Registration Scam: తాండూరులో భారీగా అక్రమ రిజిస్ట్రేషన్లు
ABN, Publish Date - May 25 , 2025 | 05:03 AM
తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనధికార ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిపిన ఫసియుద్దీన్‌ను సస్పెండ్ చేశారు. నాలుగు రోజుల్లో 224 రిజిస్ట్రేషన్లు చేసి భారీ గోల్‌మాల్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై లోతుగా విచారణ జరుగుతోంది.
అక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నాలుగు రోజుల్లోనే 224 రిజిస్ట్రేషన్లు
సాధారణ రోజుల్లో 10 నుంచి 15లోపే
స్కానింగ్ పెండింగ్‌తో బయటపడ్డ వైనం
ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ పనే.. ఆయనపై వేటు
సమగ్ర విచారణకు ఉన్నతాధికారుల ఆదేశం
వికారాబాద్, మే 24 (ఆంధ్రజ్యోతి): తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల పరంగా పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరిగినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అనధికార లే ఔట్లలోని ప్లాట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు అక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ‘అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం’పై సమగ్ర విచారణకు ఆదేశించారు. దీనికి సంబంధించిన నివేదిక రాగానే మరికొందరిపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాండూరులో సబ్ రిజిస్ట్రార్‌గా ఉన్న సాయికుమార్ గతనెల 22 నుంచి ఈ నెల 17వ తేదీ వరకు సెలవులో వెళ్లడంతో ఆయన స్థానంలో వికారాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేస్తున్న పవన్ ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు తీసుకున్నారు. అక్కడ 20 రోజుల పాటు పనిచేశాక పవన్‌కుమార్ తన సోదరుడి వివాహం కోసం ఈనెల 12 నుంచి 23వ తేదీ వరకు సెలవు పెట్టారు.
దీంతో చంపాపేట్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఫసియుద్దీన్‌కు ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు తాండూరు సబ్ రిజిస్ట్రార్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయన అక్కడ ఆరు రోజుల పాటు ‘బాధ్యతలు’ నిర్వహించి నాలుగురోజుల్లోనే ఏకంగా 224 రిజిస్ట్రేషన్లు చేశారు. సాధారణంగా తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 10 నుంచి 15 లోపే రిజిస్ట్రేషన్లు జరిగేవి. దీంట్లో అయిదు వరకు తనఖాకు సంబంఽధించినవే ఉండేవి. సాధారణంగానైతే ఏ రోజు రిజిస్ట్రేషన్ జరిగితే అదేరోజు డ్యాక్యుమెంట్ల స్కానింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేయాలి. ఫసియుద్దీన్ బాధ్యతలు నిర్వహించిన ఆరు రోజుల్లో స్కానింగ్ ప్రక్రియ కొనసాగలేదు. పెద్దఎత్తున డ్యాక్యుమెంట్ల స్కానింగ్ పెండింగ్‌లో ఉండటంతో భారీ ఎత్తున రిజిస్ట్రేషన్ల ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఎల్‌ఆర్‌ఎస్ పూర్తయ్యాక ఆన్‌లైన్‌లో ధ్రువీకరణ పత్రం తీసుకుని వీటిని రిజిస్ట్రేషన్ సమయంలో జత చేస్తారు. కానీ తాండూరు కార్యాలయంలో డబ్బు కట్టినట్లు కొన్ని రసీదులు జతపరిచినట్లు అధికారులు చెబుతున్నారు. దీనిపై వాస్తవాలు వెలికి తీసేందుకు లోతుగా విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఫసియుద్దీన్ బాధ్యతలు నిర్వహించిన ఆరు రోజుల్లో రాత్రి పదింటి దాకా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు తమ విచారణలో గుర్తించడం గమనార్హం. ఈ మేరకు అనధికార లే ఔట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆయన పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో డాక్యుమెంట్ రైటర్లు కొందరు కీలకపాత్ర వ్యవహరించినట్లు ఉన్నతాధికారుల దృష్టికొచ్చింది. కాగా రిజిస్ట్రేషన్లపై ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఫసియుద్దీన్ హయాంలో జరిగిన రిజిస్ట్రేషన్లపై విచారణ జరిపించేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని నియమించారు.
ఇవి కూడా చదవండి
Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO
Husband And Wife: సెల్‌ఫోన్‌లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..
Updated Date - May 25 , 2025 | 05:03 AM