వేధిస్తోన్న.. నకిలీల బెడద
ABN, Publish Date - May 15 , 2025 | 12:41 AM
సీజన్ వచ్చిందంటే చాలు రైతుల కు నకిలీల బెడద తప్పడం లేదు. ఆరు గాలం శ్రమించి సాగు చేస్తే తీరా చేతికొస్తుందనుకున్న పంట రాకపోవడంతో రైతులు ఆత్మహత్య లు చేసుకుంటున్నారు.
రైతులను నట్టేట ముంచుతున్న నకిలీ విత్తనాలు
గతంలో పీడీయాక్ట్ అమలు, ఐదు కేసులు నమోదు
ఏపీలోని సరిహద్దు జిల్లా నుంచి విత్తనాల చేరిక
నల్లగొండలో కొందరి డీలర్లది ఆడిందే ఆట
మూడు శాఖలతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన యంత్రాంగం
(ఆంధ్రజ్యోతి-నల్లగొండ) : సీజన్ వచ్చిందంటే చాలు రైతుల కు నకిలీల బెడద తప్పడం లేదు. ఆరు గాలం శ్రమించి సాగు చేస్తే తీరా చేతికొస్తుందనుకున్న పంట రాకపోవడంతో రైతులు ఆత్మహత్య లు చేసుకుంటున్నారు. దీంతో రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మొదట్లోనే నకిలీ విత్తనాల ఆటకట్టిస్తే పంట చేతికొచ్చి, నష్టాల్లేకుండా ఉం టుందని రైతులు పేర్కొంటున్నారు.
వానాకాలం సీజన్ కంటే ముందే నకిలీ విత్తన ముఠా చేయని ప్రయత్నమంటూ ఉండదు. లూజ్ విత్తనాలను ఆకర్షణీయమైన కవర్లలో ప్యాకింగ్ చేసి రైతులకు తక్కువ ధరలకే అంటగడుతూ నిలువునా మోసం చేయడం దళారులకు అలవాటుగా మారింది. అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఏదో ఒక చోట పట్టుబడుతూనే ఉన్నాయి. ప్రతీ వానాకాలం సీజన్‌లో నాసిర కం విత్తనాల బెడద రైతాంగానికి పెను సవాల్‌గా మారిం ది. అసలు ఏదో.. నకిలీది ఏదో.. గుర్తించలేని విధంగా విత్తనాలు మార్కెట్‌లో ఉంటుండటంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. ప్రధానంగా వరి, పత్తి విత్తనాలు నాసిరకం కావడంతో రైతులకు నష్టాలు తప్పడంలేదు. తీరా పత్తి పంటలో దిగుబడి రాక రైతులు ఆర్థికంగా దెబ్బతింటుండ గా వరిలో సైతం తెగుళ్లు, తాలు, నాణ్యతలేకపోవడంతో రైతులు పంట చేతికొచ్చే సమయంలో లబోదిబోమంటున్నారు. వరి, పత్తి విత్తనాల విషయంలో దళారులదే పెత్తనమైంది. గ్రామీణ ప్రాంతాల్లో దళారులు రైతులను మచ్చిక చేసుకుని తక్కువ ధర, అధిక దిగుబడులు, తక్కువ సమయంలో పంట చేతికి వస్తుందని నమ్మించి నాసిరకం విత్తనాలు అంటకడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నా దళారుల దందాను నిలువరించలేక పోతున్నారు. గత ఏడాది మే రెండోవారంలో నల్లగొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, మర్రిగూడ మండలాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో పలుచోట్ల ఐదు కేసులను కూడా నమోదు చేసిన సందర్భాలున్నాయి. ఒకానొక దశలో పీడీ యాక్టును కూడా అమలు చేశారు. అయినప్పటికీ విత్తనాల నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. పెట్టుబడులు చేతిలో లేని రైతులు తక్కువ ధరకు వచ్చే విత్తనాలను తీసుకుని వేసిన సందర్భాలూ ఉన్నాయి. దీంతోనే రైతులు నష్టపోతున్నారు. తాజాగా జిల్లా ఉన్నతాధికారులు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. వ్యవసాయ శాఖతోపాటు పోలీ్‌సశాఖ, రెవెన్యూశాఖ సమన్వయంతో పలు టీంలు ఏర్పడి తనిఖీలు విస్తృతంగా చేయాలని నిర్ణయించాయి. అయితే ప్రతీ సంవత్సరం ఈవిధంగా తనిఖీలు చేస్తున్నా, ఎక్కడో ఒక చోట నకిలీ విత్తనాల బెడద తప్పడం లేదు. నల్లగొండ జిల్లాలోనే గతంలో లూజు పత్తి విత్తనాలు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
ఉమ్మడి జిల్లాలో 21.50లక్షల ఎకరాల్లో పంటల సాగు
ఈ నెల నాలుగో వారం నుంచి వ్యవసాయ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా అకాల వర్షాలకు దుక్కులను దున్నకుని సిద్ధం చేసుకున్నారు. ఈ నెలాఖరులోనే నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంతోపాటు తెలంగాణలో సైతం ముందుగానే వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో వర్షాలు కురిస్తే ముందుగానే విత్తనాలు వేస్తారు. ఈ నెల చివర్లో రోహిణి కార్తె ప్రారంభంకానుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరితోపాటు పత్తి అంతా కలిపి 21.50లక్షల ఎకరాల్లో పంటలు సాగు కానున్నాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 5.40లక్షల ఎకరాల్లో పత్తి సాగు కానుండగా ఇందుకు సంబంఽధించి 13.60లక్షల విత్తన ప్యాకెట్లు అవసరం ఉంటాయి. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలో వరి అత్యధికంగా సాగు కానుండగా పత్తి సుమారు 3లక్షల మేర సాగు కానుంది. అంటే ఈ రెండు జిల్లాలో దాదాపు 9లక్షలకు పైగా పత్తి విత్తన ప్యాకెట్లను వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. ఇక వరికి సంబంధించి విత్తనాలు దాదాపు 2.4లక్షల క్వింటాళ్లకు పైగా విత్తనాలు అవసరం ఉంటుంది.
కొందరు ఆడిందే ఆట.. పాడిందే పాట..
జిల్లా కేంద్రమైన నల్లగొండ పట్టణంలో కొందరు డీలర్లది ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రకాశంబజార్, దేవరకొండ రోడ్డుతోపాటు పాత బజార్‌లోని కొందరు డీలర్లు తమకు ప్రజాప్రతినిధుల అండ ఉందని రాజకీయ పార్టీలతో సంబంధాలున్నాయని బాహాటంగా పేర్కొంటూ దందాలకు పాల్పడుతున్నట్లు రైతులనుంచి విమర్శలు వస్తున్నాయి. సీజన్‌లో తమ దుకాణాలను టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు చేయకుండా ఉండేలా తమకు ప్రజాప్రతినిధుల అండ ఉందని చెబుతుండటం గమనార్హం. ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్‌లో పోలీస్, వ్యవసాయ, రెవెన్యూశాఖ అధికారులు ఉన్నారు. ప్రతీ సీజన్‌కు ముందు టాస్క్‌ఫోర్స్ అధికారులను తప్పుదోవ పట్టించే విధంగా పత్తి విత్తనాలు విక్రయించే రంగంలో ముదిరిపోయిన కొందరు డీలర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈసారైనా టాస్క్‌ఫోర్స్ అధికారులు పత్తి విత్తనాలు విక్రయించే డీలర్లపై నిఘా పెట్టి తనిఖీలు చేస్తారా? అనేది వేచి చూడాల్సి ఉంది.
భూత్‌పూర్, మాచర్ల నుంచి నిషేధిత బీటీ-3 విత్తనాలు
అమెరికా దేశంలోని శాన్‌శాంటోను కంపెనీకి చెంది బీటీ-3 రకం విత్తనాలపై దేశవ్యాప్తంగా నిషేదం ఉంది. బీటీ-3 విత్తనాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదు. బీటీ-1, బీటీ-2 రకాలకు మాత్రమే అనుమతి ఉంది. దాదాపు 20 ప్రధాన కంపెనీలకు చెందిన అనుమతిగల విత్తనాలను అందుబాటులో ఉంచారు. ఇకపోతే నిషేధిత విత్తనాలవల్ల కాలుష్యంతో ముప్పు వాటిల్లే అవకాశంతోపాటు అనేక రకాలుగా నష్టాలున్నాయి. మహుబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా పత్తి జిన్నింగ్ మిల్లులు ఉండటంతో విత్తనోత్పత్తి సులువుగా జరుగుతుంది. అయితే భూత్‌పూర్ నుంచి వచ్చే అన్ని రకాల విత్తనాలు నష్టం కలిగించనప్పటికీ దళారుల జోక్యంతో బీటీ-2 రకం విత్తనాల పేరిట బీటీ-3 రకం విత్తనాలను అంటగడుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారుల దృష్టికి సైతం వచ్చినట్లు సమాచారం. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని మాచర్ల నుంచి సైతం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నాసిరకం విత్తనాలతోపాటు బీటీ-3 రకం విత్తనాలు కూడా చేరుతున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ సరిహద్దులోనే మాచర్ల ఉండటంతో సులువుగా వివిధ మార్గాల్లో నకిలీ పత్తి విత్తనాలు చేరుతున్నాయి. వాస్తవానికి అయితే చాలామంది డీలర్లు, వ్యాపారులు రైతులు పత్తి, వరి విత్తనాలు కొనుగోలు చేసిన వెంటనే వారికి బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చాలాచోట్ల రశీదు ఇవ్వకుండా రైతులను మభ్య పెట్టి పంపించి వేస్తున్నా సంఘటనలున్నాయి. పంట దిగుబడులు తక్కువగా వచ్చినప్పుడు రైతులు నిలదీస్తారన్న భయంతో ఏ వ్యాపారి కూడా బిల్లులు ఇవ్వడం లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక, ఛత్తీ్‌సగడ్, గుజరాత్‌ల నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి ఆ తర్వాత నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు చేరుతుండటం గమనార్హం. రోడ్డుమార్గం ద్వారా పట్టుబడుతామన్నా ఆలోచనతో కొంత మంది దళారులు రైళ్లలో తరలించడం, లేదంటే ట్రాన్స్‌ఫోర్ట్ వాహనంలో జిల్లాకు చేరవేస్తున్నారు. ఒరిజినల్ కంపెనీలకు చెందిన ప్యాకెట్ల మాదిరిగానే నకిలీ ప్యాకెట్లు తయారుచేసి అందులో నాసిరకమైన పత్తి విత్తనాలను నింపి రైతులకు అంటగట్టే ప్రమాదం ఉంది. ఈనేపథ్యంలో గత సంవత్సరం వ్యవసాయ శాఖ అధికారులు వరితోపాటు పత్తి విత్తనాలకు సంబంఽధించిన నమునాలను సేకరించి రాజేంద్ర నగర్ ల్యాబ్‌కు పంపించారు. కొంతమంది మధ్య దళారులు మూడు జిల్లాలనుంచి పత్తి వేసే రైతులను భూత్‌పూర్‌కు తీసుకవెళ్లి నాసిరకం విత్తనాలు అంటగట్టడంతోపాటు వారు డిస్కౌంట్ ఇస్తున్న మాదిరిగా వ్యవహరించి భోజనాల ఖర్చులు ఇవ్వడం, రానుబోను వాహన చార్జీలు ఇచ్చి మభ్యపెట్టి మోసం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 10మంది చొప్పున రైతులను ఒక జట్టుగా తయారై ఆటోలు, ప్రైవేట్ వాహనాల్లో భూత్‌పూర్, మాచర్లతోపాటు ఇతర ప్రాంతాలకు వెళ్లి దళారుల మాటలు నమ్మి నష్టపోయిన సంఘటనలు కొకొల్లలు ఉన్నాయి.
రైతులు రశీదులను తప్పనిసరిగా తీసుకోవాలి: పి.శ్రవణ్ కుమార్, జేడీఏ, నల్లగొండ.
ప్రతీ రైతు కూడా విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇతర ప్రాంతాల నుంచి బీటీ-2 విత్తనాల పేరిట బీటీ-3 విత్తనాలను అంటగట్టే ప్రమాదం ఉంది. బీటీ-3ని కేంద్రం నిషేదించింది. రైతులు పూర్తిస్థాయిలో అనుమతులున్నా డీలర్లు, వ్యాపారుల వద్దే విత్తనాలను కొనుగోలు చేసి రశీదులు తీసుకోవాలి. నాణ్యమైన విత్తనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నాం. లైసెన్స్ ఉన్న డీలర్లనుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. మధ్య దళారుల వద్ద ఎట్టి పరిస్థితులోను విత్తనాలను కొనుగోలు చేయవద్దు.
Updated Date - May 15 , 2025 | 12:41 AM