పల్లెలకు ఎన్నికళ
ABN, Publish Date - Jul 01 , 2025 | 11:55 PM
రాజకీయంగా కొన్నాళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చలు ప్రారంభమయ్యాయి. గ్రామపంచాయతీ ఎన్నికలను సెప్టెంబరులోగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో, ప్రభుత్వానికి కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్
పట్టణాలు విడిచి గ్రామాల బాటపట్టిన ఆశావహులు
ఓటర్లకు పలకరింపులు, ఆర్థిక సహాయాలు
రిజర్వేషన్లపై నేతల్లో ఉత్కంఠ
(ఆంధ్రజ్యోతి, యాదాద్రి): రాజకీయంగా కొన్నాళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చలు ప్రారంభమయ్యాయి. గ్రామపంచాయతీ ఎన్నికలను సెప్టెంబరులోగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో, ప్రభుత్వానికి కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పల్లెల్లో మూడు నెలల ముందుగానే స్థాని క సంస్థల ఎన్నికల వాతావరణం నెలకొంది. ఏ చౌరస్తాల్లో చూసినా ఏ పార్టీ నుంచి ఎవరెవరు బరిలో ఉంటారనే చర్చలు జోరందుకున్నాయి.
త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీలతోపాటు సర్పంచ్‌గా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ప్రజలతో మమేకమవుతున్నారు. ఉద యం నుంచి పల్లెల్లో పర్యటిస్తూ పలకరింపుల తో ముందుకు సాగుతున్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు మొత్తం 50శాతంగా ఉం డేవి. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉండగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాజిక న్యాయం పాటిస్తామని ఆ పార్టీ అధిష్ఠా నం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే మిగతా పార్టీలు కూడా బీసీలకు టికెట్లు కేటాయించడంపై కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు గత ప్రభుత్వం చేసిన పంచాయతీరాజ్‌చట్టం-2019 ప్రకారం స్థానిక సంస్థల్లో పదేళ్ల వరకే ఒకే రిజర్వేషన్ కొనసాగించాలి. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం పాత చట్టానికి సవరణలు చేసింది. పాత విధానానికి స్వస్తి పలికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్తగా రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టే అవకాశం ఉం ది. రిజర్వేషన్లు మారే అవకాశం ఉండటంతో రాజకీయ పార్టీల నేతలు వారికి అనుకూలంగా రిజర్వేషన్ వస్తుందనే ఆశతో ముందుకు సాగుతున్నారు. అధికార పార్టీతో పాటు అన్ని పార్టీల్లోనూ స్థానిక సంస్థల్లో టికెట్ల కేటాయింపు ఎలా ఉంటుందనే ఉత్కంఠత నెలకొంది. ప్రభు త్వం ఏ క్షణమైనా రిజర్వేషన్ల ఖరారుపై ప్రకట న విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆశావహులు పల్లెల్లో ప్రజల ఆదరణ చూరగొనేందుకు తిప్పలు పడుతున్నారు.
ఆదేశాలే ఆలస్యం
రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఎప్పుడు ఆదేశాలు వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లాయంత్రాంగం సిద్ధంగా ఉంది. మరోవైపు హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎ్‌సఈసీ) వేగం పెంచింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ఓటరు జాబితా సవరణ సైతం పూర్తిచేశారు. గ్రామపంచాయతీల వారీగా ఓటరు జాబితాను జిల్లా యంత్రాంగం విడుదల చేసింది. జిల్లాలోని మొత్తం 428 గ్రామ పంచాయతీల్లో 5,20,297మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,59,167మంది, మహిళలు 2,61,127మంది, ఇతరులు ముగ్గురు ఉన్నారు. పంచాయతీలు, వార్డులు, మండల, జిల్లా పరిషత్ స్థానాల వారీగా ఓటర్ల వివరాలను అధికారులు ఆన్‌లైన్ చేస్తున్నారు. స్థానిక సంస్థల వారీగా మ్యాప్‌లను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయగా, బ్యాలెట్‌పేపర్ల ముద్రణ పూర్తయింది. తాజాగా, మరోసారి తుది ఓటరు జాబితా సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. జిల్లాలో మొత్తం 17 జడ్పీటీసీ స్థానాలు, 117 ఎంపీటీసీలు, 428 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గత ఏడాది జనవరి 30తో సర్పంచ్ పదవీకాలం ముగిసింది. ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని సన్నాహాలు చేసినా సాధ్యం కాలేదు. గతంలోనే ఎన్నికలు ఉంటాయని అధికారులు సామగ్రిని సిద్ధం చేయగా, వాటిని జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు. రిటర్నింగ్ అధికారులకు శిక్షణ సైతం వచ్చారు. ఏపీవోలను ఎంపిక చేయగా,వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది. చివరి దశలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఆ ప్రక్రియ నిలిచింది. తాజాగా హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికలపై మళ్లీ కదలిక రాగా, గ్రామీణ ప్రాంతాల్లో సందడి నెలకొంది.
పట్టణాలు విడిచి పల్లెబాట
స్థానిక సంస్థల ఎన్నిలక నిర్వహణ ఖాయం కావడంతో పోటీ చేయాలనుకున్న నేతలు పట్టణాలు విడిచి పల్లెబాట పట్టారు. జిల్లా హైదరాబాద్ నగరానికి చేరువలో ఉండటంతో వ్యా పారాలు, పిల్లల విద్య కోసం పలు రాజకీయ పార్టీల నేతలు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నివసిస్తూ అప్పుడప్పుడూ స్వగ్రామానికి వస్తుంటారు. అయితే ఎన్నికలు సమీపిస్తుండటంతో పట్టణాలు విడిచి గ్రామాల బాటపట్టా రు. ఆశావహులు పల్లెల్లోని వారి అనుచరుల తో సమావేశాలు నిర్వహిస్తూ, ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలనే తీరు తెన్నులపై సమాలోచనలు చేస్తున్నారు. ఉదయం నుంచే పల్లెల్లో పర్యటిస్తూ అక్క,అన్న,చెల్లి, తమ్ముడు అంటూ పలకరించి యోగక్షేమాలు తెలుసుకుంటున్నా రు. నాయకులు పల్లె బాటపట్టడంతో గ్రామీణంలో ముందస్తుగానే ఎన్నికల సందడి ఏర్పడింది.
Updated Date - Jul 01 , 2025 | 11:55 PM