ఎన్నికల పండుగ ఉన్నట్టే!
ABN, Publish Date - Jun 26 , 2025 | 12:08 AM
హైకోర్టు ఆదేశించడంతో స్థానిక సంస్థ ల ఎన్నికలు రానున్న మూడునెలల్లో నిర్వహిస్తారనే స్పష్టత వచ్చింది. గ్రామపంచాయతీ ఎన్నికలు సెప్టెంబరు 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో నిర్వహణ అనివార్యత ఏర్పడింది.
మూడు నెలల్లో స్థానిక సమరం
సెప్టెంబరు 30లోగా నిర్వహించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ఇప్పటికే సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం
పాలకవర్గాలు లేకపోవడంతో గాడితప్పిన స్థానిక పాలన
ఎన్నికలు వస్తే సత్తా చాటేందుకు నాయకుల తహతహ
పంచాయతీలతో పాటే పరిషత్‌లకూ ఎన్నికలు
(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): హైకోర్టు ఆదేశించడంతో స్థానిక సంస్థ ల ఎన్నికలు రానున్న మూడునెలల్లో నిర్వహిస్తారనే స్పష్టత వచ్చింది. గ్రామపంచాయతీ ఎన్నికలు సెప్టెంబరు 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో నిర్వహణ అనివార్యత ఏర్పడింది. దీంతో ఇంతకాలం పల్లెల్లో పోటీకి తహతహలాడుతున్న నేతలు సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా, పంచాయతీలతోపాటే పరిషత్ ఎన్నికలూ నిర్వహించే యోచనలో ఉంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీలకు స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామ ని హామీ ఇవ్వడంతో, దాన్ని తక్షణం అమలు చేశాకే ఎన్నికలకు వెళ్లాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను ఎలా ఖరారు చే యాలనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంతో ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. తాజాగా, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పంచాయతీలకు తప్పనిసరిగా సెప్టెంబరు నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మం డల, జిల్లా పరిషత్‌లకు సైతం వీటితో పాటే ఎన్నికలు నిర్వహిస్తారని రాజకీయ, అధికారవర్గాలు పేర్కొంటున్నా యి. ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అధికారయంత్రాంగం ప్రాథమిక ఏర్పాట్లన్నింటినీ పూర్తిచేసింది. దీంతో ప్రభుత్వం ఎప్పుడు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే అప్పుడు షెడ్యూల్ జారీచేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
అస్తవ్యస్తంగా మారిన స్థానిక పాలన
గ్రామపంచాయతీల పాలకవర్గాల గడువు 2024, జనవరి 30తో, పరిషత్‌ల పాలకవర్గాల గడువు 2024, జూన్ 5న ముగిశాయి. అప్పటి నుంచి స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. మునిసిపాలిటీల పాలకవర్గాల గడువు సైతం ఈ ఏడాది జనవరి 27న ముగియగా, ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. మొత్తంగా స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేకపోవడం, ప్రత్యేకాధికారుల పాలన నేపథ్యంలో నిధుల కొరత, పర్యవేక్షణ లోపం, పాతబిల్లుల పెండింగ్ వంటి కారణాలతో స్థానిక సంస్థల్లో పాలన అస్తవ్యస్తంగా మా రింది. పంచాయతీలకు రావల్సిన కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల నిధులకు బ్రేక్‌పడడంతో పంచాయతీల నిర్వహణ గాడితప్పింది. అత్యవసరమైన తాగునీటిసరఫరా వంటి పనులకు ప్రత్యేక నిధులు మంజూరవుతున్నా, ఇతర పనులకు సంబంధించిన బిల్లులు భారీగా పేరుకుపోవడంతో నిర్వహణ పంచాయతీ కార్యదర్శులకు తలకుమించిన భారమైంది. పంచాయతీ ట్రాక్టర్ల నిర్వహణ తమవల్ల కాదంటూ ఇటీవల ట్రాక్టర్ల తాళాలను ఎంపీడీవో కార్యాలయాల్లో అప్పగించిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలోని 1,740 గ్రామపంచాయతీల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుండగా, అన్ని మండల, జిల్లా పరిషత్‌లలో సందడి లేకుండాపోయింది. కేకేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా నల్లగొండ జిల్లాకు ప్రతీ మూడు నెలలకు రూ.19.50కోట్లు విడుదల చేస్తుండగా, యాదాద్రికి రూ.11.24కోట్లు, సూర్యాపేట జిల్లాకు రూ.13.25కోట్ల నిధులు వచ్చేవి. ప్రత్యేకాధికారుల పాలన వచ్చాక రెండు పర్యాయాలు నిధులు మంజూరైనా, అవిగత పాలకవర్గాల హ యాంలో చేపట్టిన పనులకు సంబంధించిన పెండిం గ్ నిధులే. ప్రత్యేకాధికారుల పాలన వచ్చిన 18 నెలలకు సంబంధించి కేంద్ర ఆర్థిక సంఘం నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు 30 నెలలకుపైగా రావాల్సి ఉంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాకు రూ.692.94కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. నల్లగొండ జిల్లాకు సంబంధించి రూ.312కోట్లు, యాదాద్రికి రూ.179.44కోట్లు, సూర్యాపేట జిల్లాకు సంబంధించి రూ.211.50కోట్ల నిధులు కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల నుంచి నిలిచాయి.
భారీగా పెండింగ్ బిల్లులు
ప్రత్యేకాధికారుల పాలన వచ్చిన 18నెలలనుంచి వేసవిలో చేపట్టిన ప్రత్యేక పనులకు సంబంధించిన నిధులు మినహా ఇతర పనుల బిల్లులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. పెండింగ్ బిల్లులకు సంబంధించి నల్లగొండ జిల్లాలో సుమారు రూ.35.40కోట్లు, సూర్యాపేటలో రూ.31.30 కోట్లు, యాదాద్రి జిల్లాలో సుమారు రూ.19కోట్ల మేర పెండింగ్ బిల్లులు ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని పెద్ద పంచాయతీల్లో ఇంటి పన్నులు ఇతరత్రా స్థానిక వనరుల ద్వారా కొంత మేర గ్రాంటుకు చెక్కులు మంజూరైనా అవి ట్రెజరీల్లో పాస్ కావడం లేదు. దీంతో పెండింగ్ బిల్లుల మొత్తం భారీగా పెరిగింది. ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సంసిద్ధమవుతున్న నేపథ్యంలో పెండింగ్ బిల్లులు చెల్లించాలని కార్యదర్శులు కోరుతున్నారు.
రంగంలోకి దిగేందుకు సిద్ధమైన నేతలు
ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల్లో పోటీచేసి గద్దెనెక్కాలని తహతహలాడుతున్న ద్వితీయ, క్షేత్రస్థాయి నాయకులంతా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటనకు ముందే రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఎస్టీలకు 7శాతం, ఎస్సీలకు 15శాతం, బీసీలకు 25శాతం, మహిళలకు అన్ని కేటగిరీల్లో 50శాతం రిజర్వేషన్లు కేటాయించారు. జడ్పీటీసీ స్థానాలకు, ఎంపీపీ పదవులకు పంచాయతీరాజ్ కమిషనర్ స్థాయిలో జిల్లాల వారీగా కోటాను ఖరారు చేస్తే, జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో ఆ కోటా ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు అనుగుణంగా సీట్లను కేటాయించారు. ఎంపీటీసీ స్థానాలకు, సర్పంచ్ పదవులకు జిల్లా కలెక్టర్ల స్థాయిలో మండలాల వారీగా కోటా ఖరారు చేసి, ఆర్డీవోల నేతృత్వంలో ఆయా మండలాల్లో సీట్లను కేటాయించారు. ఈసారి రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై అందరి దృష్టి నెలకొంది. ఇప్పటికే గ్రామాల్లో, మండలాల్లో సర్పంచులుగా, ఎంపీటీసీ సభ్యులుగా, జడ్పీటీసీ, ఎంపీపీ పదవులపై ఆశలు పెంచుకున్న స్థానిక నాయకులు రిజర్వేషన్లు అనుకూలంగా వస్తే కదనరంగంలోకి దూకేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
సన్నద్ధంగా ఉన్న అధికార యంత్రాంగం
పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న సంకేతాలతో అఽధికారయంత్రాంగం అప్రమత్తమైంది. ఉమ్మడి జిల్లాలో కొత్త, పాత కలుపుకొని మొత్తం 73 మండలాల్లో 73 జడ్పీటీసీ స్థానాలు, 1,730 గ్రామపంచాయతీలు, సుమారు 17,500కుపైగా వార్డు స్థానాలు, 722 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పోలింగ్ సిబ్బంది ఎంతవరకు అవసరమవుతారనే అంశంపై ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా సమాచారం సిద్ధం చేసుకున్నారు. పరిషత్‌లకు పార్టీల ప్రాతిపదికన, గ్రామపంచాయతీలకు, వార్డు సభ్యులకు పార్టీ రహితంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉండడంతో, అందుకోసం వేర్వేరుగా బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ గుర్తులను ఇప్పటికే సిద్ధం చేశారు. రిజర్వేషన్లను ఎలా ఖరారుచేయాలనే అంశంపై ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకున్న మేరకు కోటా కేటాయింపులు చే యాల్సి ఉంటుంది. ముందుగా పరిషత్‌లకు, తదుపరి పక్షం రోజుల వ్యవధిలో గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల నిర్వహణపై పోలీ్‌సశాఖ సైతం ముందస్తు సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సున్నిత ప్రాంతాలు, అతి సున్నిత ప్రాంతాలు, సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలను గుర్తించే పనిలో పోలీ్‌సశాఖ ఉంది. ఈ జాబితా తయారుచేసుకొని అవసరమైన పోలీస్ బలగాలు అందుబాటులో ఉంచేలా ప్రాథమిక కసరత్తు చేస్తోంది.
Updated Date - Jun 26 , 2025 | 12:08 AM