మట్టపల్లి క్షేత్రంలో కన్నుల పండువగా ఎదుర్కోళ్లు
ABN, Publish Date - May 12 , 2025 | 12:23 AM
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం లోని మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో తిరుకల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఎదుర్కోళ్ల కార్యక్రమం కన్నుల పండువగా సాగింది.
మఠంపల్లి, మే 11 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం లోని మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో తిరుకల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఎదుర్కోళ్ల కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. రాత్రి రెండుగంటలకు(తెల్లవారితే సోమవారం) జరిగే కళ్యాణానికి నృసింహస్వామిని పెళ్లికుమారుడిగా, భూదేవి, చెంచులక్ష్మి అమ్మవార్లను పెళ్లి కుమార్తెలుగా అలంకరించారు. యాజ్ఞికులు బొర్రా వాసుదేవాచార్యుల ఆధ్వర్యంలో పరాశరం వెంకటాచార్యులు, నారాయణం హరికిరణాచార్యులు బృందంతో ఎదుర్కోళ్ల కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.
బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు..
మట్టపల్లి లక్ష్మీనృసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో రెండవరోజైన ఆదివారం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆరు గంటలకు సుప్రభాతం, ప్రాతఃకాలార్చనలు, ఏడు గంటలకు స్వామివారికి పంచామృతాభిషేకం, తొమ్మిది గంటలకు రాజశేఖరుని లక్ష్మీపతిరావు దంపతులతో మల్లికాపుష్ప, సహస్ర నామార్చనలు, మట్టపల్లి రామయ్య దంపతులతో మార్తి లక్ష్మీనరసింహామూర్తి, జానపాటి సీతారామశాస్ర్తీ ఆధ్వర్యంలో లక్ష మల్లికాపుష్ప పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు పూజా కార్యక్రమాలు, సాయంత్రం 4 గంటలకు నాదస్వర కచేరి, ఐదు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సంగీత విభావరి, కోలాట ప్రదర్శన, హరికథా కాలక్షేపం, నామసంకీర్తన కార్యక్రమాలు కొనసాగాయి. రాత్రి 12 గంటలకు ఉత్సవమూర్తులకు ఎదుర్కోళ్లు నిర్వహించి, వేదమంత్ర పఠనంతో సమస్త మంగళవాయిద్యాలతో కల్యాణ మండపం వరకు భక్తజనుల ఊరేగింపుతో తీసుకువచ్చారు. పూజాకార్యక్రమాల్లో ఆలయ ఽధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈవో సిరికొండ నవీనలు తెలిపారు. ఉత్సవ ఏర్పాట్లను హుజూర్‌నగర్ ఆర్డీవో శ్రీనివాసులు, సీఐ చరమందరాజు, తహసీల్దార్ మంగా, ఎస్‌ఐ బాబు పర్యవేక్షించారు.
ఇరుముడులతో దీక్షాదారులు
లక్ష్మీనరసింహ మండల దీక్షలు చేపట్టిన భక్తులు 40రోజులు పూర్తికావడంతో మట్టపల్లి క్షేత్రంలో దీక్షలను విరమించనున్నారు. ఈ క్రమంలో మఠంపల్లి, బీల్యానాయక్‌తండా, చౌటపల్లి, పెదవీడు, రఘునాథపాలెం,యాతవాకిళ్ల, దొనబండతండా, లాలితండా, తుమ్మలతండా గ్రామాలకు చెందిన స్వాములు ఆయా గ్రామాల్లోని దేవాలయాల్లో ఆదివారం పూజలు నిర్వహించి గురుస్వాముల ఆధ్వర్యంలో ఇరుముడులు ధరించి కాలినడకన మట్టపల్లికి చేరుకున్నారు. రాత్రి కల్యాణోత్సవాన్ని తిలకించి, సోమవారం స్వామి సన్నిధిలో దీక్షలు విరమించనున్నారు.
Updated Date - May 12 , 2025 | 12:23 AM