బంగారం చోరీ కేసులో ముమ్మర దర్యాప్తు
ABN, Publish Date - Jul 24 , 2025 | 12:17 AM
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులోని శ్రీసాయిసంతోషి నగల దుకాణంలో జరిగిన చోరీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
నేపాల్, జార్ఖండ్ వాసులుగా అనుమానిస్తున్న పోలీసులు
సూర్యాపేట క్రైం, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులోని శ్రీసాయిసంతోషి నగల దుకాణంలో జరిగిన చోరీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దుకాణంతో పాటు అనుమానితులు నివసించిన నివాసం వద్ద సేకరించిన ఆధారాల మేరకు చోరీకి పాల్పడిన వారు నేపాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా గురించినట్లు సమాచారం. చోరీకి పాల్పడిన వ్యక్తుల్లో ఇద్దరిపై గతంలో చోరీలకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదై ఉన్నట్లు తెలుస్తోంది. సూర్యాపేట పోలీసులు సంఘటనా స్థలంలో సేకరించిన ఫింగర్ ప్రింట్ల ఆధారంగా చోరీకి పాల్పడిన ప్రధానవ్యక్తిని గుర్తించారు. అయితే అనుమానితులను పట్టుకునేందుకు సూర్యాపేట నుంచి మూడు పోలీస్ బృందాలు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లాయి. ఢిల్లీ, నేపాల్ సరిహద్దు, జార్ఖండ్ ప్రాంతాలకు ఈ బృందాలు వెళ్లి నేరస్థులను పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. చోరీ చేసిన అనంతరం నేరస్తులు విజయవాడ వైపు వెళ్లి అక్కడి నుంచి రైలులో వారి ప్రాంతాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అనుమానితులు సూర్యాపేటలో ఉండటానికి ముందు ఖమ్మం జిల్లా కేంద్రంలో కొన్నినెలల పాటు నివసించి అక్కడ రాత్రి సమయంలో గుర్ఖాలుగా పనిచేసినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి సూర్యాపేటకు రెండు నెలల క్రితం వచ్చి గదిని అద్దెకు తీసుకుని నగలదుకాణంలో చోరీ చేసేందుకు రెక్కీ నిర్వహించిన చోరీకి పాల్పడ్డారు.
పోలీసుల అదుపులో అనుమానితులు?
నగల దుకాణంలో చోరీకి పాల్పడిన వ్యక్తులకు సంబంధించిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఖమ్మ ంలో ప్రైవేట్‌గా పనిచేసే వారిని అదుపులోకి తీసుకుని చోరీకి పాల్పడిన వారి గురించి వివరాలు రాబడుతున్నట్లు తెలుస్తోంది. సెల్‌ఫోన కాల్‌డేటా ఆధారంగా ఖమ్మంలో ఉంటున్న నేపాల్ ప్రాంతానికి చెందిన వ్యక్తికి చోరీకి పాల్పడిన వ్యక్తి ఫోనకాల్స్ వెళ్లినట్లు గుర్తించారు. ఆ దిశగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనా నగల దుకాణంలో చోరీ కేసును పోలీసులు త్వరలో ఛేదించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Updated Date - Jul 24 , 2025 | 12:17 AM