ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పత్తి రైతును వెంటాడుతున్న బీజీ-3

ABN, Publish Date - May 27 , 2025 | 12:18 AM

పత్తి రైతులను కల్తీభూతం వెంటాడుతోంది. నకిలీ, నాసిరకం విత్తనాల నిరోధానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అధిక దిగుబడులు, తక్కువ ధర పేరుతో నాసిరకం, కల్తీ విత్తనాలు రైతులను ముంచుతున్నాయి.

అధిక దిగుబడులు, తక్కువ పెట్టుబడి నెపంతో రైతుల మొగ్గు

భూసార క్షీణత, కాలుష్యకారకమవడంతో వీటిపై నిషేధం

బ్లాక్‌మార్కెట్‌లో విత్తనాలు

కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురి డిమాండ్‌

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ) : పత్తి రైతులను కల్తీభూతం వెంటాడుతోంది. నకిలీ, నాసిరకం విత్తనాల నిరోధానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అధిక దిగుబడులు, తక్కువ ధర పేరుతో నాసిరకం, కల్తీ విత్తనాలు రైతులను ముంచుతున్నాయి. వేసవి ఆరంభం నుంచే గ్రామాల్లో మాటువేసిన ఏజెంట్లు తక్కువ ధరకు, అప్పుకింద ఇస్తామని రైతులను మభ్యపెట్టి కల్తీవిత్తనాలు అంటగడుతున్న పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంది. ప్రధానంగా పత్తిని వర్షాధార పంటగా సాగుచేసే రైతులను వీరు లక్ష్యంగా చేస్తున్నారు. ప్రభుత్వం నిషేధించిన బీజీ-3 రకం పత్తి విత్తనాలతో పాటు, లూజ్‌ విత్తనాలను రైతులకు అంటగడుతూ వ్యాపారులు, ఏజెంట్లు దండుకుంటుండగా, ఆ విత్తనాలు సాగుచేసిన రైతులు మాత్రం ఆశించిన దిగుబడులురాక నష్టాల పాలవుతున్నారు.

భూసారం తీవ్రంగా కోల్పోవడంతో పాటు, వాతావరణ కాలుష్యానికి తీవ్రకారకంగా ఉంటుందనే శాస్త్రవేత్తల సూచనల మేరకు దేశంలో పత్తి విత్తనాల్లో బీజీ-3 రకాలను నిషేధించారు. కేవలం బీజీ-1, బీజీ-2 విత్తనాల ను మాత్రమే రైతులు సాగుచేయాలి. అయితే బీజీ-3 విత్తనాలను అక్రమం గా ఉత్పత్తి చేస్తున్న కొన్ని సంస్థలు, వాటిని నేరుగా రైతులకు సరఫరాచేస్తున్నాయి. బీజీ-2 సాగుచేస్తే విత్తనం నాటిన 60 రోజుల తర్వాత దోమ పోటు ఉంటుందని, అదే బీజీ-3 సాగుచేస్తే పంట దిగుబడి పూర్తయ్యేంతవరకు దోమపోటుతో పాటు, పురుగుల బెడద, తెగుళ్ల తాకిడి ఉండదనే ప్రచారంతో ఈ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. దిగుబడి సైతం బీజీ-2 కంటే 30శాతం మేర ఎక్కువగా వస్తుందని చెబుతున్నారు. పెట్టుబడిసైతం తగ్గుతుందని, పురుగుమందులు, దోమమందులు, తెగుళ్ల మం దులు వినియోగించే అవసరం ఉండకపోవడంతో పెట్టుబడి సైతం 50 శా తం మేర తగ్గుతుందనే ప్రచారం బలంగా ఉండడంతో రైతులు సైతం బీజీ-3 విత్తనాల సాగుకు మొగ్గుచూపుతున్నారు. రైతులు బీజీ-2తో కలిపి బీజీ-3ని సాగుచేస్తున్న పరిస్థితి పలు ప్రాంతాల్లో కనిపిస్తోంది. నాలుగెకరా లు సాగుచేసే రైతులు మూడెకరాల్లో బీజీ-2 సాగు చేస్తే మరో ఎకరంలో బీజీ-3 సాగుచేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దేవరకొండ, మిర్యాలగూడ, మునుగోడు, నల్లగొండ, మోత్కూరు తదితర ప్రాంతాల్లో బీజీ-3 సా గు గణనీయంగా ఉంటుందని, దీన్ని అధికారులు గుర్తించి నియంత్రించలేకపోతున్నార ని, గడచిన నాలుగైదేళ్లుగా ఈ పరిస్థితి కొనసాగుతోందని, అందువల్లే పత్తిసాగు చేసే భూముల సారం తగ్గి, క్రమంగా దిగుబడులు తగ్గిపోతున్నాయ ని అవగాహన కలిగిన రైతులు, శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. బీజీ-3 సా గును విత్తన దశలోనే అరికట్టాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవ డం లేదనే విమర్శలు ఉన్నాయి.ప్రధానంగా గుజరాత్‌, మహారాష్ట్రలోని విత్త న కంపెనీలు వాటి ఆర్‌అండ్‌డీ విభాగాల ద్వారా ఉత్పత్తిచేసి ఏపీలోని గుంటూరు,సత్తెనపల్లి, మాచర,్లకర్నూల్‌కు చెందిన వ్యాపారుల ద్వారా, మరోవైపున తెలంగాణలోని గద్వాల, భూత్పూర్‌ ప్రాంతాలకు చెందిన డీలర్ల ద్వారా, అక్కడి నుంచి ఏజెంట్లకు ఈ విత్తనాలను పకడ్బందీ గా సరఫరాచేస్తున్నారు. ఇటీవల ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఈ విత్తనాలు భారీగా పట్టుబడుతుండడమే దీనికి నిదర్శనం.

నకిలీల మూలాలను కట్టడిచేస్తేనే

బీజీ-3, ఫెయిల్‌ విత్తనాలను మార్కెట్లోకి రాకముందే తయారీ సందర్భంలోనే కట్టడి చేయడమే వీటి నియంత్రణకు ఏకైక పరిష్కారమనే అభిప్రాయాలు వెల్లడవుతున్నా యి. ప్రధానంగా బీజీ-3 విత్తనాలను తీసుకువస్తున్న ముఠాలను గుర్తించి వారిపై పీడీయాక్ట్‌ ప్రయోగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. విత్తనాల తయారీ కంపెనీలపై కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని, బీజీ-3, లూజ్‌ విత్తనాలను బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని రైతులు సూచిస్తున్నారు. జర్మినేషన్‌ పరీక్షల తర్వాత ఫెయిల్‌ విత్తనాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారమని రైతుసంఘాల నాయకులు సూచిస్తున్నారు.

వర్షాధారంగా సాగు చేసే రైతులే లక్ష్యం...

మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా పత్తిని సాగుచేసే రైతులకు లూజ్‌ విత్తనాలు అంటగడుతున్నారు. మార్కెట్లో ధర కంటే తక్కువకు వీటిని విక్రయిస్తుండటంతో వర్షాధారంగా పత్తి సాగుచేసే రైతులు వీటిని అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ఆథరైజ్డ్‌ విత్తనాలు 450 గ్రాముల ప్యాకెట్‌ ధర రూ.901 ఉంటే, ఈ లూజ్‌ విత్తనాలు రూ.500, రూ.600కే లభిస్తున్నాయి. విత్తనాల కంపెనీల ఆధ్వర్యంలో పండించే సీడ్‌ పత్తిని ప్రాసెసింగ్‌ చేసిన తర్వాత వచ్చిన విత్తనాలను జర్మినేషన్‌ టెస్ట్‌ చేసి ఆతర్వాత ఆ టెస్ట్‌లో ఫెయిల్‌ అయిన విత్తనాలనే లూజ్‌గా బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. జర్మినేషన్‌ టెస్ట్‌లో 80శాతం మొలకశాతం రావాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ వచ్చిన విత్తనాలను ఫెయిల్‌ విత్తనాలుగా ప్రకటించి పక్కనపెడతారు. వాస్తవంగా ఆయా కంపెనీలు సంబంధిత సీడ్‌ను పత్తి రైతులకు అప్పగిస్తే, వారు వాటిని పశువుల దాణాకు లేదా, వ్యవసాయాధికారుల సమక్షంలో కాల్చిబూడిద చేయాలి. అయితే విత్తన కంపెనీలు రైతులకు ఎంతోకొంత ముట్టజెప్పి, ఆ విత్తనాలను తక్కువ ధర పేరుతో బ్లాక్‌లో లూజ్‌ విత్తనాల పేరుతో విక్రయిస్తున్నాయి. ఈ విత్తనాలతో సాగయ్యే పత్తి మొక్కలకు ఎదుగుదల తక్కువగా ఉండడంతో పాటు, దిగుబడి సైతం నాణ్యమైన విత్తనాల కంటే తక్కువగా ఉంటుంది. అయితే రైతులు వర్షాధారంగా, మెట్ట ప్రాంతాల్లో వీటిని సాగుచేస్తుండడంతో ఒక్కో పాదులో నాలుగైదు విత్తనాలను నాటడంతో పాటు, పంట దిగుబడి తక్కువ వచ్చినా వర్షాలు లేకపోవడం, వాతావరణ ప్రతికూలతలు, లేక దోమపోటు, తెగుళ్ల బెడదవల్లనో దిగుబడి తగ్గిందని వ్యవసాయాధికారులు, రైతులు సర్దిచెప్పుకుంటున్న పరిస్థితి ఉండటంతో ఈ విత్తనాలను అరికట్టలేని దుస్థితి నెలకొంది.

నకిలీలు, నాసిరకం విక్రయిస్తే కఠిన చర్యలు : పి.శ్రవణ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి, నల్లగొండ

బీజీ-3 విత్తనాలు రైతులు సాగుచేయకూడదు. ఇవి విషపూరితమే కాకుండా భూసారాన్ని క్షీ ణింపజేస్తాయి. ఈ విత్తనాలకు అనుమతిలేదు. అదేవిధంగా లూజ్‌ విత్తనాలను సైతం రైతు లు కొనుగోలుచేయవద్దు. ప్రభుత్వం ధ్రువీకరించిన కంపెనీలకు చెందిన విత్తనాలనే రైతులు కొనుగోలు చేయాలి. డీలర్ల వద్ద బ్యాచ్‌ నెంబర్లు, కంపెనీ వివరాలు, తయారీ తేదీ వివరాలను నమోదు చేసిన బిల్లులు తప్పకుండా పొందాలి. బీజీ-3 పేరుతోగానీ, లూజ్‌ విత్తనాల పేరుతో గానీ ఎవరైనా డీలర్లు లేదా ఇతరులు విత్తనాలు విక్రయిస్తే వారిపై కఠినచర్యలు తీసుకుంటాం. ఇలాంటి విక్రయాలు జరిగితే మా దృష్టికిగానీ, మండల వ్యవసాయాధికారులు, ఏఈవోల దృష్టిగానీ తీసుకురావాలి. జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాలపై టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశాం.

Updated Date - May 27 , 2025 | 12:18 AM