నియోజకవర్గాల పునర్విభజనకు రంగం
ABN, Publish Date - Jun 22 , 2025 | 11:57 PM
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమవుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా లో ఎంపీ సీటు అదనంగా పెరగక పోయినా, అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉండడంతో కొత్త ఆశలు పుట్టుకొస్తున్నాయి.
రాజకీయవర్గాల్లో విస్తృత చర్చ
వచ్చే ఎన్నికల నాటికి లోక్‌సభ, అసెంబ్లీ ల పునర్విభజన ఖాయమనే సంకేతాలు
విధి, విధానాలపైనే అందరి ఆసక్తి
మహిళా రిజర్వేషన్లు,జమిలి ఎన్నికలు ఖాయమనే భావన
బీసీ రిజర్వేషన్లు వస్తాయనే ఆశాభావం
ఉమ్మడి జిల్లాలో నాలుగు నుంచి ఆరు వరకు ఎమ్మెల్యే సీట్లు పెరిగే అవకాశం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ): లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమవుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా లో ఎంపీ సీటు అదనంగా పెరగక పోయినా, అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉండడంతో కొత్త ఆశలు పుట్టుకొస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ల అమలు, జమిలి ఎన్నికలు ఖాయమనే భావనతో అందరిలో ఆసక్తి నెలకొంది. రాజకీయ పార్టీలు, కీలకనేతలు సీట్ల విభజనను ఏమేరకు ప్రభావితం చేయగలుగుతారనే అంశం చర్చనీయాంశమైంది.
లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, జమిలి ఎన్నికలపై రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైం ది. రాబోయే సార్వత్రిక ఎన్నికలు స్పష్టమైన మార్పుల తో జరుగుతాయనే అభిప్రాయం బలంగా వినిపిస్తోం ది. చట్టసభల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేష న్లు కల్పించే బిల్లు ఇప్పటికే ఆమోదం పొందగా, వచ్చే సార్వత్రిక ఎన్నికల నుంచి అమలు చేయాల్సి ఉంది. తాజాగా జనగణనతోపాటు కులగణన చేపడుతుండడంతో ఈ లెక్కల ఆధారంగా బీసీ వర్గాలకు సైతం చట్టసభల్లో రిజర్వేషన్లకు గ్రీన్‌సిగ్నల్ వస్తుందనే ఆశాభావం వెల్లడవుతోంది. ఈ కీలక మార్పుల తోపాటు జనగణన ముగిసిన వెంటనే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమవుతుండడంతో లోక్‌సభ సీట్లను పెంచే ప్రాతిపదిక ఆధారంగా రాష్ట్రంలో సీట్ల సంఖ్య ఏమేరకు పెరుగుతుందనే అంశంపై స్పష్టత రానుండగా, లోక్‌సభ సీట్ల కు తీసుకున్న ప్రామాణికతనే అసెంబ్లీ సీట్లు పెంచడానికి తీసుకుంటారా..?లేకఏపీ పుననర్విభజన చట్టం లో పేర్కొన్న ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ల సీట్ల సంఖ్యను పెంచుతారా..?అనే అంశంలోనూ స్పష్ట త రావాల్సి ఉంది. రాజకీయ పార్టీలు, కీలకనేత లు సీట్ల విభజనను ఏమేరకు ప్రభావితం చేయగలుగుతారనే అంశంతోపాటు, డీలిమిటేషన్ విధి విధానాలు ఎలాఉంటాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఉమ్మడి జిల్లాకు అదనపు ఎంపీ సీటు కష్టమే
తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం లోక్‌సభ సీట్లను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతమున్న సీట్లకు 20 శాతం అదనంగా పెంచుతారనే సంకేతా లు వస్తున్నాయి. లోక్‌సభ సీట్ల పునర్విభజనను జనా భా ప్రాతిపదికన చేపడితే కుటుంబ నియంత్రణను కట్టుదిట్టంగా అమలు చేసి జనాభా నియంత్రణకు తోడ్పడిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ఆందోళనల నేపథ్యంలో కేంద్రం జనాభాతో సంబం ధం లేకుండా రాష్ట్రాలవారీగా 20శాతం సీట్లు పెంచే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 20శాతం మేర సీట్లు పెంచితే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అదనపు లోక్‌సభ స్థానం దక్కకపోవచ్చని అంచనా వేస్తున్నా రు. రాష్ట్రం మొత్తంగానే మూడు లేక నాలుగు సీట్లు మాత్రమే అదనంగా వస్తాయని, అందులో జనాభా, జనావాసాలు రోజురోజుకీ పెరుగుతున్న, అత్యధికంగా జనాభా నమోదయ్యే హెచ్‌ఎండీఏ పరిధిలోనే రెండు సీట్లు పెరిగే అవకాశం ఉందని, మరో సీటు సర్దుబాటులో ఎక్కడో చోట వచ్చే అవకాశముంటుందని, ఈ పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాలో అదనంగా సీటు రావడం కష్టమని భావిస్తున్నారు. అయితే అసెంబ్లీ నియోజకవర్గాలను సైతం పెంచితే వాటికనుగుణంగా ప్రస్తుతమున్న లోక్‌సభ స్థానాల సరిహద్దులు మారవచ్చని, భువనగిరి నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం, జనగామ నియోజకవర్గాలు ఆయా ఉమ్మడి జిల్లాల పరిధిలో వచ్చే లోక్‌సభ స్థానాల పరిధిలోకి వెళితే, నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల పరిధిలోకి ఉమ్మడి జిల్లాలోని కొత్త, పాత అసెంబ్లీ స్థానాలతో లోక్‌సభ స్థానాలు సరిపోవచ్చని అంచనా వేస్తున్నారు.
కొత్త అసెంబ్లీ సీట్లపైనే..
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే లోక్‌సభకు నిర్ధేశించిన ప్రకారమే అసెంబ్లీ సీట్లనూ పెంచితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే వస్తాయని, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రూపొందించిన ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పెంచితే సీట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ చట్టం ప్రకారం ప్రతీ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు పెరగాల్సి ఉంది. గత పదేళ్లలో కేంద్రం ఈ సీట్ల పెంపు చేపట్టలేదు. త్వరలో జరిగే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో సీట్లను పెంచాలని రాష్ట్రంలోని అన్ని పార్టీలు కేంద్రాన్ని కోరితే, దీనికి కేంద్రం అంగీకరిస్తే, ఉమ్మడి జిల్లాలో మూడు అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాల సరిహద్దులు మారడంతో పాటు, కొత్త జిల్లాల సరిహద్దులు, కొత్త మండలాల సరిహద్దుల ఆధారంగా నియోజకవర్గాల ఏర్పాటు జరుగుతుందని, దీంతో యాదాద్రి, సూర్యాపేట నల్లగొండ జిల్లాల్లో ఒక్కో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయడంతోపాటు, ప్రస్తుతమున్న నియోజకవర్గాల పరిధిని సర్ధుబాటు చేస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పునర్విభజన నోటిఫికేషన్ వస్తే పూర్తి స్పష్టత వస్తుందని, రాజకీయపార్టీలు సైతం ప్రస్తుతం అంతర్గతంగా కసరత్తు చేస్తున్నప్పటికీ నోటిఫికేషన్ వచ్చాక తమ పార్టీల వారీగా ప్రతిపాదనలు ఇచ్చేదాన్ని బట్టి మార్పులు, చేర్పులుంటాయని చెబుతున్నారు.
మహిళలకు సీట్లు ఖాయం
జనగణన, కులగణన, అనంతరం నియోజకవర్గాల పునర్విభజనతోపాటు జమిలి ఎన్నికలు జరిపే విషయమై కేంద్రం పట్టుదలగా ఉండడంతో రాబోయే సార్వత్రిక ఎన్నికలు జమిలిగా జరుగుతాయని అంచనా వేస్తున్నారు. జమిలి నిర్ణయం తీసుకుంటే 2028 చివరలో జరగాల్సిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలను ఆరు నెలలు వాయిదా వేసి, 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికలతో కలిపి నిర్వహిస్తారని చెబుతున్నారు. అదేవిధంగా మహిళలకు రిజర్వేషన్లు అమల్లోకి రానుండడంతో జిల్లాలో అసెంబ్లీ సీట్లు 14కి పరిమితమైతే నాలుగు సీట్లు, 15 దాకా పెరిగితే అయిదు సీట్లు మహిళలకు కేటాయించడం ఖాయమని, అయితే ఏ నియోజకవర్గాలు మహిళలకు కేటాయిస్తారనే అంశం కొత్తగా రూపొందే నియోజకవర్గాల ప్రకారం జనాభా ప్రాతిపదికన ఎంపిక చేస్తారని తెలుస్తోంది. అదేవిధంగా బీసీలకూ చట్టసభల్లో రిజర్వేషన్లు ప్రకటిస్తే ఆ మేరకు ఆయా వర్గాలకు సీట్ల కేటాయింపు ఉంటుందని అశిస్తున్నారు. మొత్తంగా రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు పలు మార్పులు, చేర్పుల మధ్య, పలు కీలక సామాజిక సమీకరణాల నడుమ కొనసాగుతాయనే అంశం స్పష్టమవుతుందని, రాజకీయాల్లో పూర్తిమార్పు రాబోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Updated Date - Jun 22 , 2025 | 11:57 PM