కరువు నేలపై కరుణ
ABN, Publish Date - Mar 20 , 2025 | 12:51 AM
కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రభుత్వం సాగునీటి కాల్వలతోపాటు మూసీ పరివాహక ప్రాంతాల్లోని కాల్వల పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకుంటామని బడ్జెట్ ప్రసంగంలో వివరించారు.
సాగు, తాగునీటిని అందిస్తామని ప్రభుత్వం ప్రకటన
మూసీ ప్రాజెక్టు కింద కాల్వల పునరుద్ధరణ
సాగునీటి రిజర్వాయర్ల ద్వారా నీటి సరఫరా
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ప్రత్యేక బోర్డు
రాష్ట్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి వెల్లడి
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రభుత్వం సాగునీటి కాల్వలతోపాటు మూసీ పరివాహక ప్రాంతాల్లోని కాల్వల పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకుంటామని బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. ప్రాధాన్యతా క్రమంలో ఏ, బీ కేటగిరీలు విభజించారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును సేద్యంలోకి తీసుకు రావలన్నది ప్రభుత్వ ఉద్దేశమని, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలోని కరువు ప్రభావి త ప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు వీలు గా ఉదయ సముద్రం బ్రాహ్మణవెల్లెంల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారభించామని వివరించారు. ఉదయం సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 6.70 టీఎంసీల నీటిని బ్రాహ్మణవెల్లెంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు లిఫ్ట్ చేస్తామని, ఈ ప్రాజెక్టు ద్వారా 94 గ్రామాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్‌తో బాధపడుతున్న మునుగోడుతోపాటు పలు నియోజకవర్గాల్లోని 107 గ్రామాలకు తాగునీటిని అందిస్తారు.
టీటీడీ తరహాలో బోర్డు
ప్రజల మనోభావాలను గౌరవిస్తూ యాదాద్రిని తిరిగి యాదగిరిగుట్టగా ప్రభుత్వం ప్రకటించింది. యాదగిరిగుట్ట దేవాలయ విమానగోపురానికి మొత్తం 65 కిలోల బంగారంతో తాపడం పనులు పూర్తిచేసి, సంప్రోక్షణ మహోత్సవాన్ని నిర్వహించామన్నారు.టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. అయితే యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించలేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటించింది. ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు చేపడితే ఏన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఊరట లభించనుంది. ప్రభుత్వం ప్రతీ మండలంలో మహిళలతో రైస్ మిల్లులు, మినీ గోదాములు ఏర్పాటు చేయిస్తామని, ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించి మహిళలతో మిల్లింగ్ చేయిస్తామని ప్రకటించింది. స్వయం సహాయక సంఘాల ద్వారా ఎఫ్‌సీసీకి చేరేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. జిల్లాలో ధాన్యం దిగుబడి పెద్దఎత్తున అవుతుంది. ప్రభుత్వ నిర్ణయంతో మహిళలకు, స్వయం సంఘాలకు ప్రయోజనం చేకూరనుంది.
మూసీ సాగునీటి కాల్వల పునరుద్ధరణకు రూ.266.65కోట్లు
మూసీ ప్రాజెక్టు పరిధిలోని బునాదిగాని కాల్వ పునరుద్ధరణ పనులకు రూ.266.65కోట్లు పాలనాపరమైన అనుమతులు ప్రభుత్వం ఇచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టు కింద బునాదిగాని కాల్వతోపాటు పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల పునరుద్ధరణ నిధులు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ శివారు జిల్లాల్లో భారీ వర్షాలు కురియగానే యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ పరవళ్లు తొక్కుతుంది. ఈ వరద నీటిని సాగునీటికోసం వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ కాల్వలను నిర్మించాలని 2003లో అప్పటి ప్రభుత్వం పనులు ప్రారంభించింది. మొట్టమొదటిసారి ధర్మారెడ్డి కాల్వ నిర్మాణానికి రూ.40లక్షలు కేటాయించింది. ఈ నిధులతో రైతుల పొలాలు నష్టపోకుండా గెట్టు ద్వారా చెరువుల్లోకి నీటిని మళ్లించారు. అయితే నీరు అధిక మొత్తంలో రావడంతో కాల్వ పరిధిని పెంచాలని ప్రతిపాదనలు సిద్ధంచేసి, మరో రూ.7లక్షలు మంజూరు చేసింది. అయితే వీటిలో కాల్వల నిర్మాణం వరకు పూర్తిచేశారు. అయితే కాల్వలకు తగినట్టుగా కల్వర్టులు నిర్మించకపోవడంతో నీరు చెరువుల్లోకి కాకుండా కత్వనుంచి నేరుగా వాగుల్లోకి వెళ్తుంది. దీంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ కాల్వలను పునరుద్ధరించి, 60 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 2016లో కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ కాల్వల ద్వారా భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, భువనగిరి, రామన్నపేట, చౌటుప్పల్, చిట్యాల, నకిరేకల్, మండలాలకు సాగునీరు అందుతుంది. 2017లో ఈ మూడు కాల్వల నిర్మాణానికి ప్రభుత్వం రూ.284.85కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఐదు మీటర్లుగా ఉన్న కాల్వను 10మీటర్లుగా వెడల్పు చేయడంతోపాటు కాల్వర్టుల నిర్మాణం, భూసేకరణకు నిధులు కేటాయించింది. పూర్తిస్థాయిలో కల్వర్టులు నిర్మించలేదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కాల్వల పునరుద్ధరణ పనులు సంపూర్ణంగా పూర్తయితే రెండు జిల్లాల్లో 98 కిలోమీటర్ల వరకు 60 వేలకు పైగా ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది.
‘గంధమల’్లకు నిధులు కేటాయించేనా..?
గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధు లు కేటాయించలేదు. సాగునీటి ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రభుత్వం ఏ, బీ కేటగిరీలు విభజిస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించింది. అయితే ఈ రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయనుందా? లేదా? అన్నది స్పష్టం కాలేదు. ఈ రిజర్వాయర్ నిర్మాణంపై 2019 ఫిబ్రవరి లో ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ రిజర్వాయర్ ను మొదటగా 9.8టీఎంసీలుగా నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ మేరకు 232 ఎకరాల అటవీ భూమిని సేకరించింది. నిర్మా ణ పనులు ఓ కంట్రాక్టర్‌కు అప్పగించింది. ప్రధాన కాల్వ, డిస్ర్టిబ్యూటరీలకు 4,162 ఎకరాల భూమి అవసరం కాగా, రిజర్వాయర్ వల్ల 4,027 ఎకరాల భూమితోపాటు 1,568 ఇళ్లు ముంపునకు గురవుతున్నా యి. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో గంధమల్ల, బచ్చలగూడెం, ఇందిరానగర్ గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతుండగా వీరారెడ్డిపల్లిలో దాదాపు 1800 ఎకరాల వరకు భూ ములు కోల్పోయే అవకాశం ఉందని గ్రామస్థులు ఆవేద న వ్యక్తంచేస్తున్నారు. నిర్వాసితుల నిరసన వ్యక్తం చే యడంతో 4.28 టీఎంసీలకు తగ్గించారు. దీంతో వీరారెడ్డిపల్లిని ముంపు నుంచి తప్పించారు. గత ప్రభుత్వంలో చేపట్టిన ప్రతిపాదనల్లో గంధమల్ల ముంపు గ్రామంగానే ఉంది. తాజాగా ప్రభుత్వం 1.5 టీఎంసీల సామర్థ్యానికి తగ్గించడంతో ముంపు గ్రామాలు లేకుండా...భూసేకరణ వేయి ఎకరాలకు పరిమితం చేసింది. రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించడంతో త్వరలోనే పనులు చేపడ్తారని రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
Updated Date - Mar 20 , 2025 | 12:51 AM