వరాల జల్లు కురిసేనా?
ABN, Publish Date - Jul 17 , 2025 | 11:11 PM
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి శుక్రవారం జిల్లాలోని పెంట్లవెల్లి మండలం జటప్రోల్‌లో పర్యటించనున్నారు.
- నేడు పెంట్లవెల్లి మండలం జటప్రోల్‌కు సీఎం రాక
- రూ.200కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ
- అనంతరం బహిరంగ సభ
నాగర్‌కర్నూల్/కొల్లాపూర్/పెంట్లవెల్లి, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి శుక్రవారం జిల్లాలోని పెంట్లవెల్లి మండలం జటప్రోల్‌లో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 200కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న భవన సముదాయానికి పెంట్లవెల్లి మండలం జటప్రోల్ మదనగోపాలస్వామి ఆలయం ఎదుట 24ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు. మొదటిసారి నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. దాదాపు 30 వేల నుంచి 50వేల మందిని సమీకరించి బహిరంగ సభను నిర్వహించాలని యోచిస్తున్నారు.
సీఎం షెడ్యూల్ ఇదే...
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బేగంపేటలోని విమానాశ్రయం నుంచి ఒంటిగంటకు హెలికాప్టర్‌లో బయల్దేరి 1:45గంటలకు జటప్రోల్‌కు చేరుకుంటారు. జటప్రోల్‌లోని మదనగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించుకున్న అనంతరం 2:10గంటలకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మదనగోపాలస్వామి ఆలయం ముందు నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి రాక కోసం దోసకాయలపేట వద్ద హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు.
కొల్లాపూర్ సంస్థానంలో సమస్యలు ఎన్నెన్నో...
గతంలో కౌన్ పూస్తా కొల్లాపూర్ సంస్థాన్ అనే నానుడి ఉన్న ఈ నియోజకవర్గంలో పట్టణాభివృద్ధి విషయంలో కృషి జరిగినా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు తిష్ట వేసే ఉన్నాయి. కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లో 34వేల 422ఎకరాల్లో మామిడి పంటను సాగు చేస్తున్నారు. ఇందులో సింహభాగం 33వేల 523.7ఎకరాల్లో కొల్లాపూర్‌లోనే మామిడి పంట సాగవుతుంది. సురభి రాజుల కాలం నుంచి కొల్లాపూర్ మామిడి దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పండిస్తున్న బేనీషాన్, తోతాపరీ, రాణిపసంద్, దిల్‌పసంద్ రకాలకు దేశ విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉన్నది. మార్కెటింగ్ సౌకర్యం లేక మామిడి రైతులు కుదేలవుతున్నారు. ప్రతీ ఏటా దళారుల చేతిలో మోసపోతూ కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. మామిడి ప్రాసెసింగ్ యూనిట్‌కు పెంట్లవెల్లి మండలం రామాపూర్ వద్ద స్థల సేకరణ జరిగిన కార్యాచరణకు నోచుకోలేదు. దీంతో తమకు మంచి మార్కెటింగ్ వ్యవస్థ కల్పించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తే తమ దశ మారినట్టేనని ఈ ప్రాంత రైతాంగం ఎన్నో ఆశలు పెట్టుకుంది.
నిర్వాసితుల గోడును పట్టించుకుంటారా?
కొల్లాపూర్ నియోజకవర్గంలో శ్రీశైలం నిర్వాసితుల గోడు కూడా ప్రధానంగా ఉంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం దాదాపు 2000మంది నిర్వాసితులుగా మారారు. వారికి ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని దాదాపు 20ఏళ్ల క్రితం హామీ ఇచ్చినా పూర్తిస్థాయిలో నెరవేరలేదు. నిర్వాసితులుగా మారిన వారి ఇళ్లల్లో పిల్లల వయో పరిమితి ఉద్యోగ అర్హతను కోల్పోతున్న పట్టించుకోవడం లేదని విమర్శలు బలంగా విన్పిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కూడా నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని ఇచ్చిన భరోసా ఎన్నికల హామీగానే మిగిలిపోవడంతో కనీసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనలోనైనా తమకు ఏదైనా భరోసా వస్తుందనే ఆత్మవిశ్వాసంతో శ్రీశైలం నిర్వాసితులు ఉన్నారు. 2022లో పీసీసీ అధ్యక్షుని హోదాలో కొల్లాపూర్‌లో బహిరంగ సభ నిర్వహించిన రేవంత్‌రెడ్డి మాదాసి కుర్వలకు ఎస్టీ ధ్రువీకరణ పత్రం ఇస్తామని భరోసానిచ్చారు. దీనిపై కూడా క్లారిటీ వస్తుందని మాదాసి కుర్వలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
మత్స్యకారుల శ్రమ దోపిడీకి అడ్డుకట్ట పడేనా?
మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం ప్రారంభమైన తర్వాత కృష్ణానదితో పాటు ఎల్లూరు, సింగవట్నం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టుతో సహా దాదాపు 215చెరువుల్లో మత్స్య సంపద 11వేల 48మెట్రిక్ టన్నులకు చేరింది. ఇక్కడ దోపిడీని అరికట్టడం దళారులను నియంత్రించడంలో ప్రత్యేకమైన వ్యవస్థ లేకపోవడంతో మత్స్యకారులకు సంకటంగా మారింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంటే తమ జీవితాలు మెరుగుపడుతాయనే ఆలోచన మత్స్యకారుల్లో ఉంది. ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేసిన విధంగా ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ ద్వారా చేపలను కొనుగోలు చేసి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లకు తరలిస్తే తమ శ్రమకు తగిన ఫలితం దక్కుతుందని మత్స్యకారులు ఆశిస్తున్నారు.
సాగునీటిపై బెంగ
సుదీర్ఘకాలం పాటు కరువుకు ఆనవాళ్లమై వలసలకు కేంద్ర బిందువైన నాగర్‌కర్నూల్ జిల్లాలో సాగునీటి అంశం కొంత ప్రోత్సాహకరంగా ఉన్నా పూర్తిస్థాయిలో నీరందించగలిగితే మరింత మెరుగుపడుతామనే ఆలోచన చిన్న సన్నకారు రైతుల్లో ఉంది. మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకంలో దాదాపు 4లక్షల 60వేల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉండగా వివిధ కారణాలతో చెరువులు, కుంటల కింద మాత్రమే 2లక్షల పైచిలుకు ఎకరాలకు నీరందుతుంది. మెట్ట ప్రాంతానికి ఆయకట్టు స్థిరీకరణ చేసి నీరందించాల్సి ఉండగా కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ లేక పూర్తిస్థాయిలో రైతాంగానికి ప్రయోజనం చేకూరడం లేదు. కేఎల్‌ఐలో 3,5వ మోటారును వినియోగంలోకి తీసుకురాకపోవడంతో అనేక ఆటుపోట్లను అన్నదాతలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు కూడా ఆశాజనకంగా లేకపోవడం పట్ల అన్నదాతల్లో అసంతృప్తి వెల్లడవుతుంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా డిండికి నీరందించే క్రమంలో ఎంజీఎల్‌ఐలో భూములు కోల్పోయిన రైతులు మరోమారు కూడా నిర్వాసితులుగా మారాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. వాస్తవానికి నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి వట్టెం రిజర్వాయర్ దాకా ఎలాంటి ఆయకట్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద లేకపోయినా స్థానికంగా భూగర్భ జలాలు పెరిగి జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయనే క్రమంలో రైతాంగం సహకరిస్తున్నది. రెండవ సారి భూమి కోల్పోతున్న వారికి నష్ట పరిహారం చెల్లించే విషయంలో వెసులుబాటు కల్పించకపోవడం పట్ల అన్నదాతల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది.
సభకు భారీ బందోబస్తు
కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభకు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నేతృత్వంలో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించనున్నారు. ఎస్పీ గత మూడు రోజుల నుంచి సీఎం సభ భద్రత ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్నారు. సీఎం సభకు 805 మంది పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. వీరిలో 3 అడిషనల్ ఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 29 మంది సీఐలు, 87 మంది ఎస్‌ఐలు 140 మంది ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, 299 మంది కానిస్టేబుళ్లు, 134 మంది మహిళా కానిస్టేబుళ్లు, 104 మంది హోంగార్డులు సీఎం సభలో విధులు నిర్వహించనున్నట్లు పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది.
Updated Date - Jul 17 , 2025 | 11:11 PM