ఆకాశంవైపు ఆశగా..
ABN, Publish Date - Jun 21 , 2025 | 12:14 AM
వరుణుడి కరుణ కోసం అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభమై నెల రోజులు కావొస్తున్నా ఒక్క వాన కూడా సరిగా కురవకపోడంతో ఆకాశంవైపు ఆశగా ఎదురు చూస్తున్నారు.
వర్షించు మేఘమా..? అంటూ ఎదురుచూపు
పలుప్రాంతాల్లోతొలకరి వర్షాలకు నాటిన విత్తనాలు
వర్షం కురిస్తేనే పంటలకు ప్రాణం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆశించిన స్థాయిలో కురవని వర్షాలు
పంటల సాగుపై సందిగ్దంలో రైతులు
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): వరుణుడి కరుణ కోసం అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభమై నెల రోజులు కావొస్తున్నా ఒక్క వాన కూడా సరిగా కురవకపోడంతో ఆకాశంవైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే నాటిన విత్తనాలకు చినుకమ్మ స్పర్ష తగిలితేనే మొలకెత్తే అవకాశాలున్నాయి. లేకపోతే విత్తనాలు ఎండిపోయి రైతులకు నష్టం వాటిల్లనుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పంటల సాగుపై రైతులు సందిగ్ధంలో పడ్డారు.
వానాకాలంలో నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయం కంటే ముందుగానే కేరళను తాకాయి. రోహిణి కార్తెలోనే చిరుజల్లులతో కూడిన వర్షాలు కురిశాయి. జూన్ రెండో వారంలోగా విస్తారం గా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే వర్షాలు విస్తారంగా కురవకపోవడంతో పంటల సాగుపై రైతులు సందిగ్ధంలో పడ్డారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా లో అక్కడక్కడ ఓ మోస్తారు వర్షా లు కురిసి ఆశలు చిగురింపజేసి నా, పూర్తిస్థాయిలో కురవకపోవడంతో సందిగ్ధం నెలకొంది. మెజార్టీ మండలాల్లోనూ సాధారణకంటే తక్కువగా వర్షపాతం నమోదైంది. కేవలం కొన్ని మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో వానాకాలంలో ఇప్పటివరకు సాధారణంగా 70.1 మి.మీ.ల వర్షపాతానికి 49.6 మిల్లీమీటర్ల వర్షపాతం, సూర్యాపేట జిల్లాలో 62.9 మి.మీ.లకు కేవ లం 15.6 మి.మీ.లు నల్లగొండ జిల్లాలో 64.9 మి.మీ. ల వర్షపాతానికి 43.0 మి.మీ.ల వర్షపాతం నమోదైం ది. మే నెలాఖరు, జూన్‌లో కురుస్తోన్న ఓ మోస్తారు వర్షంతోపాటు చిరుజల్లులకు పలుచోట్ల రైతులు వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, మినుములు, జొన్న, తదితర విత్తనాలను వేయడంతోపాటు వరి నారు మళ్లను కూడా పోశారు. వానాకాలం అదును దాటుతున్నప్పటికీ ఆశించినస్థాయిలో వర్షాలు కురవలేదు. వరుణుడు ముఖం చాటేయడంతో జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ముందస్తు తొలకరి జల్లులకు విత్తనాలు విత్తుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో వానాకాలం సీజన్ అనుభవం దృష్ట్యా విత్తనా లు వేసేందుకు రైతులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వర్షాలు ముందస్తుగా మురిపించి, ఆ తర్వాత రైతులను ఏడ్పిస్తాయా? అని రైతులు ఆలోచనలో నిమగ్నమయ్యారు. విత్తనాలు పొలాల్లో వేసిన పక్షం లో మొక్కలు పెరిగి..., పొలాల్లో మొలిచినా మొక్కలు ఎండిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో భారీ వర్షాలు కురిస్తేనే పెద్దఎత్తున పంటల సాగుచేసే యోచనలో ఉన్నారు.
చెరువుల్లోకి చుక్కనీరు చేరని వైనం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ వర్షాలు కురవకపోవడంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరలేదు. భూగర్భజలాలు కూడా అంతంత మాత్రంగానే పెరిగాయి. ఈ నేపథ్యంలో వరి నారు నాటితే నీరు లేక ఎండిపోయే ప్రమాదం ఉంది. దీంతో నారుమళ్లు ఎరువులు సిద్ధం చేసుకుని, భారీ వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయే తప్ప పెద్దగా వర్షాలు కురవడంలేదు. చిరుజల్లులకే పరిమితమవుతోంది. రెండు మిల్లీ మీటర్ల నుంచి ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. కనీసం సెంటీమీటరు వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నప్పటికీ, గ్రామీణ మండలాల్లో చిరుజల్లులకే పరిమితమవుతుంది. చెరువులు, కుంటల్లోకి చుక్కనీరు కూడా చేరలేదు. దీంతో వర్షం జాడ లేక రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో జూలై నెలాఖరు వరకు ఖరీఫ్ సీజన్ ఉంటుందని, జొన్న, పత్తి, మొక్కజొన్న తదితరుల పంటలు వేసుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఈ వారం రోజుల్లోగా విస్తారంగా వర్షాలు కురిస్తేనే రైతులు కరువు నుంచి గట్టెక్కే అవకాశముంది.
నెలరోజులు కావొస్తున్నా..
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలరోజులు పూర్తయిం ది. ఈసారి వాతావరణశాఖ ప్రకటించినట్టుగానే ముందస్తుగా వర్షాలు కురిసినప్పటికీ, ఆశించిస్థాయిలో వర్షాలు పడలేదు. పలు మండలాల్లో సాధారణం కం టే తక్కువగా వర్షపాతం నమోదైంది. పలు ప్రాం తా ల్లో తొలకరి వర్షాలకు పత్తి, మొక్కజొన్న, వరి, పెసర, విత్తనాలు నాటారు. అవన్నీ కూడా మొలకలు వచ్చా యి. వర్షాలు ముఖం చాటేయడంతో మొక్కలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. బోర్లుబావులు ఉన్న రైతులు పొలాలు తడిపేందుకు తిప్పలు పడుతున్నారు. నీటి సౌకర్యంలేని రైతులకు వర్షం కురిస్తేనే పంటలకు ప్రాణం అన్నట్టుగా పరిస్థితి ఏర్పడింది. ఎండల తీవ్రత ఉన్నప్పటికీ, సాయంత్రంవేళ ఆకాశం మేఘావృతమవుతుండడంతో వర్షం కురుస్తుందని ఎదురుచూస్తున్న రైతులకు నిత్యం నిరాశే ఎదురవుతోంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వర్షాభావ పరిస్థితి..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సీజన్‌లో భారీ వర్షాలు కురవలేదు. దీంతో అన్ని మండలాల్లోనూ వర్షాలకోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట జిల్లాలో తక్కువగా వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 23 మండలాల్లోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు 62.9 మి.మీ.ల వర్షపాతానికి కేవలం 15.6 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ సాధారణంకంటే 75శాతం మేరకు వర్షపాతం తక్కువగా నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో వానాకాలం సీజన్‌లో ఇప్పటివరకు 70.1 మి.మీ.ల వర్షపాతానికి 49.6 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 17మండలాలకు గానూ... ఆత్మకూరు(ఎం), చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి, సంస్థాన్‌నారాయణపురం, తుర్కపల్లి, రాజాపేటలో సాధారణ వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నల్లగొండ జిల్లాలో సాధారణంగా 64.9 మి.మీ.ల వర్షపాతానికి 43.0 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో 31 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. జిల్లాలో మొత్తం 33 మండలాలకు కొండమల్లేపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి, చందంపేట, గట్టుప్పల్, మర్రిగూడ, చింతపల్లి, చిట్యాల, నకిరేకల్ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో సాధారణంకంటే తక్కువగా వర్షపాతం నమోదైంది.
వర్షం కోసం ఎదురుచూస్తున్నాం : శ్రవణ్‌కుమార్‌రెడ్డి, రైతు, సీతారాంపూర్
వానాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. భారీగా వర్షాలు కురిస్తేనే పంటలను సాగుచేసే అవకాశం ఉంది. సాధారణ వర్షపాతం కంటే తక్కువగా నమోదైంది. చెరువులు, కుంటల్లోకి నీరు చేరలేదు. దీంతో భూగర్భజలాలు పెరగలేదు. వ్యవసాయ బోర్లలోనూ నీరు అంతగా చేరలేదు. వేసవిలో మాదిరిగానే నీరు వస్తోంది. వరి నాటు వేసేందుకు సిద్ధం చేసుకుంటున్నాం.
Updated Date - Jun 21 , 2025 | 12:14 AM