలల పునఃప్రారంభం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభం చేపట్టనున్నారు. 13న సామూహిక అక్షరాభ్యాసం, బాలల సభ, 16న ఫౌండేషన లిటరేస్ అండ్ న్యూమరసి(ఎ్‌ఫఎల్‌ఎన), లెర్నింగ్ ఇంప్రూ్‌పమెంట్ డే (ఎల్‌ఐపీ). 17న విలీన విద్య, బాలిక దినోత్సవం, 18న డిజిటల్ తరగతులపై అవగాహన, 19ప బడిబాట ముగింపును పురస్కరించుకొని క్రీడాపోటీలు నిర్వహిస్తారు.
అసంపూర్తిగా అభివృద్ధి పనులు
కార్పొరేట్ స్థాయి సదుపాయాలు లక్ష్యంగా మన ఊరు మనబడి, అమ్మ ఆదర్శ పాఠశాలల పథకాల పేరిట చేపట్టిన పలు అభివృద్ధి పనులు నేటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. దీంతో పలు పాఠశాలలో సమస్యలు వెంటాడనున్నాయి. గత ప్రభు త్వం మన ఊరు-మనబడిలో భాగంగా మొదటి దఫాగా 251 పాఠశాలలో రూ.48 కోట్లతో చేపట్టిన పలు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. బిల్లుల చెల్లింపు పర్యవేక్షణ లోపం తదితర కారణాలతో నిలిచిన అసంపూర్తి పనులతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే పనులు పూర్తయిన పాఠశాలల మాత్రం విద్యార్థులను అలరిస్తున్నాయి. అలాగే ప్రస్తుత ప్రభుత్వం 558 పాఠశాలలో రూ.23.81 కోట్లతో ప్రతి పాఠశాలలలో తాగునీరు, మూత్రశాలల మరమ్మతులు, విద్యుత కనెక్షన, ఫ్యాన్లు, లైట్ల బిగింపు, ఇతర మరమ్మతులు మొత్తంగా 3,918 పనులు చేపట్టారు. ఈ మేరకు ఇప్పటివరకు 545 పాఠశాలలో ప్రతిపాదిత పనులు పూర్తి చేశారు.
వేధిస్తున్న సమస్యలు
అభివృద్ధి పనులు ప్రతిపాదించి పూర్తి చేస్తున్నప్పటికీ పలు పాఠశాలను నేటికీ పలు సమస్యలు వేధిస్తున్నాయి. మెజార్టీ పాఠశాలలకు ప్రహరీ లేకపోవడం, రంగులు వేయకపోవడంతో పాత భవనాలను తలపిస్తున్న పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు సరిపడా మూత్రశాలలు, తరగతి గదులు లేకపోవడం, మరికొన్ని పాఠశాలలో తాగునీటి కొరత ఉంది.అలాగే ఇంకా కొన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటుచేయాల్సి ఉంది. ల్యాబ్, గ్రంథాలయాలు, క్రీడాసామగ్రి ఆశించిన స్థాయిలో లేకపోవడం విద్యార్థులను నిరుత్సాహానికి గురిచేస్తోంది.
తొలిరోజు నాటికి
సమస్యల పరిష్కారం
పాఠశాలలు తెరుచుకునే తొలి రోజు నాటికి సమస్యలను పరిష్కరిస్తాం. ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతులు అందుతు న్నాయి. పదో తరగతి పరీక్షా ఫలితాలు కూడా గతం కంటే మెరుగయ్యాయి. బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించే లక్ష్యంతో బడిబాట నిర్వహిస్తాం.
సత్యనారాయణ, డీఈవో, యాదాద్రిభువనగిరి జిల్లా
Updated Date - May 27 , 2025 | 12:19 AM