చేనేతరంగానికి రూ.290 కోట్లు
ABN, Publish Date - May 03 , 2025 | 12:31 AM
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ.290కోట్ల నిధులు పొదుపు పథకానికి విడుదల చేసిందని, చేనేత కార్మికులను ఆదుకునేందుకు రూ.75వేల నుంచి రూ.1.50లక్షల వరకు రుణాలు పొందే అవకాశం కల్పిస్తుందని చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు.
పోచంపల్లిలోని ‘చేనేత సదస్సు’లో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
త్రిఫ్ట్ పథకం కింద నిధులు విడుదల
చేనేత కార్మికులకు రూ.75 వేల నుంచి రూ.1.50 లక్ష వరకు రుణాలు
చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు రుణమాఫీ
భూదాన్‌పోచంపల్లి, మే 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ.290కోట్ల నిధులు పొదుపు పథకానికి విడుదల చేసిందని, చేనేత కార్మికులను ఆదుకునేందుకు రూ.75వేల నుంచి రూ.1.50లక్షల వరకు రుణాలు పొందే అవకాశం కల్పిస్తుందని చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. శుక్రవారం భూదాన్‌పోచంపల్లి పట్టణంలో పోచంపల్లి ఇక్కత్ పరిశ్రమపై ‘చేనేత సదస్సు’ స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. పట్టణంలోని అన్ని చేనేత సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన చేనేత సదస్సుకు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో చేనేత రంగం పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని పరిరక్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామని, వాటిని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోచంపల్లి చేనేత టైఅండ్‌డై ఇక్కత్ వస్త్రాలు డూప్లికేట్ కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమశాఖల ద్వారా యూనిఫామ్ మెటీరియల్‌ను కొనుగోలు చేయిస్తామన్నారు. భూదానోద్యమం ద్వారా చారిత్రక ఉత్తమ పర్యాటక గ్రామంగా యునెస్కో గుర్తింపు పొందిన పోచంపల్లి నేడు ఇక్కత్ పరిశ్రమ ద్వారా ఖండాంతర ఖ్యాతిగాంచిందన్నారు. ఈ నెల 15న ప్రపంచ సుందరీమణులు పోచంపల్లిలో సందడి చేయనున్నారన్నారు. చేనేత రంగంలోని ప్రధాన సమస్యల సత్వర పరిష్కారానికి సీఎం రేవంత్‌రెడ్డితో చర్చిస్తామన్నారు.
భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ చేనేత సంఘాలన్నీ కలిసి ఐక్యతతో నిలబడడం అభివృద్ధికి చిహ్నంగా నిలుస్తుందన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట నెలకొల్పిన అవార్డులు కొనసాగిస్తామన్నారు. ఈ ప్రాం తాన్ని పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి పరుస్తామన్నారు. రైతులకు రుణాలు అందించేటప్పుడు బంధువులుగా చూస్తూ సొంత సంస్థగా నడిపించినప్పుడే సహకార సంఘాలు బలపడతాయన్నారు. చేనేత సమస్యల సత్వర పరిష్కారంకోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ పొదుపు పథకాలన్నీ అమల్లోకి తెస్తామన్నారు. ప్రతీ చేనేత కార్మికుడికి రూ.18 వేలు, అనుబంధ కార్మికుడికి రూ.6వేలు జమ చేసే పద్ధతి వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తుందన్నారు. చేనేత వస్త్రాలు బెడ్‌షీట్లు, టవల్స్, లుంగీలు మార్కెటింగ్ చేసేందుకు ప్రోత్సాహకరంగా షోరూమ్‌లు ఏర్పాటు చేసి విక్రయానికి చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా టెక్స్‌టైల్స్ డిప్లొమా కోర్సులో 60మంది అభ్యసిస్తున్నారన్నారు. గతంలో 57 ఏళ్ల వారికే బీమా వర్తించేదని, ప్రస్తుత ప్రభుత్వం వయసుతో నిమిత్తం లేకుండా రూ.5లక్షల బీమా వర్తింపజేస్తుందన్నారు.
సదస్సులో కాంగ్రెస్ నాయకులు తడక వెంకటేష్, రాష్ట్ర పద్మశాలి అధ్యక్షుడు మురళీ మదన్ గోపాల్ స్వామి, భువనగిరి మార్కెట్ చైర్మన్ రేఖ బాబురావు, చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్‌రెడ్డి, చేనేత టైఅండ్‌డై అసోసియేషన్ అధ్యక్షుడు భారత లవకుమార్, చేనేత నాయకులు గర్దాసు బాలయ్య, తడక రమేష్, కర్నాటి బాలరాజు, బోగ భానుమతి విష్ణు, మెరుగు శశికళ, అంకం పాండు, రాపోలు శ్రీనివాస్, రుద్ర చంద్రప్రకాష్, సీత సత్యనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లే్‌షయాదవ్ పాల్గొన్నారు.
Updated Date - May 03 , 2025 | 12:31 AM