Minister Damodar Rajanarasimha : దళితుల దశాబ్దాల కల సాకారం
ABN, Publish Date - Mar 19 , 2025 | 06:49 AM
దళితుల దశాబ్దాల కలను సీఎం రేవంత్‌రెడ్డి నెరవేర్చారని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
దశాబ్దాల కలను నెరవేర్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ
ఎస్సీ వర్గీకరణ ఏ కులానికీ వ్యతిరేకం కాదు
సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్
సభలో మంత్రి దామోదర
హైదరాబాద్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): దళితుల దశాబ్దాల కలను సీఎం రేవంత్‌రెడ్డి నెరవేర్చారని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. వర్గీకరణ ఏ కులానికీ వ్యతిరేకం కాదని, కేవలం సామాజిక న్యాయం మాత్రమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌పార్టీ మొదటినుంచీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలే సీఎం రేవంత్‌రెడ్డి దార్శనికతకు తార్కాణమన్నారు. మంగళవారం శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ స్వాతంత్య్రం వచ్చిన 15 ఏళ్లకే మొదలైందని, దీనికోసం ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగి, ఎంతో మంది త్యాగాలు చేశారని తెలిపారు. 2025 ఫిబ్రవరి 4వ తేదీ (సోషల్ జస్టిస్ డే), మార్చి 18వ తేదీలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. గతంలో ఓసారి వర్గీకరణ చేసినా.. కోర్టు తీర్పులతో అది నిలిచిపోయిందని గుర్తు చేశారు. గతంలో కులగణనను చివరిగా 1931లో చేశారని, 1936లో షెడ్యూల్డ్ కులాల జాబితాను ప్రకటించారని పేర్కొన్నారు. దళితులకు విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పించగా, ఆర్థిక స్వావలంభన కోసం ఉద్యోగాలు, పాలనలో భాగస్వామ్యం కోసం చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించినప్పటికీ, ఆ ఫలాలు ఎస్సీలకు వారి జనాభా ప్రాతిపదికన పంపిణీ కాలేదన్నారు. ఈ అంశమే ఆందోళనకు, అసంతృప్తికి కారణమైందని తెలిపారు. 1965లోనే ఎస్సీ వర్గీకరణపై బీఎన్ లోకూర్ కమిటీని అప్పటి ప్రభుత్వం నియమించిందన్నారు. 1975లోనే పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణ అమలు చేసిందని గుర్తు చేశారు.
2000లో వర్గీకరణ అమలు చేసినా..
1990లో ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ ఉద్యమం ఉధృతం కాగా, నాటి సర్కారు జస్టిస్ రామచంద్రరాజు నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. ఎస్సీలను 4 గ్రూపులుగా వర్గీకరించి, రిజర్వేషన్లు అమలు చేయాలని కమిషన్ సూచించిందని, ఆ మేరకు 2000 సంవత్సరంలో ఎస్సీలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు అమలు చేశారని పేర్కొన్నారు. అత్యంత వెనుకబడిన రెల్లి, దాని ఉపకులాలను గ్రూప్-ఎలో చేర్చి, వారికి కమిషన్ సూచనల ప్రకారం అదనపు ప్రయోజనం కల్పించారని వివరించారు. అయితే కోర్టు కేసులు, సుప్రీంకోర్టు తీర్పుతో 2004 నుంచి వర్గీకరణ ఆగిపోయిందన్నారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వర్గీకరణకు అనుకూలంగా వాదించేందుకు ప్రభుత్వం పూనుకుందని అన్నారు. గతేడాది ఆగస్టు 1న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తీర్పునిచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చునని చెప్పిందని గుర్తు చేశారు. అయితే అక్షరాస్యత, వృత్తి, జనాభా, ఉద్యోగావకాశాలు, ఆర్థిక, సామాజిక పరిస్థితులను ప్రామాణికంగా తీసుకోవాలని ఆదేశించిందన్నారు. సుప్రీం తీర్పు వచ్చిన గంటలోనే.. వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని తెలిపారు. అనంతరం వర్గీకరణ అమలు కోసం క్యాబినెట్ సబ్ కమిటీని నియామకం, కమిటీ సూచనతో హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు, జిల్లాల్లో కమిషన్ పర్యటించి, క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం వంటి పరిణామాలను మంత్రి వివరించారు.
ఏకసభ్య కమిషన్ సిఫారసు మేరకు..
ఏకసభ్య కమిషన్ 82 రోజుల్లో అధ్యయనం పూర్తి చేసి, 199 పేజీల నివేదికను ఈ ఏడాది ఫిబ్రవరి 3న ప్రభుత్వానికి సమర్పించిందని మంత్రి దామోదర తెలిపారు. 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించాల్సిందిగా సిఫారసు చేసిందన్నారు. మొదటి గ్రూపులో అత్యంత వెనుకబడిన 15 కులాలను చేర్చారని, వారి జనాభా 1,71,625 మంది అని చెప్పారు. వీరి జనాభా శాతానికి మించి 1శాతం రిజర్వేషన్ కేటాయించారన్నారు. రెండో గ్రూపులో 18 కులాలను చేర్చారని, వీరి జనాభా 32,74,377 మంది ఉండగా 9శాతం రిజర్వేషన్లు కేటాయించారని తెలిపారు. మూడో గ్రూపులో 26 కులాలను చేర్చి 5 శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఇప్పుడు వర్గీకరణలో భాగస్వామిగా ఉండడం తనకు దక్కిన అదృష్టమని మంత్రి దామోదర అన్నారు. ఈ బిల్లుకు మద్దతివ్వాలని అన్ని పక్షాలను కోరారు. కాగా, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన అనంతరం ముగింపు చర్చలో మంత్రి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు సహకరించిన అన్ని పక్షాలకు, శాసనసభ్యులందరికీ, సీఎం రేవంత్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - Mar 19 , 2025 | 06:49 AM