కన్నోళ్లకు కన్నీళ్లు.. గడప దాటి కష్టాలు
ABN, Publish Date - May 29 , 2025 | 11:21 PM
ఆకర్షణనే ప్రేమ అని భావిస్తున్నారు... వెనుకా ముందు ఆలోచించడం లేదు.. పెద్దల పరువు, ప్రతిష్ఠలను పట్టించుకోవడం లేదు..
- ఇల్లు వదిలి వెళ్తున్న బాలికలు, యువతులు
- ప్రేమ పేరుతో వెళ్లి, కొన్నాళ్లకు తిరిగొస్తున్న జంటలు
- ఉమ్మడి జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న మిస్సింగ్ కేసులు
- చట్టాలు, కేసులపై అవగాహన లేక అవస్థలు
- పోక్సో కేసులు నమోదైతే మరిన్ని ఇబ్బందులు
మహబూబ్‌నగర్, మే 29 (ఆంధ్రజ్యోతి) : ఆకర్షణనే ప్రేమ అని భావిస్తున్నారు... వెనుకా ముందు ఆలోచించడం లేదు.. పెద్దల పరువు, ప్రతిష్ఠలను పట్టించుకోవడం లేదు.. భవిష్యత్తు ఏమవుతుందన్న బెంగ లేదు.. బాలికలు, యువతులు కన్నవారిని కాదని గడప దాటుతున్నారు.. నమ్మిన వాడి వెంట వెళ్లి నట్టేట మునుగుతున్నారు. ఈ పరిస్థితికి సామాజిక మాధ్యమాలు కూడా ఓ కారణమని చెప్పవచ్చు.. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు, ఇంటర్‌నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చాయి. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితరాల్లో ఒకరితో ఒకరికి పరిచయాలు పెరుగుతున్నాయి.. ఆ పరిచయాలు హద్దులు దాటుతున్నాయి.. ఎవరు ఎవరితో ప్రేమలో పడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొన్నది. మైనర్లమా? మేజర్లమా అన్న ధ్యాస కూడా ఉండటం లేదు. ప్రేమించుకోవడం.. ఇంట్లోంచి వెళ్లిపోవడం.. మోసపోయామని తెలుసుకొని తిరిగి రావడం సాధారణమయ్యింది. దీంతో కన్నవాళ్లకు కన్నీళ్లు.. గడప దాటిన వారికి కష్టాలు తప్పడం లేదు.
అనాలోచిత నిర్ణయాలతో అనర్థాలు
బాలికలు, యువతులు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో అనర్థాలు జరుగుతున్నాయి. కొందరు మైనారిటీ తీరకముందే ప్రేమలో పడుతుండగా, మరికొందరు సరిగ్గా 18 సంవత్సరాలు నిండిన వెంటనే వెళ్ళిపోతున్నారు. అవతలి వ్యక్తిని గుడ్డిగా నమ్మి ఇంటి నుంచి వెళ్లిపోతున్న వారు కన్నవారి గురించి ఏమాత్రమూ ఆలోచించడం లేదు.. దీంతో తల్లిదండ్రులతో పాటు తోబుట్టువులు ఇబ్బందులకు గురవుతున్నారు. జీవితంపై అవగాహన, భవిష్యత్తుపై ఆలోచన లేకుండా ఇల్లు వదిలిన వారు కష్టాలపాలవుతున్నారు. వారిలో చాలా మంది తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ప్రతి ఏడాది వేసవి, పెళ్లిళ్ల సీజన్లో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఒక్క జిల్లాలోనే 180 మంది మిస్సింగ్
ఉమ్మడి పాలమూరు జిల్లాలో బాలికలు, యువతుల మిస్సింగ్ కేసులు కలవరానికి గురి చేస్తున్నాయి.. గత ఏడాది ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే 180 మంది, ఈ ఏడాది మే 25 నాటికి 80 మంది ప్రేమ పేరుతో ఇంట్లోంచి వెళ్ళిపోయినట్లు పోలీస్ రికార్డులు చెప్తున్నాయి. ఉమ్మడి పాలమూరులో గత ఏడాది దాదాపు 725 మంది, ఈ ఏడాది ఇప్పటి వరకు 276 మంది గడప దాటారు. ఇవి పోలీస్‌స్టేన్లకు ఫిర్యాదులు వచ్చి నమోదైన కేసులు మాత్రమే. పోలీస్‌స్టేషన్ వరకు వెళ్ళకుండా గుట్టుగా సెటిల్ చేసుకున్నవి.. పరువు కోసం వదిలేసిన కేసులు రికార్డుల్లో నమోదైన గణాంకాల కన్నా ఎక్కువగా ఉంటాయి. ఇలా కన్నోళ్ళను కన్నీళ్ళు పెట్టిస్తున్న ఉందంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీస్‌స్టేషన్లలో మిస్సింగ్ కేసు నమోదైనా, వారం రోజులకే పెళ్ళి చేసుకుని రావడం, లేదంటే తాము మేజర్లమని రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
గత ఏడాది 342 పోక్సో కేసులు
మిస్సింగ్ కేసులతో పాటు పోక్సో కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గతేడాది ఉమ్మడి పాలమూరు జిల్లాలో 342 పోక్సో కేసులు నమోదుకాగా, ఈ ఏడాది ఒక్క పాలమూరు జిల్లాలోనే 5 నెలల్లో 44 కేసులు నమోదయ్యాయి. పోక్సో కేసుల్లో రెండు రకాలుంటాయి. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినా, మైనారిటీ తీరకముందు ఇద్దరూ ఇష్ఠపడి ప్రేమ పేరుతో వెళ్ళినా, పెళ్ళి చేసుకున్నా పోక్సో కేసు నమోదవుతుంది. అలాగే అమ్మాయికి 18 ఏళ్ళు, అబ్బాయికి 21 ఏళ్ళు నిండకుండా ఇష్ట ప్రకారం పెళ్ళి చేసుకున్నా బాధితుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదవుతుంది. ఇదే నెలలో ఓ ప్రేమ జంట జిల్లా కేంద్రంలోని ఓ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. తామిద్దరం మేజర్లమేనని, రక్షణ కల్పించాలని కోరింది. తీరా వారి వయసు ధ్రువీకరణ పత్రాలను పోలీసులు పరిశీలించగా, అమ్మాయి మేజర్‌గా కాగా, అబ్బాయికి 19 ఏళ్ళు ఉన్నాయి. దీంతో కేసు బుక్ చేస్తామని పోలీసులు చెప్పడంతో ఆ జంట కన్న వారి చెంతకు చేరింది. ఒక వేళ పోక్సో కేసు నమోదయితే రెండు, మూడు నెలల వరకు బెయిల్ కూడా లభించదు.
చాలా మంది ఆగం అవుతున్నారు
సీనియర్ న్యాయవాది ఉమామహేశ్వరి : ప్రేమ పేరుతో ఆగం అవుతున్నారు. చాలామంది ప్రేమ పే రుతో ఇల్లు వదిలి వెళ్లి, మోసపోయి తిరిగి వస్తున్నా రు. శారీరక వాంఛ తీరిన తరువాత అతడు వదిలే యడంతో సదరు యువతి బాధితురాలిగా మారి పో లీసులను ఆశ్రయిస్తోంది. కేసు ట్రయల్ నడుస్తుండగానే బాధిత మహిళ బిడ్డకు జన్మనివ్వడం, బిడ్డతో సహా కోర్టులకు హాజరవుతున్న కేసులు ఎన్నో ఉన్నాయి.
బాధితులకు ‘భరోసా’
సుజాత, ఎస్‌ఐ, భరోసా ఇంచార్జి : ప్రేమ పేరుతో మోసపోయి భరోసాను ఆశ్రయించిన ఓ బాలికకు క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ ఇచ్చి,. కంప్యూటర్ శిక్షణ ఇవ్వడంతో ఆమెలో మార్పు వచ్చింది. సరైన వయసు రాకుండా ఇష్టపూర్వకంగా వెళ్లిపోయినా, పెళ్లి చేసుకున్నా పోక్సో కేసు నమోదై, అబ్బాయి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఒక్కోసారి ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలిసినా, బెదిరించి పెళ్ళి సంబంధాలు చూస్తుండటంతో ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు. సోషల్‌మీడియా పరిచయాలతో కూడా చాలా మంది గడప దాటుతున్నారు. ప్రేమ, పెళ్లికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకునే ముందు భవిష్యత్తును ఆలోచించుకోవాలి.
Updated Date - May 29 , 2025 | 11:21 PM