వనమహోత్సవానికి సమయం ఆసన్నం
ABN, Publish Date - Jul 01 , 2025 | 11:21 PM
పచ్చదనాన్ని పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం వన మహోత్సవానికి శ్రీకారం చుట్టింది.
- వనపర్తి జిల్లాలో 50 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
- 255 గ్రామ పంచాయతీల్లో నర్సరీల నిర్వహణ
- మొక్కలు నాటేందుకు స్థలాల గుర్తింపు
వనపర్తి రూరల్, జూలై 1(ఆంధ్రజ్యోతి) : పచ్చదనాన్ని పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం వన మహోత్సవానికి శ్రీకారం చుట్టింది. గత బీఆర్‌ఎస్ హయాంలో హరితహారం పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వన మహోత్సవం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందుకోసం వనపర్తి జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల పరిధిలో అధికారులు నర్సరీలను ఏర్పాటు చేసే మొక్కలను పెంచుతున్నారు. వర్షాల ఆధారంగా ఈ నెల మొదటి వారం లేదా రెండవ వారంలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు, రహదారులకు ఇరువైపులా, పొలాలు, చెరువుల గట్లపైన, ప్రభుత్వ కార్యాలయాలు, కమ్యూనిటీ కేంద్రాలు, ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల ఆవరణల్లో మొక్కలు నాటేందుకు ఖాళీ స్థలాలను గుర్తిస్తున్నారు. మొక్కలు నాటేందుకు గుంతలు తీసే పనులు కొనసాగుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా 58 లక్షల మొక్కలు
వనపర్తి జిల్లాలోని 14 మండలాల పరిధిలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో నర్సరీలను ఏర్పాటు చేశారు. ప్రతీ నర్సరీలో దాదాపు 10 వేల మొక్కలను పెంచుతున్నారు. గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ, పోలీస్, నీటి పారుదల, విద్య, వైద్య, విద్యుత్, పశు సంవర్ధక, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈనెలలో జిల్లా వ్యాప్తంగా 50 లక్షల మొక్కలను నాటేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. మొక్కలు నాటేందుకు గుంతలను తవ్వించాలని సంబంధిత శాఖల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పూలు, పండ్ల మొక్కలతో పాటు రోడ్లకు ఇరువైపులా నీడ నిచ్చే మొక్కలను నాటేందుకు ప్రణాళికలు రూపొందించింది. అలాగే గ్రామ పంచాయతీల్లో ప్రతీ ఇంటికి 6 మొక్కలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. నర్సరీల్లో గులాబీ, మందార, గన్నేరు, సీతాఫలం, జామ, ఉసిరి, అల్ల నేరేడు, మునగ, తులసి, దానిమ్మ, బొప్పాయి. ఈత, అడవి తంగేడు, వేప మొక్కలతో పాటు ఇతర ఔషధ మొక్కలను నాటనున్నారు.
కార్యాచరణ సిద్ధం
వన మహోత్సవంలో భాగంగా డీఆర్‌డీవో ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 11.50 లక్షల మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెలలో మొక్కలు నాటేందుకు చర్యలు చేపడతాం. డీఆర్‌డీఏ తరపున ఈనెలాఖరులోగా గుంతలు తీయాలని ఈజీఎస్ సిబ్బందికి సూచించాం. ప్రతి ఇంటికి 6 చొప్పున పూలు, పండ్లు, ఔషధ మొక్కలు అందజేస్తాం.
- ఉమాదేవి, డీఆర్‌డీవో
Updated Date - Jul 01 , 2025 | 11:21 PM