భూసేకరణే ప్రధాన సమస్య
ABN, Publish Date - Jun 07 , 2025 | 11:58 PM
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణే ప్రధాన సమస్యగా మారింది.
పరిహారం, పునరావాసంపై నిర్వాసితులకు దక్కని ఊరట
కీలక ప్రాజెక్టులన్నింటి కీ ఇదే అడ్డంకి
భూసేకరణపై ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలంటోన్న సీఎం, మంత్రులు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ)తి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణే ప్రధాన సమస్యగా మారింది. భూములకు బహిరంగ మార్కెట్‌లో ధరలు ఏటేటా పెరుగుతుండడంతో అదేస్థాయిలో తమ భూములకు పరిహారమివ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమం లో భూసేకరణ ప్రక్రియలో జాప్యం జరుగుతోం ది. భూములతో పాటు ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితుల ప్యాకేజీల విషయంలోనూ ఇదేరీతిలో సంతృప్తి పరచలేని పరిస్థితి నెలకొంది.
జిల్లాలోనిఎస్‌ఎల్‌బీసీ(అండర్‌టన్నెల్), డిండి ఎత్తిపోతల పథకం, గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల వంటి కీలకమైన సాగునీటి ప్రాజెక్టులన్నింటిలో భూసేకర ణ సమస్య తెరమీదకు వచ్చింది. తాజాగా శుక్రవారం యా దాద్రి-భువనగిరి జిల్లాలోని గంధమల్ల రిజర్వాయర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన సందర్భంగా జరిగిన సభలో సీఎం సహా మంత్రులు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులన్నింటినీ వచ్చేమూడున్నరేళ్లలో పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. ఆ సందర్భంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ప్రాజెక్టుల భూసేకరణ త్వరగా ముగిసేలాఎమ్మెల్యేలు చొరవతీసుకొవాలని, నిర్వాసితులతో మాట్లాడి భూములిచ్చేలా ఒప్పించాలని సూచించడం భూసేకరణలో ఎదురవుతున్న ఆటంకాల తీవ్రతని తెలియజేస్తోంది.
గంధమల్ల రిజర్వాయర్ కింద పరిహారంపై చిక్కుముడి
ఆలేరు నియోజకవర్గంలో 60వేల ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో నిర్మించతలపెట్టిన 1.43 టీఎంసీల సామర్థ్యంగల గంధమల్ల రిజర్వాయర్ కింద భూసేకరణ తలకుమించిన భారమవుతోంది. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి గంధమల్ల, వీరారెడ్డిపల్లి గ్రామాలకు చెందిన 1028.83 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇక్కడ భూములకు ఎకరాకు కనీసం రూ.45 లక్షల పరిహారమివ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తుంటే, ప్రభుత్వం గరిష్టంగా రూ.14లక్షలకు మించి ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ భూసేకరణకు రైతులను ఒప్పించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపైనే ఉండడంతో ఇటు ప్రభుత్వాన్ని ఒప్పించడానికి, అటు రైతులను సంతృప్తిపరచడానికి ఎలాంటి కార్యాచరణ అమలులోకి తెస్తారనే అంశంపైనే ఈ ప్రాజెక్టు భూసేకరణ చిక్కుముడి వీడనుంది. అలాగే బస్వాపూర్ రిజర్వాయర్ కింద నిర్వాసితులకు సైతం ఇంకా భూసేకరణ నిమిత్తం రూ.500 కోట్ల పరిహారమివ్వాల్సి ఉండగా, ఇళ్లు కోల్పోయిన మూడు తండాల వాసులకు సంబంధించి 83 కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు చేయాల్సి ఉంది.
ఎస్‌ఎల్‌బీసీకి పునరావాసం, అటవీ అనుమతులపై..
ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తోన్న రెండు టన్నెల్స్ నడుమ డిండిపై తెల్థేవర్‌పల్లి వద్ద నిర్మిస్తోన్న నక్కలగండి (డిండిబ్యాలెన్సిం గ్ రిజర్వాయర్) రిజర్వాయర్‌లో ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ఫారె్‌స్టకు చెందిన 281.93 హెక్టార్ల భూమి ముంపునకు లోనవుతుంది. ఈ భూములను ప్రాజెక్టుకు కేటాయించేందుకు కేంద్ర అటవీశాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఇందుకోసం ఇప్పటికే కేంద్ర అటవీశాఖకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక సంప్రదింపులు జరిగాయి. ఈ భూమిని కేంద్రం కేటాయిస్తే, దీనికి బదులుగా రిజర్వ్‌ఫారెస్ట్ ఆవల నేరేడుగొమ్మ మండలంలోనే 790 హెక్టార్లలో అడవిని అభివృద్ధి చేసి ఇచ్చేందుకు రంగం సిద్ధంచేశారు. ఇందుకోసం రాష్ట్రం నుంచి కేంద్రంపై ఒత్తిడి తేవాల్సి ఉంది.
నక్కలగండి రిజర్వాయర్ నిర్మాణంతో నల్లగొండ జిల్లాలోని చందంపేట మండలంలోని నక్కలగండి తండా, నాగర్‌కర్నూ ల్ జిల్లాలోని అచ్చంపేట మండలంలోని కేశ్యతండ, మర్లపాడుతండాలు ముంపునకు లోనవుతున్నాయి. 2015-16లో నిర్వహించిన సామాజిక,ఆర్థిక సర్వే ప్రకారం ఆయా తండాల్లో 629 గిరిజన కుటుంబాలు నిర్వాసితులు అవుతున్నారు. వారికి పునరావాసం కల్పించాల్సి ఉంది. నక్కలగండి తండాకు సంబంధించి ఆర్‌అండ్‌ఆర్ కాలనీ నిర్మించేందుకు చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద 10 ఎకరాల భూమిని పరిశీలించి అక్కడ ఆర్‌ఆండ్‌ఆర్‌సెంటర్ నిర్మించాల ని నిర్ణయించినా ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు.
అటు నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని కేశ్యతండా, మర్లపాడుతండాలకు సంబంధించి పునరావాసకేంద్రాలను తొలుత సిద్ధాపురం వద్ద ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం నిర్ణయిస్తే అందుకు నిర్వాసితులు అంగీకరించకపోవడంతో ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు సమీపంలో ఏర్పాటుచేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మొత్తంగా మూడు ముంపు తండాలకు పునరావాస కాలనీలు, ప్యాకేజీలపై నిర్వాసితులతో చర్చించి తుదినిర్ణయం తీసుకుంటే తప్ప నిర్వాసితుల సమస్య పరిష్కారం కాని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు కింద అంతర్భాగమైన పెండ్లిపాకల రిజర్వాయర్ ఎత్తుపెంపు చేపడితే నిర్వాసితులయ్యే మూడు గిరిజనతండాల వాసులకు నిర్వాసిత ప్యాకేజీ ఖరారు చేయాల్సి ఉండగా, భూముల కోల్పోతున్న జాన్‌తండా వాసులు తాము భూములను ఇచ్చేది లేదని ఆందోళనలకు దిగుతుండడం గమనార్హం.
డిండి ఎత్తిపోతల కింద పరిస్థితి ఇలా..
డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలో 66.300 కిలోమీటర్ల ప్రధాన కాల్వతో పాటు, సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి ఆఫ్‌లైన్ రిజర్వాయర్ల నిర్మాణాలు, ప్రస్తుతమున్న డిండి ప్రాజెక్టు ఎత్తుపెంపు పనులు, ఉల్పర బ్యారేజీ సహా, ఎర్రవల్లి-గోకారం, కిష్టరాంపల్లి, శివన్నగూడెం ఆన్‌లైన్ రిజర్వాయర్ల పనులు చేపట్టారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆమనగల్లు మండలంలో ఇర్విన్ వద్ద ప్రతిపాదించిన మరో ఆన్‌లైన్ రిజర్వాయర్‌ని ప్రజలు వ్యతిరేకించడంతో ఆ పనులు ఆపేశారు. ప్రధాన కాల్వతో పాటు, అన్ని రిజర్వాయర్లకు కలిపి ఇర్విన్ మినహాయిస్తే దాదాపు 16,389 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు 12,317 ఎకరాల భూమిని మాత్రమే సేకరించారు. ఇంకా 4,072 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ భూమితో పాటు నాగర్‌కర్నూల్ జిల్లాలోని గోకారం-ఎర్రవల్లి రిజర్వాయర్ కింద నిర్వాసితులయ్యే ఎర్రవల్లి, ఎర్రవల్లి తండాలకు చెందిన గ్రామస్తులకు, నల్లగొండ జిల్లాలో కిష్టరాంపల్లిలో నిర్వాసితులయ్యే నాంపల్లి మండలం లక్ష్మణపురం, చింతపల్లి మండలం ఈదులగూడెం గ్రామస్తులకు, శివన్నగూడెం రిజర్వాయర్‌తో నిర్వాసితులయ్యే చర్లగూడెం, నర్సిరెడ్డిగూడెం, వెంకెపల్లి, వెంకెపల్లి తండాల నిర్వాసితులకు సంబంధించి 1,899 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉండగా, ఇప్పటివరకు ప్యాకేజీలు కుదరకపోవడంతో సదరు నిర్వాసితుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Updated Date - Jun 07 , 2025 | 11:58 PM