ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎయిమ్సే.. ఏమి లాభం

ABN, Publish Date - Jul 21 , 2025 | 12:38 AM

కళ్లు చెదిరే భవనాలు.. అత్యాధునిక వైద్య పరికరాలు. ఆధునిక వసతి సౌకర్యాలు.. అనుభవం, నైపుణ్యం గల వైద్య నిపుణులు. మొత్తానికి ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు కలిగి, దేశంలోనే అత్యుత్తమ వైద్యసంస్థగా చెప్పుకుంటున్న అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) ప్రజల ప్రాణాలకు భరోసా ఇవ్వడంలేదు.

పేరుకే పెద్దాస్పత్రి.. గాల్లో కలుస్తున్న ప్రాణాలు

అందుబాటులో లేని అత్యవసర సేవలు

ఐదేళ్లుగా ఓపీ సేవలకే పరిమితం.. ఐపీ సేవలకు ఇంకెన్నాళ్లో?

(ఆంధ్రజ్యోతి-బీబీనగర్‌): కళ్లు చెదిరే భవనాలు.. అత్యాధునిక వైద్య పరికరాలు. ఆధునిక వసతి సౌకర్యాలు.. అనుభవం, నైపుణ్యం గల వైద్య నిపుణులు. మొత్తానికి ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు కలిగి, దేశంలోనే అత్యుత్తమ వైద్యసంస్థగా చెప్పుకుంటున్న అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) ప్రజల ప్రాణాలకు భరోసా ఇవ్వడంలేదు. అత్యవసర సమయంలో ఆస్పత్రికి వెళితే.. హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. దీంతో అక్కడికి వెళ్లేలోగా ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.

ఎయిమ్స్‌లాంటి ప్రతిష్టాత్మక సంస్థ రాకతో తమ ప్రాణాలకు డోకా లేదని జిల్లా ప్రజలు భావించారు. గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు ఇతరత్ర అత్యవసర సమయాల్లో ప్రాణాలు నిలిపేందుకు కళ్లెదుటే ఎయి మ్స్‌ ఉందన్న దీమాతోపాటు ధైౖర్యాన్ని పెంచింది. అయితే ఐదేళ్లుగా ఓపీ సేవలు తప్ప ఐపీ సేవలకు నోచడంలేదు. కనీసం అత్యవసర సేవల వి భాగం కూడా అందుబాటులో లేకపోవడంతో అనేక ప్రాణా లు గాల్లో కలుస్తున్నాయి. ఎయిమ్స్‌లో రోడ్డు ప్రమాదా లు, గుండెపోట్లు సంభవించినప్పుడు బాధితులను, క్షతగాత్రులను హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించాల్సి వస్తుంది. దీంతో వైద్యం ఆలస్యమై విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. గడిచిన ఆరు నెలల్లో 28మంది ప్రాణాలు పోగొట్టుకోగా ఒక్క బీబీనగర్‌ పట్టణానికి చెందిన వారే 17మంది ఉండడం గమనార్హం. కళ్లెదుటే ఎయిమ్స్‌ ఉండి కూడా ప్రాణాలకు భరోసా ఇవ్వకపోగా ఊపిరి తీస్తుందనే విమర్శలు స్థానిక ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రానికే తలమానికంగా చెప్పుకునే..

రాష్ర్టానికే తలమానికంగా చెప్పుకుంటున్న అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) ఓపీ సేవలకే పరిమితమైంది. ఐదేళ్లు గడుస్తున్నా ఐపీ సేవలకు నోచడంలేదు. ప్రాణాపాయ పరిస్థితుల్లో రోగులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించే అత్యవసర ఇన్‌పేషెంట్‌ విభాగం ఎయిమ్స్‌లో లేదు. దీనికారణంగా హైదరాబాద్‌లాంచి మహానగరంలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించాల్సి వస్తుంది. ట్రాఫిక్‌, ఇతరత్ర సమస్యలను అధిగమించి ఏదోలా ఆస్పత్రులకు చేరుకున్నప్పటికీ వైద్యం చాలా ఆలస్యమై విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. గడిచిన ఆరు నెలల్లో 28మంది గుండెపోటు, రోడ్డు ప్రమాదాలకు గురై సరైన సమయానికి వైద్యం అందక ప్రాణాలు పోగొట్టుకోగా వీరిలో బీబీనగర్‌ పట్టనానికి చెందిన వారే 17మంది ఉండడం గమనార్హం. వీరంతా గంట గంటన్నర వ్యవధిలోపే హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు తరలించే లోపే ప్రాణాలు వదిలారు. అదే ఎయిమ్స్‌లోనే అత్యవసర సేవల విభాగం అందుబాటులో ఉండి ఉంటే ప్రాణాలు నిలిచేవని మృతుల కుటుంబా లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎయిమ్స్‌ ఆసుపత్రి చెప్పుకోవడానికి పెద్దదే అయినప్పటికీ ప్రజల ప్రాణా లు కాపాడలేనప్పుడు, ఉన్నా లేకున్నా ఒక్కటేననే భావన ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతోంది. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా? అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ఎయిమ్స్‌లో ఇన్‌పేషెంట్‌ విభాగాలను ప్రారంభించి 24 గంటలపాటు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

ఐదేళ్లుగా ఓపీ సేవలకే పరిమితం

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మంజూరు చేసిన ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్‌ ఏర్పాటుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం బీబీనగర్‌ మండలం రంగాపురంలో అప్పటి నిమ్స్‌ భవనాలతోపాటు 201 ఎకరాల స్థలాన్ని సేకరించి 2018లో కేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం 2020లో జూన్‌2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆరు విభాగాల ఓపీ సేవలను తొలుత ప్రారంభించింది. ఎయిమ్స్‌ వైద్యంపై ప్రజలకు ఆసక్తి పెరగడంతో జిల్లాకే పరిమితమైన రోగులు తెలంగాణలోని సుమారు 10 జిల్లాలనుంచి రావడం మొదలుపెట్టారు. రోగుల డిమాండ్‌ దృష్ట్యా ఆరు విభాగాల నుంచి 32 విభాగాలకు ఓపీ సేవలను విస్తరించారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీని పరిమితం చేశారు. గడిచిన ఐదేళ్లుగా ఓపీ వైద్యం కోసం రోజు 1200 నుంచి 1500 వరకు రోగులు ఎయిమ్స్‌కు వస్తున్నారు. రోగుల తాకిడి వారి అవసరాల దృష్ట్యా సేవలను విస్తరించారు. ఈఎన్‌టీ, ఆర్థోఫెడిక్‌, పీడీయాట్రిక్‌, గైనకాలజీ, మరికొన్ని విభాగాలకు సంబంధించి మాత్రమే ఐపీ సేవలతోపాటు మైనర్‌ సర్జరీలు నిర్వహిస్తున్నారు. అన్ని విభాగాలకు సంబంధించి 24గంటలపాటు అత్యవసర సేవలు అందించే విధంగా ఎయిమ్స్‌ను త్వరగా అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రాణాలకు భరోసా ఏదీ? : మంగ అశోక్‌, బీబీనగర్‌

అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది స్థానిక ప్రజల పరిస్థితి. కళ్ల ముందే ఇంత పెద్ద ఆస్పత్రి ఉన్న ప్రాణాలకు మాత్రం భరోసా లేదు. పట్టణానికి చెందిన ఎంతో మంది గుండెపోటుకు గురై ఎయిమ్స్‌కు తరలిస్తే అత్యవసర సేవలు లేవని హైదరాబాద్‌కు వెళ్లాలని చెబుతున్నారు. అక్కడినుంచి హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు వెళ్లేలోగా సమయానికి వైద్యం అందక ప్రాణాలు పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంత మాత్రం జాప్యం చేయకుండా వెంటనే అత్యవసర సేవల విభాగం అందుబాటులోకి తీసుకురావాలి.

ఐపీ సేవలను వెంటనే ప్రారంభించాలి : గడ్డం బాలకృష్ణగౌడ్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌, బీబీనగర్‌

దేశంలోనే పెద్ద ఆసుపత్రిగా చెప్పుకుంటున్న ఎయిమ్స్‌ను ఓపీ సేవలకు పరిమితం చేయడం సబబు కాదు. ప్రమాదాలు జరిగినప్పుడు, ఇంకేదైన ఆరోగ్య సమస్యలు సంభవించినప్పుడు అత్యవసర సేవలు అందించే విభాగం ఎయిమ్స్‌లో లేకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రజల ప్రాణాలపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఐపీ సేవలు ప్రారంభించాలి.

Updated Date - Jul 21 , 2025 | 12:38 AM