ముందే దిగుబడి.. అధిక రాబడి
ABN, Publish Date - Jun 10 , 2025 | 12:37 AM
రైతులకు ఖర్చు తగ్గించి, లాభాల బాటలో నడిపించడానికి కేంద్ర ప్రభుత్వం అధిక సాంద్రత పత్తి సాగు చేయాలని సూచిస్తోంది. అందుకు రైతులను ప్రోత్సహించడానికి ఎకరాకు రూ.5 వేలు సబ్సిడీ ఇస్తోంది.
అధిక సాంద్రత పత్తి సాగుకు కేంద్రం ప్రోత్సాహం
ఎకరాకు రూ.ఐదు వేల సబ్సిడీ
సన్నచిన్నకారు రైతులకే అవకాశం
జిల్లాలో 250 ఎకరాల ఎంపికకు కసరత్తు
రైతులకు ఖర్చు తగ్గించి, లాభాల బాటలో నడిపించడానికి కేంద్ర ప్రభుత్వం అధిక సాంద్రత పత్తి సాగు చేయాలని సూచిస్తోంది. అందుకు రైతులను ప్రోత్సహించడానికి ఎకరాకు రూ.5 వేలు సబ్సిడీ ఇస్తోంది. అధిక సాంద్రత పత్తి సాగుతో ఖర్చు తగ్గడంతో పాటు నెల రోజుల ముందుగానే దిగుబడి ఎక్కువగా వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 20 23-24 నుంచి కేంద్ర ప్రభుత్వం అధిక సాంద్రత పత్తి సాగు పథకాన్ని చేపట్టినా పెద్దగా రైతుల చెంతకు చేరలేదు. ఈ పర్యాయం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అమలుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.
- (ఆంధ్రజ్యోతి-మోత్కూరు)
అధిక సాంద్రత పత్తి సాగుకు సబ్సిడీ పొందడానికి ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులు మాత్రమే అర్హులు. ఒక్కో రైతు ఒక ఎకరం నుంచి ఐదెకరాల వరకు పత్తి వేయవచ్చు. ఎకరాకు రూ.5 వేల చొప్పున సబ్సిడీ లభిస్తోంది. సబ్సిడీ డబ్బు నేరుగా రైతుల ఖాతాలో జమవుతోంది. అధిక సాంద్రత పత్తి సాగుకు ఎర్ర నేలలు అనుకూలం. అయితే రెండేళ్లుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా లో అక్కడక్కడ ఒకరిద్దరు సాగు చేసినా, వారు ఆలస్యంగా సాగు చేయడం, ఆ తర్వాత చేను సంరక్షణ ను పట్టించుకోకపోవడంతో ఆశించిన దిగుబడులు రాక మిగతా రైతులు ఆసక్తిచూపడం లేదని తెలుస్తోంది. సకాలంలో సాగు చేస్తే ప్రభుత్వం అందించే సబ్సిడీ వస్తుందని, అధిక దిగుబడి కూడా వస్తుందని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప ర్యాయం మూడు జిల్లాల్లో సాగుకు వ్యవసాయాధికారులతో పాటు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.
విత్తే విధానం
ఈ సాగులో నిర్దేశించిన విత్తనాన్నే వాడాలి. రాశి కంపెనీ వారి ఆర్‌సీహెచ-929, ఆర్‌సీహెచ-971 (స్విఫ్ట్) అనే హైబ్రీడ్ రకాలు వాడాలని, వరుసకు వరుసకు మధ్య మూడు అడుగులు, మొక్కకు మొ క్కకు మధ్య అర అడుగు దూరం ఉండేలా విత్తనా లు విత్తాలి. ఎకరాకు ఆరు ప్యాకెట్ల విత్తనాలు అవసరమవుతాయి. వరుసల మధ్య మూడు అడుగులు, మొక్కల మధ్య అడుగు దూరం ఉండేలా విత్తాలి. ఎకరాకు 4 నాలుగు ప్యాకెట్ల విత్తనం అవసరమవుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో 2,062 ఎకరాల్లో సాగుకు అవకాశం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధిక సాంద్రత పత్తి సాగుకు పరిమిత సంఖ్యలో కేంద్ర ప్రభుత్వం అవకా శం ఇస్తోంది. కేవలం వానాకాలం సీజనకు మాత్రమే సబ్సిడీని అందిస్తోంది. ఈ క్రమంలో యాదాద్రిభువనగిరి జిల్లాలో సబ్సిడీపై అధిక సాంద్రత పత్తి సాగు చేయడానికి 250 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 1,625, సూర్యాపేట జిల్లాలో 187 ఎకరాల్లో మాత్రమే వేయడానికి అవకాశం ఇచ్చినట్లు సమాచారం. మొత్తం 2,062 ఎకరాల్లో మాత్రమే అధిక సాంద్రత పత్తి సాగుకు అవకాశం కల్పించారు. సన్న, చిన్నకారు రైతులు మాత్రమే ఈ సాగు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఏరువాక శాస్త్రవేత్తలు తెలిపారు.
ఖర్చు తక్కువ... దిగుబడి ఎక్కువ
అధిక సాంద్రత పత్తిసాగును ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారు. దశల వారీ గా పత్తి తీయాల్సిన(ఏరాల్సిన) అవసరం లేకుండా ఒకే సారి తీయడంతోనే పత్తి ఏరివేత పూర్తవుతోంది. దీంతో కూలి డబ్బులు కూడా గణనీయంగా తగ్గుతాయి. దిగుబడి కూడా ఎక్కువగా వస్తోంది. సాధారణ సాగులో ఐదు నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తే అధికసాంద్రత పత్తి సాగులో 10 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఇదిలా ఉండగా పత్తి పంట కాల వ్యవధి ఏడు నెలలు కాగా అధిక సాంద్రత పత్తి సాగు కాల వ్యవధి నెల రోజుల ముందే పూర్తవుతుందని, దీంతో గులాబీ, కాయతొలుచు పురుగు వంటి చీడపీడలు సోకే అవకాశం లేదంటున్నారు. దీంతో అటు పంట నష్టం తగ్గడంతో పాటు ఒకేసారి పంట ఏరివేత ఉంటుండటం రైతులకు కలిసివచ్చే అంశాలను శాస్త్రవేత్తలు తెలిపారు.
ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికే...
యాదాద్రిభువనగిరి జిల్లాలో సబ్సిడీపై అధిక సాంద్రత పత్తి సాగు చేయడానికి 250 ఎకరాలకే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వరుసగా 250 ఎకరాలు పూర్తయ్యే వరకు ఎవరు ముందుగా దరఖాస్తు చేసుకుంటే వారికే అవకాశం ఇస్తాం. ఆసక్తి ఉన్న రైతులు నేరుగా గాని, వాట్సాప్ నంబరుకు గాని దరఖాస్తు, భూమి పాస్ పుస్తకం, ఆధార్, బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీలు పంపి వారి పేరు నమోదు చేసుకోవాలి. ఇతర వివరాలకు 9989623815, 8332970255 నంబర్లలో సంప్రదించవచ్చు.
- డాక్టర్ బీ.అనిల్‌కుమార్, ఏరువాక శాస్త్రవేత్త, భువనగిరి
Updated Date - Jun 10 , 2025 | 12:37 AM