సొరంగం పనులు చేపట్టేందుకు ఎన్‌జీఆర్‌ఐ సర్వే
ABN, Publish Date - Jun 20 , 2025 | 11:41 PM
శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) పనులు జరుగుతున్న క్రమంలో ఫిబ్రవరి 22 పైకప్పు కూలి సరిగ్గా నాలుగు నెలలు అవుతున్నది.
- ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం జరిగి సరిగ్గా రెండు నెలలు
- ఘటనలో ఎనిమిది మంది గల్లంతు
- నేటికీ లభించని ఆరుగురి ఆచూకీ
- డీబీఎం విధానంలో సొరంగం పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వ నిర్ణయం
దోమలపెంట, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) పనులు జరుగుతున్న క్రమంలో ఫిబ్రవరి 22 పైకప్పు కూలి సరిగ్గా నాలుగు నెలలు అవుతున్నది. సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు దేశ విదేశాలు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి రోజుకు 800 మంది 60 రోజులు శ్రమించి ఇద్దరు కార్మికుల మృతదేహాలను వెలికి తీశారు. మిగతా ఆరుగురిని ప్రస్తుతానికి బయటకు తీయడం కష్టసాధ్యమని భావించిన ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల పరిహారం అందించారు. 14వ కిలో మీటర్ ప్రాంతంలో పైకప్పు కూలిన 50 మీటర్ల ప్రాంతం అత్యంత ప్రమాదకరంగా వివిధ సర్వే సంస్థలు సూచించడంతో అక్కడ ఎటువంటి పనులు చేపట్టకుండా నిషేధిత ప్రాంతంగా గుర్తించి ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి జేపీ కంపెనీ సిబ్బంది ఊట నీటిని నిరంతరాయంగా కృష్ణానదిలోకి తరలిస్తున్నారు.
టన్నెల్ పనులు కొనసాగేందుకు టెక్నికల్ కమిటీ
ఇన్‌లెట్-1 దోమలపెంట నుంచి 14వ కిలో మీటర్ దగ్గర శిథిలాలు కూలి పడటంలో పెద్ద ప్రమాదం సంభవించింది. ఇక ముందు సొరంగాన్ని తొలిచేందుకు డీబీఎం పద్ధతి అవలంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సొరంగ మార్గం 44 కిలో మీటర్లు అంతా కూడా అమ్రాబాద్ అభయారణ్యంలో ఉన్నందున తప్పనిసరి అటవీ శాఖ అనుమతులు ఉంటే తప్పా పనులు ముందుకు సాగవు. కనుక తవ్వకాల పనులు ముందుకు సాగేందుకు పర్వావరణ అనుమతులు పొందేందుకు ప్రభుత్వం గత రెండు నెలల క్రితం 12 శాఖలకు చెందిన అధికారులతో టక్నికల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఎన్‌డీఆర్‌ఎఫ్, సీఎస్‌ఐఆర్, జీఎస్‌ఐ, ఎన్‌సీఎస్, ఆర్మీ, పీసీసీఎఫ్, డిజాస్టర్ మెనేజ్‌మెంట్, ఎస్‌డీఆర్‌ఎఫ్, సీడీవో, కలెక్టర్, ఎస్పీ, ఎస్‌ఎల్‌బీసీ చీఫ్ ఇంజనీర్, అనుసంధానంగా మరికొన్ని ఇతర శాఖలు పని చేయనున్నాయి. ఈ పనులను రాక్ మెకానిక్ చీఫ్ సైంటిస్టు మైథాని సూచనల చేరకు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
జూలైలో ఎలక్ర్టో మాగ్నటిక్ సర్వే
మిగిలిన 9.53 కిలో మీటర్ల సొరంగపు పనులు పూర్తి చేసేందుకు డీబీఎం పద్ధతిలో సొరంగాని తవ్వేందుకు టెక్నికల్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం సొరంగం ప్రమాదం జరిగిన 14వ కిలోమీటర్ ప్రదేశం భూమిపైభాగం నుంచి 469 మీటర్ల లోతులో సొరంగంలో శిథిలాలు కూలిపోయాయి. గతంలోనే ఇక్కడ 13.5 కిలో మీటర్ నుంచి 15వ కిలో మీటర్ వరకు భూమి పొరలలో బురదమట్టి, కొండ రాళ్లు, నీటి ప్రవాహం ఉన్నట్లు ఎన్‌జీఆర్‌ఐ, జీఎస్‌ఐ, ఎన్‌సీఎస్ సంస్థలు ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందించారు. ఇక ముందు ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా అధ్యయనం చేసేందుకు జూలై మూడో వారంలో హెలికాప్టర్ ద్వారా ఎలక్ర్టో మాగ్నటిక్ సర్వేను చేసేందుకు పూనుకున్నది. ప్రమాదం జరిగిన ప్రాంతం తాటిగుండాల, టేకుల సారువ, కుడితి పెంట, పొక్కటిరేగుపెంట, బీకే తిర్మాలాపూర్, వంకేశ్వరం రామునిసెల, నాగేశ్వరం బండల ప్రాంతాల్లో హెలికాప్టర్ సర్వే సేసేందుకు ముందస్తుగా ఎన్‌జీఆర్‌ఐ, ఇరిగేషన్ శాఖ, అటవీశాఖ అధికారులు నల్లమల అటవీ ప్రాంతంలో సర్వే ఫాయింట్లను గుర్తిస్తున్నారు. ప్రస్తుతం సేర్వే చేయాల్సిన ప్రాంతం అంతాకూడా కొండలు, లోయలు, దట్టమైనా అటవీ ప్రాంతం ఉన్నందున భూమి నుంచి నడుచుకుంటూ సర్వే చేయడం కష్టంగా ఉంటుందని, అందుకు హెలికాప్టర్ సహాయంతో సర్వే చేయనున్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
అమ్రాబాద్ అభయారణ్యంలోనే..
శ్రీశైలం ఎడమ గట్టు సొరంగపు పనులు జరుగుతున్న 44 కిలో మీటర్లు పూర్తిగా అమ్రాబాద్ అభయారణ్యం పరిధిలో ఉన్నందున పర్యావరణం, అటవీశాఖ అనుమతులు పొందేందుకు ప్రధానంగా ఎలకో్ట్ర మాగ్నటిక్ సర్వే రిపోర్టు ప్రదానం కానుంది. ఎన్‌జీఆర్‌ఐ, జీఎస్‌ఐ సంస్థలు ఇచ్చే నివేదిక అనంతరం డీబీఎం పద్ధతిలో సొరంగం తవ్వేందుకు కేంద్రం నుంచి అనుమతులు వస్తాయని అటవీశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Updated Date - Jun 20 , 2025 | 11:41 PM