వ్యవసాయ యూనివర్సిటీ భూసేకరణ ఉద్రిక్తం
ABN, Publish Date - May 06 , 2025 | 11:57 PM
వ్యవసాయ యూనివర్సిటీ నిర్మాణానికి 100 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించేందుకు అధికారులు యత్నించడం, స్థానికులు భూ సర్వేను అడ్డుకొని ఆందోళనలు, నిరసనలు నిర్వహించడంతో హుజూర్‌నగర్ పట్టణం మంగళవారం అట్టుడికింది.
హుజూర్‌నగర్ , మే 6 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ యూనివర్సిటీ నిర్మాణానికి 100 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించేందుకు అధికారులు యత్నించడం, స్థానికులు భూ సర్వేను అడ్డుకొని ఆందోళనలు, నిరసనలు నిర్వహించడంతో హుజూర్‌నగర్ పట్టణం మంగళవారం అట్టుడికింది. ఉగాది సందర్భంగా సన్నబియ్యం పంపిణీకి సీఎం రేవంత్‌రెడ్డి హుజూర్‌నగర్ పర్యటనకు రాగా, పట్టణానికి వ్యవసాయ యూనివర్సిటీని మంజూరు చేశారు. దీంతో యూనివర్సిటీ నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేస్తున్న నేపథ్యంలో కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతల సూచనల మేరకు ప్రభుత్వ భూసేకరణ వివాదాలకు కేంద్రంగా మారింది.
హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలోని 604సర్వే నెంబర్‌లో ప్రభుత్వ భూ సేకరణ ఉద్రిక్తంగా మారింది. మూడు రోజులుగా భూసేకరణకు అధికారులు యత్నిస్తుండగా, సర్వేయర్లను రైతులు మంగళవారం మూడోసారి అడ్డుకొని నిరసన తెలిపారు. రెవెన్యూ అధికారులు పెద్దసంఖ్యలో భూసేకరణకు రాగా,స్థానికుల అడ్డగింతతో ఒక్క అడుగు ముం దుకు కదలలేదు. అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో 10మంది పోలీస్‌సిబ్బంది, 10మంది రెవెన్యూ సిబ్బంది రాగా, బాధిత రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూమిని గుంజుకుంటే సహించేది లేదని బాధిత కుటుంబాలు హెచ్చరించాయి.
తహసీల్దార్, పోలీసులు నచ్చజెప్పినా..
సర్వేను రైతులు అడ్డుకుంటున్నారని రెవెన్యూ అధికారులు సమాచారం ఇవ్వడంతో ఉదయం 11 గంటల సమయంలో తహసీల్దార్ నాగార్జునరెడ్డి అక్కడికి చేరుకొని బాధిత రైతులను ఒప్పించేందుకు ప్రయత్నించారు. రైతులు ససేమిరా అనడంతో పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్‌ఐ ముత్తయ్య, పోలీసు సిబ్బందితో తరలివచ్చి రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికే రెండుసార్లు సర్వేచేసేందుకు అధికారులు ప్రయత్నించగా, తహసీల్దార్, ఎస్‌ఐ వచ్చాక మూడోసారి భూముల హద్దులు నిర్ణయించేందుకు సర్వేయర్ల బృందం యత్నించింది. దీంతో 1 గంట ప్రాంతంలో రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సర్వే చేస్తున్న అధికారులను అడ్డుకునేందుకు రైతులు యత్నించగా పోలీసులు ప్రతిఘటించారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. కొంతమంది పోలీసులు రైతులను బలవంతంగా నెట్టివేయడంతో వారు కిందపడ్డారు. ఈ ఘటనతో మనోవేదనకు గురైన బూరుగడ్డకు చెందిన రైతు గువ్వల గురవయ్య ఆత్మహత్యకు యత్నించాడు. ఘటనా ప్రాంతంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ తీగలను పట్టుకుని లాగాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గురవయ్యను పక్కకు నెట్టివేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో మహిళా రైతులు, పోలీసుల మధ్య పెనుగులాట జరిగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో సర్వేను వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు తహసీల్దార్ నాగార్జునరెడ్డి ప్రకటించారు. తిరిగి వచ్చే సోమవారం సర్వే చేస్తామని, అప్పటి వరకు రైతుల వద్ద ఉన్న డిజిటల్ పాస్ పుస్తకాల జిరాక్స్‌లు, ఇతర ఆధారాలు ఉంటే తీసుకురావాలని, సర్వేకు సహకరించాలని తహసీల్దార్ కోరారు. దీంతో బాధిత రైతులు శాంతించి ఆందోళన విరమించారు.
మొత్తం 164 ఎకరాల భూమి
బూరుగడ్డ గ్రామంలో 604 సర్వే నెంబర్‌లో ప్రభుత్వ భూమి 164.10 ఎకరాల వరకు ఉంది. ఈ భూమిలో ప్రభుత్వం రెండు విడతల్లో సుమారు 60 ఎకరాలకు సంబంధించి పేదలకు పట్టాలు పంపిణీచేసింది. ఇది పోగా, మరో 104 ఎకరాల మిగులు భూమి ఉంది. అక్కడ పట్టాలు పొందిన రైతులే మిగులు భూములను కూడా ఒక్కొక్కరు 10 గుంటల నుంచి నాలుగైదు ఎకరాల వరకు ఆక్రమించుకుని సాగుచేస్తున్నారు. తరాలుగా ఈ భూములను సాగుచేసుకుంటున్న రైతులు భూసేకరణను అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం ఇటీవల మంజూరుచేసిన వ్యవసాయ యూనివర్సిటీని ఇక్కడ నిర్మించాలని బూరుగడ్డకు చెందిన అధికార పార్టీ నాయకులు ముగ్గురు ప్రభుత్వ ఉన్నతాధికారులను కోరడంతో, ఆ దిశగా అధికారులు సర్వే చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రం కావడంతో 100 ఎకరాల భూమి అనువైనదిగా అధికారులు గుర్తించారు. అయితే సర్వే ప్రారంభ దశలోనే భూ ఆక్రమణలో ఉన్న రైతులు తిరుగుబాటు చేశారు.
చావనైనా చస్తాం
దశాబ్దాలుగా ప్రభుత్వభూములను సాగుచేసుకుంటూ కుటుంబాలు వెళ్లదీసుకుంటున్నామని బాధిత రైతులు యరగాని నాగమణి, యరగాని కాశయ్య, సతీష్, ఆకుల గురవయ్య, పాశం రమేష్, యరగాని నర్సమ్మ, తాళ్ల గురవయ్య, వెంకటేష్, యరగాని వెంకటమ్మ, కీర్తి సైదులు, కాసాని గురవయ్య ఉప్పతల పిచ్చయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లలకు ఆ భూములనే కట్నంగా ఇచ్చారని, వాటిని సాగుచేసి జీవనం వెళ్లదీస్తున్నామన్నారు. ప్రభుత్వం 70ఎకరాలకు పైగా రెండువిడతల్లో అసైన్డ్ పట్టాలు ఇచ్చిందని, భర్తలు మద్యానికి బానిసలై కుటుంబాలను పట్టించుకోకపోవడంతో పొలంలో వచ్చిన నాలుగు గింజలతో జీవితాలను వెళ్లదీసుకుంటున్నామని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
Updated Date - May 06 , 2025 | 11:57 PM