అమలుకాని హామీలతో కాంగ్రెస్ మోసం
ABN, Publish Date - Jul 15 , 2025 | 12:41 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో అమలుకాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ధ్వజమెత్తారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్‌రావు
చౌటుప్పల్ టౌన్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో అమలుకాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ధ్వజమెత్తారు. సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటనకు వస్తున్న ఆయనకు చౌటుప్పల్ పట్టణం లో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికి, గజమాలతో సన్మానించారు. ఈ సందర్బంగా రామచందర్‌రావు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్క గ్యారెంటీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేకపోయిందన్నారు. విద్యావ్యవస్థను భ్రష్ఠు పట్టించిందన్నారు. 10 ఏళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోగా, 20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో పాటు అస్తవ్యస్తమైన పాలన సాగిస్తోందని మండిపడ్డారు. వికసిత తెలంగాణ కేవలం డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే సాధ్యమవుతుందన్నారు. ఎన్నోఏళ్లుగా కార్యకర్తలు, ప్రజలు ఎదురు చూస్తున్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగుర వేసేందుకు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని ఆయన కోరారు. గ్రామాల్లో స్వచ్ఛమైన పాలనను అందించేందుకు ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలు నిర్వహించాలని అన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ నమ్మకం పోతోందని, ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీని చూస్తున్నారన్నారు. రామచందర్‌రావు సారథ్యంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, కార్యకర్తలు సంకల్పం తీసుకొని సిద్ధాంతం కోసం పనిచేయాలని ఆయన కోరారు. రామచందర్‌రావు నుదుట బీజేపీ పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన తిలకం దిద్ది ఖడ్గాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీ.అశోక్, నాయకులు దోనూరి వీరారెడ్డి, దూడల భిక్షంగౌడ్, రామనగోని శంకర్, ఆర్.దీపిక, కే.గోవర్థన్‌రెడ్డి, పీ.శ్రీధర్‌బాబు, ముత్యాల భూపాల్‌రెడ్డి, కే.అశోక్, శాగ చంద్రశేఖర్‌రెడ్డి, దిండు భాస్కర్, పబ్బు వంశీ, కే.అయిలయ్య, వీ.భానుప్రకాష్, గోశిక నీరజ, గాయత్రి, విజయలక్ష్మి, మాధవి, నాగమణి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 15 , 2025 | 12:41 AM