త్రిపుల్‌ఆర్ ప్యాకేజీ ఇస్తేనే..
ABN, Publish Date - Jul 22 , 2025 | 12:35 AM
ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణంలో ఎంత పరిహారమైతే ఇస్తున్నారో.. ఆ పరిహారం ఇస్తేనే రిజర్వాయర్ నిర్మాణానికి తమ భూములు ఇస్తామని వీరారెడ్డిపల్లి గ్రామ భూనిర్వాసితులు తేల్చి చెప్పారు.
రిజర్వాయర్‌కు భూములు ఇస్తాం
మళ్లీ మొదటికొచ్చిన భూ సేకరణ సమస్య
చర్చలు జరపకుండా నే భూసేకరణ ఎలా చేస్తారు : రైతులు
(ఆంధ్రజ్యోతి-తుర్కపల్లి): ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణంలో ఎంత పరిహారమైతే ఇస్తున్నారో.. ఆ పరిహారం ఇస్తేనే రిజర్వాయర్ నిర్మాణానికి తమ భూములు ఇస్తామని వీరారెడ్డిపల్లి గ్రామ భూనిర్వాసితులు తేల్చి చెప్పారు. ఈ నెల 18న కలెక్టరేట్‌లో భూ పరిహారంపై నిర్వహించిన సమావేశంలో గంధమల్ల రైతులకిచ్చిన పరిహారమే ఇస్తామని అధికారులు చెప్పడంతో తమ భూ ములు విలువైనవని, ఆ పరిహారానికి తాము ఒప్పుకోమని సమావేశం మధ్యలోంచే రైతులు మూకుమ్మడిగా వెళ్లిపోయారు. దీంతో భూసేకరణ ప్రభుత్వ యంత్రాంగానికి ప్రధాన సమస్యగా మారింది.
పరిహారం విషయంలో రైతుల డిమాండ్‌కు, ప్రభుత్వానికి మధ్యకొంతకాలంగా సందిగ్ధం నె లకొంటోంది. దీంతో జిల్లాయంత్రాంగం స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు ఉన్నతాధికారులతో చర్చించింది. అయితే ఉన్నతాధికారులు నష్టపరిహారంపై మంత్రులతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చి రైతులకు వారు కోరిన విధంగా కాకుండా మధ్యస్థంగా పరిహారం ఫైనల్ చేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. ఈ మేరకు ఎకరాకు రూ.24.50లక్షలుపరిహారం ఇస్తామని అధికారులు పేర్కొనడంతో, ఆ పరిహారం తీసుకునేందుకు గంధమల్ల గ్రామ భూనిర్వాసితులు అంగీకరించి భూములు ఇవ్వడానికి ఒప్పుకున్నారు.
సర్వే పనులు ప్రారంభం..
భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి వీలైనంత త్వర గా అవార్డ్‌ను పాస్ చేసేందుకు సర్వే పనులు ప్రారంభించారు. కానీ మండలంలోని వీరారెడ్డిప ల్లి గ్రామ భూ నిర్వాసితులు మాత్రం ఆ పరిహా రం ఇస్తే తాము ఒప్పుకోమని, తమ భూములు విలువైనవని చెబుతున్నారు. ఎలాంటి పేపర్ నోటిఫికేషన్, గెజిట్ విడుదల కాకుండా, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నోటీ్‌సలు ఇవ్వకుండా సమావేశం నిర్వహించడంపై గ్రామ స్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే గ్రామం నుంచి వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్, ప్రాజెక్టు ముంపు ప్రాంతంలోనూ ఒకే సర్వే నెంబర్లు ఉన్నాయని, ఆర్‌ఆర్‌ఆర్ ప్యాకేజీ కింద రూ.42లక్షలు ఇస్తున్నారని, ఆ ప్యాకేజీకి తక్కువగా తీసుకునే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. గ్రామంలో 30 కుటుంబాలు గుంట భూమి లేకుండా పూర్తిగా భూమిని కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విలువైన భూములకు తక్కువ ధరకే ప్రభుత్వానికి అప్పగించేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. రిజర్వాయర్‌తో ముంపునకు గురవుతున్న రైతులు, బాధితులతో మరో సారి చర్చలు జరిపేందుకు రెవెన్యూ యంత్రాం గం సిద్ధమవుతోంది. రైతులు అడుగుతున్న పరిహారానికి, ప్రభుత్వం చెల్లిస్తామన్న పరిహారానికి భారీ వ్యత్యాసం ఉండడంతో రైతులు అంగీకరించడంలేదు. పరిహారంపై ప్రభుత్వం పునరాలోచించాలని రైతులు కోరుతున్నారు.
రిజర్వాయర్ నిర్మాణంతో 1,028.83 ఎకరాల ముంపు..
తుర్కపల్లి మండలంలో గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం పనులకు ఈ నెల 6న సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.575.75 కోట్లతో నిర్మిస్తున్న పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయింది. బీకేఎం-నవయుగ-ప్రసాద్ అనే సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. రిజర్వాయర్ నిర్మాణంతో ముంపునకు గురయ్యే వీరారెడ్డిపల్లి, గంధమల్ల రెవెన్యూ గ్రామాల్లో దాదాపు 1,028.83 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఇందులో కట్ట నిర్మాణానికి 112 ఎకరాలు, ముంపు ప్రాతాలైన గంధమల్లలో 650 ఎకరాలు, వీరారెడ్డిపల్లిలో ఎకరాలు 262.34 ఎకరాలు సేకరించనున్నారు. రెండు కిలోమీటర్లు పొడవునా కట్ట నిర్మించనున్నారు. ఈ భూమిని గంధమల్లలో సేకరించాలి. గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే, ఆలేరు నియోజక వర్గంలో దాదాపు 60వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది.
రీ సర్వే చేయాలి: జక్కుల వెంకటేశ్, భూ నిర్వాసితుడు, వీరారెడ్డిపల్లి
గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం ప్రతిపాదనను తిరస్కరించి ప్రభుత్వం రీసర్వే చేయాలి. రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న సర్వే నెంబర్ల భూముల ప్రకారం చూస్తే రిజర్వాయర్ గ్రామానికి తాకుతుంది. గతంలో గ్రామానికి దూరంగానే రిజర్వాయర్ ఉంటుందని అధికారులు చెప్పారు. రిజర్వాయర్ మ్యాప్, సర్వే నెంబర్లతోపాటు రైతుల భూముల వివరాలు తెలిపిన తర్వాతే భూ సేకరణ పనులు చేపట్టాలి.
ఆర్‌ఆర్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి : జే.మల్లేశ్‌యాదవ్, భూ నిర్వాసితుడు, వీరారెడ్డిపల్లి
గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి నాకున్న నాలుగు ఎకరాల భూమి పూర్తిగా ముంపునకు గురవుతుంది. ఈ భూమినే నమ్ముకునే ఇన్నాళ్లు బతుకుతున్నాం. ఈ భూమి పోతే బతుకుదెరువు లేదు. రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్)లో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు రూ.42లక్షలు పరిహారం ఇస్తున్నారు. మా భూములు కూడా ఆర్‌ఆర్‌ఆర్ పక్కనే రిజర్వాయర్ నిర్మాణంలో కోల్పోతున్నాం. ఆర్‌ఆర్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి.
Updated Date - Jul 22 , 2025 | 12:35 AM