ఇక ఆత్మ కమిటీలు
ABN, Publish Date - May 29 , 2025 | 11:44 PM
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో వారం పదిరోజుల్లో ఆత్మ (వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ) కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఈ కమిటీలు ఏర్పాటు కానున్నాయి.
రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రణాళికలు
ఒక్కొ నియోజకవర్గ కమిటీలో 30మందికి చోటు
జిల్లా స్థాయి కమిటీలో 40మంది నామినేట్
కమిటీలో రైతులతో పాటు అధికారులు
వారం పది రోజుల్లో కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు
(ఆంధ్రజ్యోతి,నల్లగొండ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో వారం పదిరోజుల్లో ఆత్మ (వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ) కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఈ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రైతులకు చేరవేయడంలో ఈ కమిటీలు కీలక భూమిక పోషిస్తాయి. ఈ కమిటీల ఏర్పాట్లుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
ఆత్మ కమిటీలో మొత్తం 30 మంది సభ్యులు ఉం టారు. 25మంది రైతులకు, మరో ఐదుగురు అధికారులకు ఇందులో చోటు కల్పిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రైతులకు ఈ కమిటీల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. ఆత్మ కమిటీల్లో వ్యవసాయ అధికారులతో పాటు పశుసంవర్ధక, ఉద్యాన, హార్టికల్చర్, సెరీకల్చర్, శాస్త్రవేత్తలకు చోటుకల్పిస్తారు. స్థిరమైన వ్యవసాయ అభివృద్ధి కోసం కొన్నేళ్ల క్రిత మే అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ఆత్మ)ను ఏర్పాటు చేశారు. అయితే గత ప్రభుత్వ హయం నుంచి ఆత్మకు నిధులు కేటాయించకపోవడంతో అది అచేతన స్థితిలో పడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆత్మను బలోపేతం చేసేందుకు నిర్ణయించింది. వ్యవసాయశాఖతో పాటు అనుబంధశాఖలతో ఈ కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయిలో ఆత్మ కార్యాలయం ద్వారా వ్యవసాయ సంబంధిత సాంకేతిక కార్యకలాపాలు నిర్వహించనున్నారు. వ్యవసాయ అభివృద్ధికి సంబంధించి విభాగాలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలతో అనుబంధాన్ని ఉంచి వ్యవసాయరంగా న్ని బలోపేతం చేయనున్నారు. ప్రధానంగా వ్యవసాయశా ఖ కీలక భూమిక పోషిస్తూ పశుసంవర్ధకం, ఉద్యాన, మత్స్య పరిశ్రమ వంటి కీలక శాఖల నుంచి ఆత్మలో సభ్యులుగా చేర్చనున్నారు.
రోజువారీ కార్యకలాపాల పరిశీలన
ఆత్మ కమిటీలు వ్యవసాయరంగానికి సంబంధించిన కార్యకలాపాలను రోజువారీగా పరిశీలించడంతో పాటు ప్రణాళికలను అమలు చేస్తుంది. బ్లాక్, జిల్లా స్థాయిలో రైతు సలహా కమిటీలు అంటే ఆత్మ కమిటీలు ఏర్పడుతాయి. బ్లాక్ ఫార్మర్స్ సలహా కమిటీలు ఏర్పాటు చేసిన తరువాత రైతులకు ఈ కమిటీలు ఉపయోగపడుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కమిటీల్లో ఆదర్శ రైతులతో పాటు అవార్డు గ్రహీతలైన రైతులు, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో శిక్షణ పొందిన రైతులను ఈ కమిటీల్లో నామినేట్ చేస్తారు. ఈ కమిటీల్లో మూడింట ఒకరు మహిళ రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యం కల్పిస్తారు. ఈ కమిటీలు రెండు సంవత్సరాల పాటు పనిచేస్తాయి. ప్రతీ మూడు నెలలకొకసారి కమిటీలు వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించడంతో పాటు రైతులతో సమావేశాలు నిర్వహిస్తాయి. జిల్లా స్థాయిలో ఏర్పడే కమిటీలో 40మంది సభ్యులను నియమిస్తారు. వ్యవసాయ, అనుబంధరంగాల నుంచి సంబంఽధిత విభాగాల్లో అనుభవజ్ఞులైన వారిని జిల్లా కమిటీతో పాటు రాష్ట్ర కమిటీకి నామినేట్ చేస్తారు.
రైతుల సంక్షేమం కోసం
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమం కోసం ఆత్మ కమిటీలు ఏర్పాటుచేయనుంది. వ్యవసాయరంగ అభివృద్ధితోపాటు రైతుల ఆర్థికాభివృద్ధి చెందేందుకు ఈ కమిటీ ప్రణాళికలు రూపొందిస్తుంది. మార్కెటింగ్, సాంకేతికాభివృద్ధి, ఉత్పత్తులను పెంచడం, వ్యవసాయ ఉత్పత్తులకు మరింత ఊతమిచ్చేలా ఈ కమిటీలు విధివిధానాల్లో పాల్గొంటాయి. వీటి ద్వారా రైతులను బలోపేతం చేస్తూ వారికి అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతాయి. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన తరువాత రైతులకు సహాయ సహకరంగా ఉంటూ వారి ఇబ్బందులను, సమస్యలను పరిష్కరిస్తూ ఈ కమిటీ లు ముందుకు సాగుతాయి. సీజన్ ప్రారంభం నాటి నుంచి వ్యవసాయ దిగుబడుల వచ్చి మార్కెటింగ్ అయ్యే వరకు ఈ కమిటీలు పనిచేస్తాయి. ఆత్మ అనే సంస్థ ఇతర విభాగాల సహకారంతో కమిటీలను బలోపేతం చేసి ఆ కమిటీలకు కీలక బాధ్యతలను అప్పగిస్తారు. ప్రతి కమిటీలో 30మంది సభ్యులు ఉండగా అందు లో 25మంది రైతులే ఉంటుండటంతో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పరిష్కరించుకునేందుకు రైతులకువీలుంటుందనేది ప్రభుత్వ 12 నియోజకవర్గాల్లో కమిటీల ఏర్పాటుకు కసరత్తులు జరుగుతున్నాయి. నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో వచ్చే వారం పది రోజుల్లోపు ఈ కమిటీలు ఏర్పడనున్నాయి. వ్యవసాయరంగంలో ఉత్సాహవంతులైన రైతులకు, అనుభవజ్ఞులకు చోటు కల్పించి రైతులకు అండగా ఉండేలా కమిటీలు ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో వీటికి ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం బీఎ్‌ఫఏసీ (బ్లాక్ రైతుల సలహా కమిటీ)గా నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేస్తుండగా, జిల్లా స్థాయిలో డీఎ్‌ఫఏసీ (జిల్లా రైతుల సలహా కమిటీ)గా ఏర్పాటు కానున్నాయి. రైతులు, అధికారుల భాగస్వామ్యంతో ఏర్పాటు అవుతున్న ఈ కమిటీలు కీలక భూమిక పోషించనున్నాయి. గతంలో వ్యవసాయరంగంలో రాణించిన వారితోపాటు ప్రస్తుతం వ్యవసాయంపై మక్కువతో పనిచేస్తున్న వారికి చోటు కల్పించే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
రైతుల సంక్షేమం కోసం ఆత్మ కమిటీలు: పి.శ్రవణ్‌కుమార్, నల్లగొండ జేడీఏ
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆత్మ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. బ్లాక్ (నియోజకవర్గం), జిల్లా స్థాయిలో ఏర్పడే కమిటీలతో రైతులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. చిన్న, సన్నకారు రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ, మహిళ రైతులకు, వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన అధికారులకు ఈ కమిటీల్లో చోటు ఉంటుంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీలను ఏర్పాటు చేయడంతో, రైతులకు ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు సులభంగా అందనున్నాయి. అదేవిధంగా రైతులు పండించే ఉత్పత్తులకు, ఇతర సమస్యల పరిష్కారానికి కమిటీలు పనిచేస్తాయి.
Updated Date - May 29 , 2025 | 11:44 PM