అడుగడుగునా గుంతలే..
ABN, Publish Date - Jun 23 , 2025 | 11:16 PM
అసలే పలుచోట్ల బీటీ రోడ్లకు మరమ్మతులు లేక కంకర తేలి లోతైన గుంతలు పడగా.. ఇటీవల కురిసిన వర్షాలతో అవి కాస్త మరింత అధ్వాన స్థితికి చేరుకున్నాయి.
- గతుకుల బాటతో గమ్యం చేరడమెలా?
- ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
మూసాపేట, జూన్ 21 (ఆంధ్రజ్యోతి) : అసలే పలుచోట్ల బీటీ రోడ్లకు మరమ్మతులు లేక కంకర తేలి లోతైన గుంతలు పడగా.. ఇటీవల కురిసిన వర్షాలతో అవి కాస్త మరింత అధ్వాన స్థితికి చేరుకున్నాయి. దీంతో అత్యవసర సమయాల్లో ప్రయాణికులు, వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అడ్డాకుల, మూసాపేట మండలాలకు చెందిన వాహనదారులు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి వెళ్లడానికి దూరభారం తగ్గుతోందని గాజులపేట రోడ్డు మార్గం ద్వారా నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. 44వ జాతీయ రహదారి గాజులపేట స్టేజీ నుంచి గ్రామం దాక బీటీ రోడ్డు గుంతలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే విధంగా 44వ జాతీయ రహదారి వేముల స్టేజీ నుంచి రాయచూరు రోడ్డు వరకు మంజూరైన బీటీ రోడ్డు పనులు ఏళ్ల తరబడి అసంపూర్తిగా వదిలేయడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డు 17.3 కిలో మీటర్ల దూరానికి 2017లో రూ.17 కోట్లు మంజూరు కావడంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ అక్కడక్కడ ఐదు కిలో మీటర్లు పనులు చేసి, కొన్ని చోట్ల కిలో మీటర్ల వరకు కంకర పోసి బిల్లులు రావడం లేదని వదిలేశారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధితశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని స్థానికులు చెబుతున్నారు. వేముల రోడ్డు కంపెనీ దాటిన తర్వాత, వేముల బస్టాండ్ నుంచి గ్రామ శివారు చెరువు కట్ట దాక కంకర వేసి వదిలేశారు. లక్ష్మిపల్లి, అజిలాపూర్, చౌదర్‌పల్లి శివారులో కూడా పలు చోట్ల గుంతలు పడ్డాయి. నియోజకవర్గ కేంద్రానికి ఈ రోడ్డు ఎంతో ప్రధానమైంది. నిత్యం ఈ రోడ్డు మార్గం ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులు దేవరకద్రకు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ విషయంలో అధికారులు చొరవ తీసుకొని పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. అడ్డాకుల మండలం కందూరు, కాటవరం, తిమ్మాయిపల్లి, పొన్నకల్, రాచాల బీటీ రోడ్లు కూడా గుంతలు పడటంతో మరమ్మతులు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అదే విధంగా మూసాపేట మండలం చక్రాపూర్, కనకపూర్ బీటీ రోడ్డు అసంపూర్తి పనులు చేపట్టాలని, పోల్కంపల్లి నుంచి కప్పెట దాక అసంపూర్తి రోడ్డు పనులతో పాటు మూసాపేట నుంచి నిజాలాపూర్ రోడ్డు గుంతలకు మరమ్మతు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Updated Date - Jun 23 , 2025 | 11:16 PM