నాణ్యమైన భోజనం అందించాలి
ABN, Publish Date - Jul 04 , 2025 | 11:13 PM
జిల్లాలోని గురుకుల పాఠశాలలు, హాస్టళ్లను కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్లు శుక్రవారం తనిఖీ చేశారు. దేవరకద్ర మండల కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాల, బీసీ హాస్టల్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు.
గురుకులాలు, హాస్టళ్ల తనిఖీలో కలెక్టర్ విజయేందిర బోయి
దేవరకద్ర/ జడ్చర్ల/ బాలానగర్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గురుకుల పాఠశాలలు, హాస్టళ్లను కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్లు శుక్రవారం తనిఖీ చేశారు. దేవరకద్ర మండల కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాల, బీసీ హాస్టల్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు, విద్యను అందించాలని చెప్పారు. మంచి కూరగాయలతో వంట చేయాలన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు ఎంతో ఖర్చు చేస్తోందన్నారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి.. చదువుపై శ్రద్ధ పెట్టేలా చూడాలన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ కృష్ణయ్య పాల్గొన్నారు.
జడ్చర్ల, బాలానగర్ మండలాల్లో తనిఖీ చేసిన అదనపు కలెక్టర్లు
జడ్చర్ల మండలంలోని పలు గురుకుల పాఠశాలలను అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ శుక్రవారం తనిఖీ చేశారు. జడ్చర్ల పట్టణంలోని మైనారిటీ బాలికలు, బాలుర, కల్వకుర్తి రోడ్డులో ఉన్న ఊర్కొండ సాంఘిక సంక్షేమ, ఆలూరు రోడ్డులోని నవాబ్‌పేట, చిట్టబోయిన్‌పల్లి బాలికల, పోచమ్మగడ్డ తండా వద్ద ఉన్న బాలానగర్ గిరిజన బాలుర, మల్లెబోయిన్‌పల్లి వద్ద ఉన్న మినీ గిరిజన, కోడ్గల్‌లోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలను తనిఖీ చేశారు. పారిశుధ్యం, టాయిలెట్స్, తాగునీరు, భోజనం సరిగా ఉన్నాయా? అని పరిశీలించారు. బాలానగర్ మండల కేంద్రంలోని జనరల్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల, ఏకలవ్య మోడల్ పాఠశాలలను అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ తనిఖీ చేశారు. భోజనశాల, వంటశాల, మరుగుదొడ్లను పరిశీలించారు. పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మెనూ ప్రకారం భోజనం అందించాలని చెప్పారు. ఎప్పటి కూరగాయలు అప్పుడే వండాలన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Updated Date - Jul 04 , 2025 | 11:13 PM