భర్తను హత్య చేసిన భార్య
ABN, Publish Date - Jul 05 , 2025 | 11:35 PM
నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం రాంకిష్టయ్యపల్లికి చెందిన అంజిలప్పను భార్య రాధ హైదరాబాద్‌లో హత్య చేసింది.
- మద్యం మత్తులో చనిపోయాడని నమ్మించే యత్నం
- మెడపై గాయాలు చూసి అనుమానం ఉన్నదని పోలీసులకు మృతుడి సోదరుడి ఫిర్యాదు
- గొంతు నులిమి చంపినట్లు పోస్టుమార్టంలో ఆనవాళ్లు
- హైదరాబాద్‌లో ఘటన..ఆలస్యంగా వెలుగులోకి
- ఫోన్‌లో మాట్లాడొద్దన్నందుకు ఘాతుకం
నిజాంపేట్, జూలై 5(ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం రాంకిష్టయ్యపల్లికి చెందిన అంజిలప్పను భార్య రాధ హైదరాబాద్‌లో హత్య చేసింది. మద్యం మత్తులో మరణించాడని అందరినీ నమ్మించింది. మృతదేహాన్ని తీసుకుని స్వగ్రామానికి రావడంతో అంజిలప్ప సోదరుడికి మృతదేహంపై ఉన్న గాయాలు చూసి అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. రాంకిష్టయ్యపల్లికి చెందిన అంజిలప్ప, రాధ భార్యాభర్తలు. 2014లో వీరికి వివాహం జరిగింది. ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. బతుకు దెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి, కొద్ది రోజులు మణికొండ ప్రాంతంలో ఉన్నారు. కూలీ పనులు చేసుకుని జీవించే వారు. తరువాత ముంబైతో పాటు.. పలు ప్రాంతాలకు వలస వెళ్లారు. వారి పిల్లలు మాత్రం రాధ తల్లి స్వగ్రామంలో ఉంటున్నారు. 2025 ఏప్రిల్‌లో ముంబై నుంచి తిరిగి వచ్చి, హైదరాబాద్ నగర శివారులోని బాచుపల్లిలో గల ఓ కన్‌స్ట్రక్షన్ సంస్థలో కూలీలుగా చేరారు. అక్కడే నివసిస్తూ, కాంట్రాక్టర్ వెంకటయ్య చేపట్టిన నిర్మాణ స్థలంలో పని చేస్తున్నాడు. కూలీ పనుల నిమిత్తం పలు ప్రాంతాలకు వలస వెళ్లిన వచ్చిన క్రమంలో రాధకు ఇతర వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో రాధ తరచుగా ఫోన్‌లో మాట్లాడుతుండేది. దాంతో భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న అంజిలప్ప రోజూ మద్యం తాగొచ్చి ఇతరులతో ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావని కొట్టేవాడు.
గొంతునులిమి హత్య..
గత నెల 22న దంపతుల మధ్య ఇదే విషయమై గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న అంజిలప్ప భార్యను దుర్భాషలాడుతూ దాడి చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న కాంట్రాక్టర్ జోక్యం చేసుకొని ఇద్దరినీ హెచ్చరించి, నచ్చజెప్పాడు. రోజు రోజుకు భర్త వేఽధింపులు ఎక్కువ కావడంతో రాధ అదే రోజు రాత్రి 11 :30 గంటలకు మద్యం మత్తులో ఉన్న భర్త గుండెలపై కూర్చొని, చేతులతో గొంతు నులిమి హత్య చేసింది. నేరం తన మీదకు రాకుండా ఉండేందుకు అతిగా మద్యం తాగడంతో ఆ మత్తులోనే మరణించాడని మరుసటి రోజు తోటి కార్మికులను నమ్మించింది. అదే విషయాన్ని బంధువులకు చెప్పింది. జూన్ 23న దహన సంస్కారాల కోసం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లింది. అంజిలప్ప మెడపై ఉన్న గాయాలను గుర్తించిన సోదరుడు మృతిపై అనుమానం ఉందని నారాయణపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దర్యాప్తు చేసిన బాచుపల్లి పోలీసులు..
కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించారు. అంజిలప్ప మద్యం మత్తులో చనిపోలేదని, హత్య చేశారని తేలడంతో నారాయణపేట పోలీసులు కేసును సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. విచారణ చేపట్టిన బాచుపల్లి పోలీసులు ఈ నెల 1న భార్య రాధను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె భర్తను తానే గొంతునులిమి హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించింది. రోజూ మద్యం తాగి వచ్చి వేధించి నందునే హత్య చేసినట్లు తెలిపింది. లోతుగా దర్యాప్తు చేసిన బాచుపల్లి పోలీసులు సీసీటీవీ కెమెరాలు, ఇతర టెక్నికల్ ఎవిడెన్స్‌లను సేకరించి రాధ ఒక్కతే భర్తను హత్య చేసిందని నిర్ధారించారు. నిందితురాలిని శనివారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
Updated Date - Jul 05 , 2025 | 11:35 PM