ప్రమాదకరంగా లోలెవల్ కల్వర్టు
ABN, Publish Date - May 05 , 2025 | 11:42 PM
భువనగిరి మండలంలోని అనాజిపురం- రావిపహడ్ గ్రామాల మధ్య ఉన్న లో లెవల్ కల్వర్టు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది.
‘అనాజీపురం- రావిపహడ్’ వంతెనపై దెబ్బతిన్న రక్షణ దిమ్మెలు
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
భువనగిరి రూరల్, మే 5(ఆంధ్రజ్యోతి): భువనగిరి మండలంలోని అనాజిపురం- రావిపహడ్ గ్రామాల మధ్య ఉన్న లో లెవల్ కల్వర్టు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. కల్వర్టుపై ఇరువైపులా ఉన్న రక్షణ దిమ్మెలు ధ్వంసం కాగా కల్వర్టు మధ్యలో కుంగి గుంతలు పడడంతో వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భువనగిరి మండలంలోని అనాజీపురం నుంచి బీబీనగర్ మండలం జంపల్లి గ్రామానికి వెల్లేందుకు దాదాపు 30 సంవత్సరాల క్రితం ఈ కల్వర్టును నిర్మించారు. అయితే వర్షాకాలంలో లోలెవల్ కల్వర్టుపై మూసీ వాగు ఉధృతంగా ప్రవహించడంతో మోకాళ్లలోతు వరద నీరు ప్రవహించడంతో జిల్లా కేంద్రం నుంచి అనాజిపురం మీదుగా ప్రయాణించవల్సిన వాహనాదారులు రెడ్డినాయక్ తండా, పచ్చర్లబోర్డు తండా, జంపల్లి, ముగ్ధుంపల్లి, రావిపహాడ్, మాధారం, సిరివేణికుంట గ్రామాలకు వెళ్లే ప్రజలు సుమారు 20కిలోమీటర్లమేర దూర ప్రయాణంతో రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఈ కల్వర్టుపైనుంచి ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై నుంచి వెళుతున్న క్రమంలో వరద ప్రవాహంలో ఓ వ్యక్తి కొట్టుకుపోయి గల్లంతై మృత్యువాత పడ్డాడు. మరో వ్యక్తి క్షేమంగా బయట పడ్డాడు. జంపల్లి, రెడ్డినాయక్ తండా, రావిపహడ్ తండా, మాధారం గ్రామాలకు చెందిన దాదాపు 100 మంది విద్యార్థులకు పైగా అనాజీపురం జడ్పీ హైస్కూల్‌లో చదువుతున్నారు. మార్గమధ్యలో కల్వర్టు శిథిలావస్థకు చేరడంతో ప్రమాదం ఎప్పుడు సంభవిస్తుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ లోలెవల్ కల్వర్టును ఎత్తు పెంచి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇటీవల జాతీయ ఎస్టీ కమిషన సభ్యులు జాట్రోతు ఉస్సేన నాయక్‌కు గిరిజనులు మొర పెట్టుకున్నారు.
ఎత్తైన కల్వర్టు నిర్మించాలి
ప్రమాదకరంగా ఉన్న లో లెవల్ కల్వర్టును ఎత్తుగా నిర్మించేందుకు ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలి. ఈ కల్వర్టు నుంచి సుమారు 10గిరిజన తండాలకు సంబంధించిన ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నారు. కల్వర్టుకు ఇరువైపులా రక్షణ దిమ్మెలు ధ్వంసం అయ్యాయి. కల్వర్టు కుంగిపోవడంతో ప్రమాదం పొంచి ఉంది. అయితే ఈ విషయమై ఇటీవల జాతీయ ఎస్టీ కమిషన సభ్యులు జాట్రోతు ఉస్సేన నాయక్‌కు వినతి పత్రం ఇచ్చాం. జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించి ఈ కల్వర్టు నిర్మాణానికి అవసరమయ్యే నిధులను మంజూరు చేయాలి.
-దేవసోతు టీకాంరాథోడ్, గిరిజన పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, రెడ్డినాయక్ తండా
ప్రతిపాదనలు పంపించాం
కల్వర్టుపై వంతెన నిర్మాణానికి సుమారు రూ.16కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కాగానే టెండర్లు పిలిచి కల్వర్టు నిర్మాణ పనులను ప్రారంభించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా.
-సుగేందర్ , డీఈ, రోడ్లు, భవనాల శాఖ, భువనగిరి
Updated Date - May 05 , 2025 | 11:42 PM