క్షేత్రపాలకుడికి నాగవల్లీ దళార్చనలు
ABN, Publish Date - Jun 13 , 2025 | 12:35 AM
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దివ్యక్షేత్రంలో గురువారం నిత్య కైంకర్యాలు వైభవంగా నిర్వహించారు.
యాదగిరిగుట్ట, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దివ్యక్షేత్రంలో గురువారం నిత్య కైంకర్యాలు వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయ నైరుతి దిశలో అష్టభుజి ప్రాకార మండపంలో ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలు, ముత్యాలు, బంగారు, వజ్రవైఢూర్యాలతో దివ్య మనోహరంగా అలంకరించిన అర్చకులు గజవాహన సేవలో తీర్చిదిద్ది వేద మంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల నడుమ సేవోత్సవం చేపట్టారు. ఉత్సవమూర్తులను కల్యాణ మండపంలో అధిష్టింపజేసి, విశ్వక్సేనుడి తొలి పూజలతో కల్యాణతంతు కొనసాగింది. కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి శేషవస్త్రాలు, ఆశీర్వచనం అందజేశారు. ముందుగా సుదర్శన శతక పఠనంతో హోమం పూజలు నిర్వహించారు. ప్రభాతవేళ గర్భాలయంలో స్వామిఅమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి అర్చకస్వాములు నిజాభిషేకం, నిత్యార్చనలు చేపట్టారు. పాతగుట్ట ఆలయంలో నిత్య పూజలు సంప్రదాయ రీతిలో జరిగాయి. కొండపైన శివాలయంలో పర్వతవర్థిని రామలింగేశ్వరస్వామికి నిత్య పూజలు, యాగశాలలో నిత్య రుద్రహవనం శైవాగమ పద్ధతిలో నిర్వహించారు. స్వామివారిని హిమాచల్‌ప్రదేశ్ చీఫ్ సెక్రెటరీ ప్రభోద్ సక్సేన దర్శించుకున్నారు. ఆలయ పూజారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభువులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఏఈవో గజ్వేల్లి రమేష్‌బాబు లడ్డు ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. కొండకింద వ్రత మండపాన్ని ఈవో ఎస్. వెంకట్రావ్ పరిశీలించారు. సత్యదేవుని వ్రతాలు నిర్వహించేందుకు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం టికెట్ ధర, భక్తులకు ఏమేమి వస్తు సామాగ్రి ఇస్తున్నారని వ్రత మండపం ఇన్‌చార్జీ చంద్రమౌళిని అడిగి తెలుసుకున్నారు.
వైభవంగా నరసింహ స్వామి కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి దేవాలయంలో శ్రీరాజలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్య శాశ్వత కల్యాణాన్ని గురువారం అర్చకులు వేదమంత్రోచ్ఛరణాల నడుమ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో విశ్వక్సేన పూజ, పుణ్యహావాచానం, అమ్మవార్లకు పంచామృతాభిషేకం, అష్టోత్తర సహస్ర కుంకుమార్చనలు, అనంతరం కల్యాణ తంతులో భాగంగా ఎదుర్కోళ్ల మహోత్సవంతో కల్యాణాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాల వినియోగం చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చెన్నూరి విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈవో సిరికొండ నవీన్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
Updated Date - Jun 13 , 2025 | 12:35 AM