కేసీఆర్‌కు ఎందుకింత బాధ?
ABN, Publish Date - Apr 30 , 2025 | 11:04 PM
వరంగల్‌లో జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ తనకు దుఃఖం వస్తుందని అనడం హాస్యాస్పదంగా ఉన్నదని, అసలు ఆయనకు ఎందుకింత బాధ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఎద్దేవా చేశారు.
సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకా..
ప్రజలను బాధపెట్టిన ధరణి గురించి సభలో ఎందుకు మాట్లాడలేదు ?
భూ భారతి సదస్సులో నిప్పులు చెరిగిన మంత్రి పొంగులేటి
చిన్నచింతకుంట, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌లో జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ తనకు దుఃఖం వస్తుందని అనడం హాస్యాస్పదంగా ఉన్నదని, అసలు ఆయనకు ఎందుకింత బాధ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఎద్దేవా చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలో గల కురుమూర్తి జాతర మైదానంలో దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన భూ భారతి అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆడబిడ్డలకు 200 యూనిట్ల మేరకు ఉచిత కరెంటు ఇస్తున్నందుకు దుఃఖమొస్తోందా, రూ.500 లకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నందుకా, ఆర్‌టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినందుకా, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తున్నందుకా అని ప్రశ్నించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇస్తున్నందుకా, రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నందుకా, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, నోటిఫికేషన్లు ఇస్తున్నందుకా, 10 నెలల్లోనే రైతులకు రుణమాఫీ చేసినందుకా అని పొంగులేటి ప్రశ్నించారు. మంచి చేస్తున్న తమ కాళ్లలో కట్టెలు పెట్టేలా వ్యవహరించటం, విషం నింపుకొని మాట్లాడటం వంటి పనులను కేసీఆర్ ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.
ఆ బాధ్యత అధికారులదే..
ఇందిరమ్మ ప్రజా పాలనా ప్రభుత్వంలో రైతులను ఇబ్బందులు పెట్టకుండా భూ భారతి చట్టాన్ని అమలు చేసే బాధ్యత అధికారులదేనని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం విధి విధానాలు లేకుండా ధరణిని తెచ్చిందన్నారు. భూ భారతి దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ చట్టంపై అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించి, రైతులకు చెప్పాలన్నారు. జూన్ 2 తరువాత మిగతా 28 జిల్లాలోని ఒక్కో మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అమలు చేయనున్నట్లు చెప్పారు. ప్రతీ భూ సమస్యకు ఇందులో పరిష్కారం ఉంటుందన్నారు. దేవరకద్ర ఎ మ్మెల్యే అభ్యర్థన మేరకు కౌకుంట్ల, మూసాపేట, అడ్డాకుల మండలాలకు మండల కాంప్లెక్స్ భవనాలు, ఏదో ఒక మండలానికి సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని తెలిపారు. కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ అన్ని మండలాల్లో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ మన జిల్లా ముద్దుబిడ్డ, సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రూపొందించిన భూ భారతీ చట్టంతో అన్ని రకాల భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. దేవరకద్ర నియోజకవర్గానికి మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్‌రావు, ఆర్‌డీవో నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 30 , 2025 | 11:04 PM