జనరల్ ఆసుపత్రిని శుభ్రంగా ఉంచాలి
ABN, Publish Date - Jun 23 , 2025 | 11:14 PM
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని వార్డులు, ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు.
- కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్‌నగర్ (వైద్యవిభాగం), జూన్ 23 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని వార్డులు, ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన వెల్‌నెస్ సెంటర్, రోగులకు అందించే భోజనం నాణ్యత, వంటగదులు, ఎంసీహెచ్ భవనంలోని వార్డులు, లేబర్ రూం, ఓపీ విభాగాలు, అధికారులు, డాక్టర్లు, ఉద్యోగులు, వైద్య సిబ్బంది హాజరు పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మెడికల్ సర్జికల్ గదుల్లో డ్రైనేజీ వ్యవస్థ మరమ్మతు చేసేందుకు టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వెల్‌నెస్ సెంటర్‌లో ఫార్మసీ, శాంపిల్స్ తీసుకునే ప్రదేశాలను వేరే చోటుకు మార్చాలని సూచించారు. ఆసుపత్రిలో కరెంటు పోయిన వెంటనే ఆటో స్టార్టప్ సౌకర్యం ఉండేలా చూడాలన్నారు. రోగులకు అందించే భోజనం నాణ్యతగా ఉండాలని, ఏవైనా లోపాలు ఉంటే లైసెన్సును రద్దు చేస్తానన్నారు. అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ సంపత్‌కుమార్ సింగ్, డీఎంహెచ్‌వో కృష్ణ ఉన్నారు. అంతకుముందు జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీలో రూ.22.50 లక్షల వ్యయంతో యూనియన్ బ్యాంకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా అందజేసిన సెంట్రల్ ఏసీ అంబులెన్స్‌ను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. యూనియన్ బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ భాస్కర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ సత్యనారాయణ, మేనేజర్ మురళికృష్ణ, రెడ్‌క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్, వైస్ చైర్మన్ డాక్టర్ శ్యామ్యూల్, రాష్ట్ర, జిల్లా ఎగ్జిక్యూటీవ్ సభ్యులు రమణయ్య, తిరుపతిరెడ్డి, మేనేజర్ నరసింహ, సిబ్బంది వసుంధర, లత, రవి, ఆంజనేయులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 156 దరఖాస్తులు
మహబూబ్‌నగర్ కలెక్టరేట్ : ప్రజావాణికి జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి 156 ఫిర్యాదులు అందాయి. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్‌రావు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
Updated Date - Jun 23 , 2025 | 11:14 PM