మాతృభూమి రక్షణలో అమరుడైన శేఖర్
ABN, Publish Date - Jul 25 , 2025 | 11:12 PM
దేశానికి సేవ చేయాలన్నది అతడి లక్ష్యం... గుండె నిండా సంకల్పం అతడిని ముందుకు నడిపించింది. అందుకు స్నేహితుల ప్రోత్సాహం తోడయ్యింది.
- 1996లో భారత సైన్యంలో చేరిన శేఖర్
- 1999 కార్గిల్ యుద్ధంలో విధి నిర్వహణ
- ఆర్మీ క్యాంపుపై ముష్కరుల దాడిలో మృతి
- రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేటికీ అందని పరిహారం
- నేడు కార్గిల్ విజయ్ దివస్
దేశానికి సేవ చేయాలన్నది అతడి లక్ష్యం... గుండె నిండా సంకల్పం అతడిని ముందుకు నడిపించింది. అందుకు స్నేహితుల ప్రోత్సాహం తోడయ్యింది. ఆర్మీ ర్యాలీలో పాల్గొని తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించి భారత సైన్యంలో చేరాడు. కార్గిల్ యుద్ధ సమయంలో విధుల్లో ఉండగా, ఆర్మీ క్యాంపుపై శత్రు మూకలు దాడి చేయడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో అతడు కూడా ఉన్నాడు. అతడే మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కామారం గ్రామానికి చెందిన శేఖర్. నేడు (శనివారం) కార్గిల్ విజయదివస్ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..
- నవాబ్‌పేట (ఆంధ్రజ్యోతి)
మాతృ భూమి రక్షణ కోసం సైన్యంలో చేరిన శేఖర్ కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్‌నగర్ జిల్లా, నవాబ్‌పేట మండలం కామారం గ్రామానికి చెందిన రామచంద్రయ్యాచారి, రాధమ్మ దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. వారిలో మూడవ కుమారుడు శేఖర్ యన్మనగండ్ల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకుంటూ అన్నలకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. 1996లో తిరుపతి పట్టణంలో ఆర్మీ ర్యాలీ జరుగుతోందని స్నేహితుల ద్వారా అతడికి తెలిసింది. వారి ప్రోత్సాహంతో దరఖాస్తు చేసుకొని ర్యాలీలో పాల్గొన్నాడు. తొలి ప్రయత్నంలోనే సైన్యంలో ఉద్యోగం సాధించి 19-మద్రాస్ విభాగంలో చేరి, జమ్ము కశ్మీర్లో విధులు నిర్వహిస్తుండేవాడు. 1999, నవంబర్ 24న అతడు పూంచ్ సెక్టర్ వద్ద విధుల్లో ఉండగా, ఆర్మీ క్యాంపుపై ముష్కరులు దాడి చేశారు. ఈ దాడిలో శేఖర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ అధికారులు ఈ విషయాన్ని టెలిగ్రాం ద్వారా అతడి కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతదేహాన్ని అతడి స్వగ్రామానికి తరలించింది. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. అప్పటి మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శంకర్ రావు, ఎర్రశేఖర్‌లతో పాటు, కలెక్టర్ అనంతరాములు పాల్గొన్నారు.
సన్మానాలతో సరి..
కార్గిల్ యుద్ధంలో శేఖర్ మరణించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అతడి కుటుంబంపై అపారమైన సానుభూతి వ్యక్తమయ్యింది. ఆయన ప్రాణత్యాగం వృథా కాదంటూ ఎంతో మంది కొనియాడారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు అతడి కుటుంబ సభ్యులను సన్మానించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మండల కేంద్రంలో శేఖర్ విగ్రహం ఏర్పాటు చేస్తామంటూ పలువురు ముందుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అతడి కుటుంబానికి రూ.7.50 లక్షల పరిహారం అందింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.5 లక్షలు, 300 గజాల స్థలం ఇవ్వాల్సి ఉండింది. కానీ రూ. 5 వేలు మాత్రమే ప్రభుత్వం చెప్పడంతో కోర్టును ఆశ్రయించారు. కానీ ఇప్పటివరకు పరిహారం మాత్రం అందలేదు. ఈ వి షయంపై శేఖర్ సోదరుడు ఈశ్వరయ్య, తల్లి రాధమ్మ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గత ఏడాది కార్గిల్ దివస్ సందర్భంగా జిల్లా కేంద్రంలో శేఖర్ తల్లి రాధమ్మను ప్రస్తుత పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డిలు ఘనంగా సన్మానించారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు రావలసిన పరిహారం, ప్లాటు ఇవ్వాలని శేఖర్ సోదరుడి కుమారుడు సత్యం విజ్ఞప్తి చేస్తున్నారు.
Updated Date - Jul 25 , 2025 | 11:12 PM