ప్రభుత్వంపై ఆర్టీసీ ఉద్యోగుల్లో అసంతృప్తి
ABN, Publish Date - Jul 01 , 2025 | 11:23 PM
రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్టీసీ ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందని, సమ్మె అనివార్యమైతే ఇందుకు యజమాన్యం, ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు.
టీఎంయూ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి
మహబూబ్‌నగర్ టౌన్, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్టీసీ ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందని, సమ్మె అనివార్యమైతే ఇందుకు యజమాన్యం, ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వీవీ కన్వేన్షల్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకోవాలని, ఎన్నికల ముందు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చాన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రెండు పీఆర్‌సీ బకాయిలతో పాటు సమస్యలు పరిష్కరించాలన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని, అప్పుడు ఉద్యోగులు తమ వంతుగా ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామని స్పష్టం చేశారు. డిమాండ్ల సాధన కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలనే ఆలోచనతో అన్ని సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పాటు అవుతున్నాయని, త్వరలోనే సమావేశం కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆ దిశగానే ప్రతీ జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్తే అందుకు బాధ్యత ప్రభుత్వం ఇటు యాజమాన్యం వహించాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగుల పని గంటలు పెంచడంతో మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం, యాజమాన్యం స్పందించి వెంటేనే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రవీందర్‌రెడ్డి, డీఎస్ చారి, భానుప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Jul 01 , 2025 | 11:23 PM