MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడే
ABN, Publish Date - Mar 03 , 2025 | 03:51 AM
కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది.
మొత్తం మూడు స్థానాలకు ఎన్నికలు.. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్
పట్టభద్రుల నియోజకర్గం ఫలితం వెల్లడికి రెండు రోజులు పట్టే అవకాశం!
కరీంనగర్/నల్లగొండ, మార్చి 2(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్‌లోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియం ఆవరణలో ఉన్న ఇండోర్ స్టేడియంలో సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. పట్టభద్రుల నియోజకవర్గంలో 2,50,328 మంది, ఉపాధ్యాయ నియోజకవర్గంలో 24,968 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తిచేసేందుకు 800 మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. పట్టభద్రుల నియోజకవర్గంలో ప్రాధాన్యక్రమంలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి రెండు, మూడు రోజులు పట్టే అవకాశముంది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా సర్దార్ రవీందర్‌సింగ్ సహా 56 మంది పోటీ చేశారు. తొలి ప్రాధాన్య ఓటుతో అభ్యర్థి విజయం సాధించాలంటే పోలై, చెల్లిన ఓట్లలో 50శాతానికంటే ఒక ఓటు అధికంగా రావాల్సి ఉంటుంది. పోలింగ్ ఏకపక్షంగా జరగకపోవడంతో తొలి ప్రాధాన్య ఓటుతో అభ్యర్థులెవరూ గెలిచే అవకాశం లేదని భావిస్తున్నారు. ఇక, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 15 మంది అభ్యర్థులు పోటీపడుతుండటం, 24,968 ఓట్లు లెక్కించాల్సి ఉండడంతో సోమవారం అర్ధరాత్రి వరకు ఈ ఫలితం వెలువడుతుందని భావిస్తున్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి ఆర్జాలబావి వద్ద స్టేట్‌వేర్ హౌసింగ్ గోదాముల్లో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలో 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
Updated Date - Mar 03 , 2025 | 03:51 AM