తప్పెవరిది
ABN, Publish Date - Jul 13 , 2025 | 11:32 PM
తప్పుడు ధ్రువప్రతలు పెట్టి ఉద్యోగాలు పొందారన్న ఫిర్యాదులతో పలువురిపై విచారణ చేసి, ఉమ్మడి పాలమూరుతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పలువురిని ఉపాధ్యాయ ఉద్యోగం నుంచి తొలగించారు.
- తప్పుడు సర్టిఫికెట్లుతో ఉద్యోగాలు పొందారని పలువురిపై ఫిర్యాదు
- 12 మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన పాఠశాల విద్యాశాఖ
- కోర్టును ఆశ్రయించడంతో ముగ్గురికి అనుకూలంగా తీర్పునిచ్చిన న్యాయస్థానం
- నేటికీ వారిని విధుల్లోకి తీసుకోని వైనం
- విద్యాశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న బాధితులు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, జూలై 13 (ఆంధ్రజ్యోతి): తప్పుడు ధ్రువప్రతలు పెట్టి ఉద్యోగాలు పొందారన్న ఫిర్యాదులతో పలువురిపై విచారణ చేసి, ఉమ్మడి పాలమూరుతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పలువురిని ఉపాధ్యాయ ఉద్యోగం నుంచి తొలగించారు. కొందరి ఇక్రిమెంట్ కట్ చేశారు. దీంతో పలువురి ఉద్యోగుల జీవితాలు రోడ్డు పడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2000, 2001, 2002, 2004, 2006 సంవత్సరాల్లో వరుస ఉపాధ్యాయ నియకాలు నిర్వహించారు. అప్పట్లో వారికి ఉన్న వైకల్యాన్ని బట్టి మహబూబ్‌నగర్ జిల్లా, హైదరాబాద్ ఈఎన్‌టీ ఆస్పత్రిలో వినికిడి లోపం, చూపు మందగించడం, అంగవైకల్యనం ఉందని సర్టిఫికెట్స్ పొందారు. వాటి ద్వారా వికలాంగుల కోటాలో ఉద్యోగాలు సాధించారు. విధుల్లో చేరి, 8 నుంచి 10 ఏళ్ల పాటు కొనసాగారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన వారిపై కొందరు.. వారు వికలాంగులు కారని, తప్పుడు ధ్రువప్రతాలు పెట్టి ఉద్యోగాలు పొందారని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ విషయమై పలు దినపత్రికల్లో వరుస కథనాలు వచ్చాయి. దాంతో అధికారులు సుమారు 70 మంది పలు వైకల్య సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు పొందారని విచారణ చేశారు. ఆస్పత్రులలో వారికి ఉన్న వైకల్యానికి సంబంధించి చికిత్స చేయించారు. మొదట సర్టిఫికెట్లలో పేర్కొన్న వైకల్యానికి సంబంధించిన పర్సెంటేజ్ రాకపోవడంతో 12 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ, పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. దీంతో వారి కుంటుంబాలు వీధిన పడ్డాయి. అయితే అందులో ఐదుగురు కోర్టును ఆశ్రయించారు. ఒకరిది పెండింగ్ పెట్టగా, ముగ్గురికి కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని బాధితులు తెలిపారు.
కోర్టును ఆశ్రయించిన బాధితులు
తమకు వినికిడి, దృష్టి లోపం ఉందని డాక్టర్స్ ఇచ్చిన సర్టిఫికెట్లతో డీఎస్సీ రాసి ఉద్యోగం సాధించుకుంటే కొందరు అవి తప్పుడు ధ్రువపత్రాలని ఫిర్యాదు చేశారని, దాంతో తమను మళ్లీ ఆస్పత్రికి పంపించి వైద్య పరీక్షలు చేయించారని బాధితులు చెబుతున్నారు. అందులో వినికిడి, దృష్టి లోపం పర్సెంటేజ్ తక్కువ రావడంతో తమను పాఠశాల విద్యాశాఖ ఉద్యోగాల నుంచి తొలగించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో చేయని తప్పుకు తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, తమకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించగా, కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిందని తెలిపారు. కోర్టు తీర్పు కాగితాలను పాఠశాల విద్యాశాఖ ఆధికారులకు సమర్పించామని, కానీ పాఠశాల విద్యాశాఖ తమ విధుల్లోకి తీసుకోకుండా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని వాపోతున్నారు. అప్పటి నుంచి సగం జీతం మాత్రం ఇస్తున్నట్లు తెలిపారు. దీనిపై కోర్టును మరోమారు ఆశ్రయించామని, అప్పుడు కూడా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని తెలిపారు. ఆ తీర్పులో బాధితులు తప్పు చేసినట్లు ఎలా అవుతుందని?, వారు నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేయలేదు కదా?.. అవి డాక్టర్స్ ఇచ్చిన సర్టిఫెట్స్ అయినందున డాక్టర్లు కూడా తప్పు చేసి ఉండొచ్చుకదా అని తీర్పులో పేర్కొన్నట్లు బాధితులు పేర్కొంటున్నారు.
బాధితులను పట్టించుకోని విద్యాశాఖ
కోర్టు తీర్పు మేరకు తమకు న్యాయం చేయాలని పాఠశాల విద్యాశాఖను బాధితులు కలువగా, జిల్లా అధికారులతో విచారణ చేయాలని చెప్పారు. విద్యా శాఖ అధికారులు సంబంధింత ముగ్గురు బాధితుల ఫైల్‌ను హైదారాబాద్‌లోని కోఠి ఈయన్‌టీ ఆస్పత్రిలో పరిశీలించారు. వారి సర్టిఫికెట్స్ నిజమైనవేనని వైద్యులు అంగీకరించారు. ఈ విచారణ జరిగి రోజులు గడుస్తున్నా బాధితుల సమస్య పరిష్కారం కాకపోవడంతో వారు జిల్లా విద్యాశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. తమకు నాయ్యం చేయ్యాలని కోరుతున్నారు.
డీఈవో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది
రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు సూచించిన ఆదేశాల మేరకు ముగ్గురు బాధితుల సర్టిఫికెట్స్‌ను ఈఎన్‌టీ ఆస్పత్రిలో పరిశీలించారు. అవి నిజమైన సర్టిఫికెట్లేనని తేలింది. అందుకు సంబంధించిన ఫైల్‌ను డీఈవోకు అందించాం. దీనిపై డీఈవో తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయమై డీఈవోను వివరణ కోరకు పలుమార్లు ఫోన్ ద్వారా సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
- అనురాధ, ఏడీ, జిల్లా విద్యాశాఖ కార్యాలయం, మహబూబ్‌నగర్ జిల్లా
Updated Date - Jul 13 , 2025 | 11:32 PM