ప్రాజెక్టు ఇక భద్రం
ABN, Publish Date - Jul 02 , 2025 | 11:37 PM
మెట్ట ప్రాంతాలకు సాగునీరు, ఉమ్మడి పాలమూరుకు తాగునీరు.. విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో నిర్మించిన జూరాల ప్రాజెక్టు కొద్దికాలంగా భద్రత ముప్పు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.. ప్రాజెక్టు నిర్మించినప్పుడు కట్టపై నుంచి వాహనాలు ఇరువైపులా తిరగడాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పటికీ, నిత్యం రాకపోకలు పెరుగుతుండటంతో ప్రాజెక్టు భద్రతకు ఇబ్బందిగా మారింది.
జూరాల క్రస్ట్‌గేట్ల దిగువన రూ.121.92 కోట్లతో హై లెవల్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణం
ఇటు నందిమల్ల.. అటు రేవులపల్లి మధ్య కిలోమీటర్ పొడవున..
దాంతో పాటే అప్రోచ్ రోడ్డు, అవసరమైన కల్వర్టులు, లింక్ రోడ్లు కూడా..
పరిపాలనా అనుమతులు జారీ చేసిన ప్రభుత్వం
2012లో మొదటి ప్రతిపాదనలు.. నిధులు రావడానికి 13 ఏళ్ల సమయం
మహబూబ్‌నగర్, జూలై 2(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మెట్ట ప్రాంతాలకు సాగునీరు, ఉమ్మడి పాలమూరుకు తాగునీరు.. విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో నిర్మించిన జూరాల ప్రాజెక్టు కొద్దికాలంగా భద్రత ముప్పు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.. ప్రాజెక్టు నిర్మించినప్పుడు కట్టపై నుంచి వాహనాలు ఇరువైపులా తిరగడాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పటికీ, నిత్యం రాకపోకలు పెరుగుతుండటంతో ప్రాజెక్టు భద్రతకు ఇబ్బందిగా మారింది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా జూరాలకు దిగువన హై లెవల్ బ్రిడ్జిని నిర్మించాలనే ప్రతిపాదనలు దాదాపు 13 ఏళ్లుగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు నిధుల మంజూరుకు నోచుకోలేదు. ఇటీవల ప్రాజెక్టు మరమ్మతుల సమయంలో రోప్‌లు తెగిపోవడం, గ్యాంటీ క్రేన్ మరమ్మతుకు గురికావడంతో అది రాజకీయ దుమారంగా మారింది. ఆ సందర్భంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గత శనివారం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, అధికారులు హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం ప్రాతిపాదనలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి ఆ ప్రతిపాదనలకు వెంటనే ఓకే చెప్పి, నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. అదే సందర్భంలో కేవలం బ్రిడ్జితో సరిపెట్టకుండా రోడ్ కం బ్యారేజీ ఏర్పాటును పరిశీలించాలని కోరగా.. సర్వే చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అయితే రోడ్ కం బ్యారేజీ అంశాన్ని ప్రస్తావించకుండానే రాష్ట్ర ప్రభుత్వం జూరాల దిగువన రూ.121.92 కోట్లతో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ తెలుపుతూ మంగళవారం పరిపాలన అనుమతులను జారీ చేసింది.
1007 మీటర్ల మేర నిర్మాణం..
ప్రస్తుతం ప్రాథమిక అంచనాల మేరకు వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల నుంచి గద్వాల జిల్లా ధరూర్ మండలం రేవులపల్లి మధ్య కృష్ణానదిపై 1007 మీటర్ల మేర హై లెవల్ రోడ్డు బ్రిడ్జిని నిర్మించనున్నారు. 19 మీటర్ల వెడల్పుతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. దానికి సంబంధించిన అప్రోచ్ రోడ్డు, లింక్ రోడ్లు, కల్వర్టుల నిర్మాణం కూడా ఇందులో భాగంగానే చేపట్టే అవకాశం ఉంది. నందిమల్లవైపు ఎడమ ప్రధాన కాలువ, సమాంతర కాలువలు ఉన్నాయి. వాటిపై కూడా డీఎల్‌ఆర్‌బీ (డబుల్ లైన్ రోడ్డు బ్రిడ్జి)లను నిర్మించనున్నారు. జెన్‌కో సర్కిల్ నుంచి కుడివైపు హెచ్‌ఎల్‌ఆర్‌బీ (హై లెవల్ రోడ్డు బ్రిడ్జి) వరకు అప్రోచ్ రోడ్డు నిర్మిస్తారు. ఎడమవైపు నందిమల్ల సర్కిల్‌కు అనుసంధానించడానికి లింక్ రోడ్డు నిర్మిస్తారు. ఈ ఏర్పాటు వల్ల జూరాలపై నుంచి వాహనాల రాకపోకలను నిషేధించవచ్చు. ప్రాజెక్టు నుంచి 12.50 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలైనా కొత్త బ్రిడ్జికి ఇబ్బంది కలగకుండా కాంటూర్ లెవల్స్ 315.130 మీటర్లుగా ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ నుంచి గద్వాల జిల్లాకు వెళ్లాలంటే బీచుపల్లి ఎన్‌హెచ్ 44 బ్రిడ్జి ద్వారానైనా.. లేదా జూరాల ప్రాజెక్టు ద్వారానైనా వెళ్లాల్సి ఉంది. ఈ బ్రిడ్జి నిర్మాణమైతే ఇబ్బందులు చాలావరకు తగ్గుతాయి. అలాగే ప్రాజెక్టు భద్రతకు కూడా ఎలాంటి ముప్పు ఉండదు. పర్యాటకులు వచ్చే సమయంలో భారీ ట్రాఫిక్ జామ్‌లను కూడా నివారించి, ప్రత్యేక ఆకర్షనీయ ప్రదేశంగా రూపొందించవచ్చు.
13 ఏళ్ల క్రితమే ప్రతిపాదనలు..
జూరాల ప్రాజెక్టు భద్రతపై 2012లో ప్రాజెక్టుల నిపుణులు ఎన్.ఈశ్వరప్ప, కె.సత్యనారాయణలతో తనిఖీలు నిర్వహించారు. వారు కట్టపై నుంచి భారీ వాహనాల రాకపోకలను నిషేధించి, కట్ట దిగున హై లెవల్ రోడ్డు బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదించారు. అధికారులు సర్వే నిర్వహించి.. డిజైన్ల కోసం సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ హైదరాబాద్‌కు ప్రతిపాదనలు పంపారు. అయితే హైలెవల్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణం కిలోమీటర్‌పైన చేపట్టబోతున్న పక్షంలో ఆర్‌అండ్‌బీ ద్వారా పనులు చేపట్టాలని సూచించింది. ఆర్‌అండ్‌బీ అధికారులు నివేదిక రూపొందించి, రూ.120 కోట్లను జమ చేయాలని నీటిపారుదల విభాగాన్ని అభ్యర్థించారు. ఆ తర్వాత కూడా ఆలస్యమైంది. తర్వాత 2018లో తుమ్మిళ్ల ఎత్తిపోల పథకం వద్ద అప్పటి ఇరిగేషన్ ఈఎన్‌సీ.. ఆర్‌అండ్‌బీకి నిధులు బదిలీ చేయడానికి బదులుగా సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ద్వారానే పూర్తి సర్వే, మ్యాపింగ్, డిజైన్లు సిద్ధం చేయాలని మౌఖికంగా ఆదేశించారు. సీడీవో నుంచి దానికి సంబంధించిన డిజైన్లు 2021లో రూపొందించి పంపించారు. మార్చి 16, 2022లో డ్యామ్ సేప్టీ ప్యానెల్ కూడా పరిశీలించి ప్రాజెక్టుపై నుంచి రాకపోకలను నిషేధించి.. దిగువన బ్రిడ్జి నిర్మాణం చేయాలని సూచించింది. అయినా నిధుల విడుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇరిగేషన్ నుంచి ఆర్‌అండ్‌బీకి, ఆర్‌అండ్‌బీ నుంచి ఇరిగేషన్‌కు ఇలా ప్రతిపాదనల ఫైల్ కదిలింది కానీ బ్రిడ్జి మంజూరు కాలేదు. తాజాగా దాదాపు అదే డిజైన్లతో ఆర్‌అండ్‌బీ ద్వారా పనులు చేపట్టడానికి ప్రస్తుత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. స్వల్ప మార్పులు చేర్పులు మినహా దాదాపు పాత డిజైన్‌లాగానే డీపీఆర్ ఉండనుంది.
Updated Date - Jul 02 , 2025 | 11:37 PM