ముగ్గు పోయకుంటే రద్దే..?
ABN, Publish Date - Jul 24 , 2025 | 01:00 AM
పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చింది. విడతల వారీగా నిధులు విడుదల చేస్తూ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జిల్లాస్థాయిలో కలెక్టర్ నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం ఆరా
మంచిరోజుల కోసమా? ఆర్థికస్థోమతా లేకనా..?
శ్రావణమాసంలో ముగ్గులు పోస్తారని ఆశాభావం
వారంలోగా తగిన నిర్ణయం తీసుకోనున్న యంత్రాంగం
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చింది. విడతల వారీగా నిధులు విడుదల చేస్తూ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జిల్లాస్థాయిలో కలెక్టర్ నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇళ్లు మంజూరైన వారు ముగ్గు పోయకుంటే రద్దేనన్న సంకేతాలు వస్తున్నాయి.
ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండువిడతల్లో ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపి క చేసి, ఇళ్లు మంజూరు చేసింది. ఇళ్ల నిర్మాణాలను వేగవం తం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌లతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రతీవా రం ఇళ్ల నిర్మాణాల పురోగతిపై నివేదిక అందించాలని ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగానికి సూచిస్తునానరు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, మండలస్థాయి అధికారులు ఈ పథకం కింద ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఆలేరు నియోజవర్గంలోని యాదగిరిగుట్ట మండలం లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. జిల్లాలో 17 మండలాలు, 428 గ్రామపంచాయతీలు, ఆరు మునిసిపాలిటీలు ఉన్నాయి. ప్రభు త్వం జిల్లాకు ఇప్పటివరకు 9,374 ఇళ్లు మంజూరుచేసింది. ఇప్పటివరకు 7,026 ముగ్గు పోయగా, 1,704 వరకు గ్రౌండింగ్ అయ్యాయి. 206 ఇళ్లను రూఫ్ లెవల్ స్థాయిలో, 89 ఇళ్లు స్లాబ్‌లు పూర్తయ్యాయి.
ఆర్థిక స్తోమత లేకపోవడంతో..
రెండు విడతల్లో ఇళ్లు మంజూరు చేసిన వాటిలో ఇప్పటివరకు ముగ్గులు పోయని ఇళ్లు ఉన్నట్లుగా గుర్తించారు. జిల్లాలో రెండు విడతల్లో 2,348 మంది లబ్ధిదారులు ఇప్పటివరకు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. పలు గ్రామాల్లో లబ్ధిదారుల ఆర్థిక స్తోమత లేని కారణంతో ఇళ్లు ప్రారంభించలేదు. అయితే ముగ్గు పోసేందుకు మంచిరోజుల కోసం వేచి చూస్తున్నారా? లేదంటే ఆర్థిక సమస్యలతో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదా? అన్న అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మొదటి విడత కింద ఇళ్లు మంజూరై ఆరు నెలలు కావొస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు వర కు ఇళ్ల నిర్మాణాలు మొదటి విడత కింద మంజూరై..., ఇం కా పనులు మొదలు పెట్టని పక్షంలో వాటిని రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు గృహనిర్మాణ శాఖ ఉన్నతాఽధికారులు ఆదేశాలు జారీచేశారు. రెండో విడతలో మంజూరైన ఇళ్లకు సంబంధించి, శ్రావణమాసం వర కు వేచి చూసి, వాటికి సంబంధించిన పూర్తి నివేదికను రూపొందించేందుకు జిల్లాయంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు ఇళ్లు ప్రారంభించని లబ్ధిదారుల స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయడమా? వీటిపై తగిన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది.
పెరిగిన ధరలతో ఇబ్బందులు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో లబ్ధిదారులకు కొంత మేరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిమెంట్ ధరలు ఇటీవల పెరగడంతో ఆర్థికభారం పడనుంది. గత నెల రోజుల్లో వివి ధ కంపెనీలు సిమెంట్ ధరలను ఒక్కో బస్తాకు రూ.50 నుంచి రూ.70వరకు పెంచాయి. దీంతోపాటు నిర్మాణపరం గా వినియోగించే వస్తువుల ధరలు కూడా పెరిగాయి. దీం తో లబ్ధిదారులు ఆర్థిక స్థితిగతులపై ఆలోచనల్లో పడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిరుపేదల చేతిలో నగదు లేకపోవడం తో వెనుకడుగు వేస్తున్నారు. తక్కువ స్థలం విస్తీర్ణం, బిల్లు ల చెల్లింపులో జాప్యం, రూ.5లక్షల సరిపోవన్న భావనతోపాటు ఆర్థిక స్థోమత ఇతరత్రా కారణాలతో లబ్ధిదారులు వెనుకాడుతున్నారు. అయితే జిల్లాయంత్రాంగం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు తక్కువ ధరకు సామగ్రి అందించాలని మండలాల వారీగా కమిటీలు ఏర్పాటుచేసింది. ఈ మేరకు ఇసుక, సిమెంట్‌తో పాటు ఇతర మెటీరియల్ తక్కువ ధరకు ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇళ్ల బిల్లుల మంజూరుతోపాటు 400 నుంచి 600 చదరపు అడుగుల్లో నిర్మించుకోవాలని సూచిస్తున్నారు. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా పలు చోట్ల లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేందుకు వెనుకడుగు వేస్తున్నారు.
రెండు విడతల్లో 9374 ఇళ్లు మంజూరు
జిల్లాలో మొత్తం 9374 ఇళ్లు మం జూరయ్యాయి. మొదటివిడతలో మొ త్తం 762 ఇళ్లు, రెండోవిడతలో 8612 ఇళ్లు మంజూరు చేసింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, నిర్మాణాలు ప్రారంభించింది. పలు గ్రామాల్లో వివిధ స్థాయిల్లో ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మొదటి విడతలో జిల్లాకు పైలెట్ ప్రాజెక్టు కింద 762వరకు ఇళ్లు మంజూరయ్యాయి.
Updated Date - Jul 24 , 2025 | 01:00 AM