‘భూభారతి’ని పకడ్బందీగా అమలు చేయాలి
ABN, Publish Date - May 03 , 2025 | 12:32 AM
భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.
కలెక్టర్ల వీడీయో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి
భువనగిరి (కలెక్టరేట్), మే 2 (ఆంధ్రజ్యోతి): భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. భూభారతి చట్టం అమలు, రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు, సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్, గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ గౌతమ్‌లతో కలిసి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి 20 వరకు జిల్లాకు ఒక మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి నెల చివరి వరకు దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. పైలట్ ప్రాజెక్టు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో జిల్లాకు ఒక మండలాన్ని తీసుకొని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలన్నారు. సదస్సుల్లో ప్రజలనుంచి భూ సమస్యల అన్ని దరఖాస్తులను స్వీకరించి, జూన్ 2వ తేదీలోగా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ భూముల్లో స్థానికంగా ఉన్నవారు, పట్టాలు ఉండి స్థానికంగా లేనివారి దరఖాస్తులను పరిశీలించి భూభారతి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా అర్బన్ పీఎం ఆవాస్ యోజన కింద లక్షా 13 వేలఇళ్లు మంజూరయ్యాయని, నియోజకవర్గ పరిధి పట్టణ ప్రాంతాల్లో కనీసం 500 ఇందిర మ్మ ఇళ్లుమంజూరయ్యేలా చూడాలన్నారు. బేస్‌మెంట్ పూర్తయిన ఇళ్లకు రూ.లక్ష విడుదల చే శామని, నిర్మాణాలప్రగతిపై కలెక్టర్లు, హౌసింగ్ అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ భూభారతి చట్టం అమలు పర్యవేక్షణపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి భూ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైందని, అర్హుల జాబితా ఎంపిక కీలకమన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి పారదర్శకంగా ఎంపిక చేయాలన్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేస్తాం
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భూభారతి చట్టాన్ని అమలు చేస్తామని కలెక్టర్ హనుమంతరావు మంత్రికి వివరించారు. అధికారుల సమన్వయంతో నిర్మాణాల ప్రగతిని పరిశీలిస్తామన్నారు. కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఎం.హనుమంతరావు, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జీ.వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎన్.శోభారాణి, ఆర్డీవో ఎం.కృష్ణారెడ్డి, డీఆర్డీవో టీ.నాగిరెడ్డి, హౌసింగ్ పీడీ ఎల్.విజయ్‌సింగ్, భువనగిరి, ఆలేరు డీఈలు నాగేశ్వరరావు, శ్రీరాములు పాల్గొన్నారు.
Updated Date - May 03 , 2025 | 12:32 AM